తాళం వేసి వెళ్తే.. ఇల్లు గుల్లే

తాళం వేసి వెళ్తే.. ఇల్లు గుల్లే


►వరుస చోరీలతో బెంబేలు

► అడ్డుకట్ట పడేదెప్పుడు..?

►  భయాందోళనలో ప్రజలు




కామారెడ్డి క్రైం(కామారెడ్డి): జిల్లాలో జరుగుతున్న వరుస చోరీలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో దుండగులు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్‌ చేసుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు. తెల్లవారగానే ఏదో ఒక కాలనీలో రాత్రిపూట జరిగిన చోరీ సంఘటన వెలుగుచూస్తోంది.


తాళం వేసి ఎటైనా వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. పోలీసులు పెట్రోలింగ్‌కు సైతం కళ్లు గప్పి దుండగులు ఇళ్లు, దుకాణాలను గుల్ల చేస్తున్నారు. చోరీల నివారణకు పోలీసుశాఖ అన్నిరకాల చర్యలు తీసుకుంటు న్నా సత్ఫలితాలు రావడం లేదు. మరిం త అప్రమత్తంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. గత మూడు వారాల్లో జిల్లా కేంద్రంలో మూడు చోట్ల చోరీలు జరిగాయి. జిల్లాలోని ఆయా పట్టణాలు, గ్రామాల్లో చాలా సంఘటనలు వెలుగు చూశాయి.



ఒకే తరహా సంఘటనలు..

వారం క్రితం కామారెడ్డి కొత్త బస్టాండ్‌కు సమీపంలోని చర్చి కాంప్లెక్స్‌లో ఉన్న మూడు దుకాణాల్లో చోరీ జరిగింది. మూడు దుకాణాల్లోనూ ఒకే దుండగుడు వెనక భాగంలోని వెంటి లేటర్‌ పగలగొట్టి లోనికి చొరబడ్డాడు. కిరాణం షాపులో నగదు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లాడు. మెడికల్‌ షాపులో సీసీ కెమెరా పుటేజీని పరిశీలించగా దుకాణంలోకి చోరబడిన దొంగ గడ్డపారతో కౌంటర్‌ను పగలగొట్టి నగదు దోచుకున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఈ దుండగుడిని కామారెడ్డి పట్టణ పోలీసులు మూడు రోజుల క్రితం పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.


15రోజుల క్రితం అశోక్‌నగర్‌ కాలనీలోని కర్ర శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఇంటి తాళం పగలగొట్టిన దుండగులు నగదు, బంగారం అపహరించారు. తాజాగా నేతాజీ నగర్‌ కాలనీకి చెందిన హరినాథం అనే వ్యక్తి ఇంట్లో తాళం పగలగొట్టి చోరీ చేశారు. ఇలా వరుస సంఘటనలు చోటు చేసుకోవడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జూలై 16న బాన్సువాడలోని చైతన్య కాలనీలో ఓ తాళం వేసిన ఇంట్లో దుండగులు పడి అందినకాడికి దోచుకున్నారు. జూలై 12న నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయికి సమీపంలోని తిర్మన్‌పల్లి లో చోరులు మూడిళ్లలో చోరీలకు పాల్ప డ్డారు. జూలై 7న నవీపేటలోని 8 చోట్ల దొంగలు స్వైరవిహారం చేసి హంగామా సృష్టించిన విషయం తెలిసిందే.



అప్రమత్తం కావాల్సిందే..

చోరీల నివారణ కోసం శాఖ పరంగా పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసుల కళ్లు గప్పి దుండగులు తమ పనికానిస్తున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన చోరీలను పరిశీలిస్తే నేర చరిత్ర కలిగి ఉన్న వారే వీటికి పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇనుపరాడ్లు, గడ్డపారలను ఉపయోగిస్తూ క్షణంలో ఇంటి తాళాన్ని పగలగొడుతున్నారు. ఇటీవల కొందరు చోరులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. అయినా చోరీలు ఆగడం లేదు. ఆరితేరిన వారే ఇదంతా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పట్టణంలోని చర్చి కాంప్లెక్స్‌లో ఒకే రాత్రి మూడు దుకాణాల్లోకి ఓ దుండగుడు చొరబడి చోరీలకు పాల్పడడమే ఇందుకు నిదర్శనం. చోరీలను ఆరికట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top