బ్యాంక్‌ వాళ్లూ తిరస్కరించారు!


► పది రూపాయల కాయిన్లు తీసుకోబోమన్న బ్యాంక్‌ అధికారులు

► గగ్గోలు పెట్టిన ఖాతాదారులు

► అయోమయంలో ప్రజలు, వ్యాపారులు




శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): పది రూపాయిల కాయిన్ల చెల్లుబాటు విషయంలో ఇప్పటికే అనేక అపోహలు నెలకొని ఉన్నాయి. వాటిని పరిష్కరించా    ల్సిన అధికారులు మరింత అయోమయానికి కారణమవుతున్నారు. కి ల్లిపాలెం ఆంధ్రా బ్యాంకులో పది రూపాయల కాయిన్లు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు.శ్రీకాకుళం నగరానికి చెందిన కోరాడ భవానీ ఆంధ్రా బ్యాంకు కిల్లిపాలెం శాఖలో 2015 అక్టోబర్‌ 5న కుమార్తె పెళ్లి కోసం ముద్రా లోన్‌ కింద రూ.50వేలు అప్పు తీసుకున్నారు. అప్పులో రూ.30వేలను అధికారులు అదే రోజున ఆమె ఖాతా లో జమ చేశారు. మిగిలిన మొత్తాన్ని డిసెంబర్‌ 8న రూ.10వేలు, జనవరి 7న మరో రూ.10వేలు ఇచ్చారు. ప్రతి నెలా రూ.1200 చొప్పున ఐదేళ్ల పాటు కట్టాలని ఈమె ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటికి 12 నెలలుగా డబ్బులు కడుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ నెల 14న 120 పది రూపాయల కాయిన్లు తీసుకుని బ్రాంచ్‌కు వెళ్లారు. అయితే కాయిన్లు తీసుకోబోమని అక్కడి అధికారులు చెప్పడంతో ఆమె తెల్లబోయారు. క్యాషి యర్, బ్యాంక్‌ మేనేజర్‌ కూడా అదే మాట చెప్పారని ఆమె ‘సాక్షి’కి వెల్లడించారు.   దీనిపై ఇతర ఖాతాదారులు గందరగోళానికి గురవుతున్నారు. పది రూపాయల కాయిన్ల చెల్లుబాటుపై ప్రజలందరికీ తెలిసేలా అవగాహన కల్పించాలని, పది కాయిన్లు తిరస్కరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

దుర్భాషలాడారు



ముద్రా లోన్‌ కింద రూ.50వేలు తీసుకున్నాను. అందులో వాయిదాలు చెల్లించేందుకు 120 పది కాయిన్లు తీసుకువెళ్లాను. వాటిని తీసుకోలేదు సరికదా మేనేజర్, క్యాషియర్‌ నన్ను దుర్భాషలాడారు. ఎంత బతిమలాడినా తీసుకోలేదు. మీ ఇంటిక తాళాలు వేస్తాం, బంధువుల జీతం నుంచి రికవరీ చేస్తామంటూ బెదిరించారు. ---కోరాడ భవానీ, పెద్దబరాటం వీధి, కళింగరోడ్డు, శ్రీకాకుళం



స్థలం లేకే తిరస్కరించాం: ఆరోపణలు చేస్తున్న ఖాతాదారులు వచ్చిన రోజు బ్యాంకులో పది కాయిన్లు ఉంచేందుకు స్థలం లేక మరుసటి రోజు రమ్మని చెప్పాం. అంతేగానీ మేం దుర్భాషలాడలేదు. వారు అలా చెప్పడం సబబు కాదు. పది కాయిన్లు తీసుకుంటున్నాం. దీనిపై సందేహాలు అక్కర్లేదు. వ్యాపారులు, ప్రజలు అందరూ పదికాయిన్లతో లావాదేవీలు జరుపుకోవచ్చు. ----కృష్ణవేణి, ఆంధ్రాబ్యాంకు మేనేజర్, కిల్లిపాలెం బ్రాంచ్‌

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top