కుట్రను తిప్పికొడతాం!

కుట్రను తిప్పికొడతాం!

= ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేస్తారా..?

= విలీన నిర్ణయం విరమించకపోతే దేశవ్యాప్త ఉద్యమం

= కేంద్ర ప్రభుత్వ చర్యలపై బ్యాంకర్లు, కార్మిక సంఘాల మండిపాటు

= ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఒంగోలులో బైక్‌ ర్యాలీ

= జిల్లా వ్యాప్తంగా మూతపడిన బ్యాంకులు

= రూ.400 కోట్ల మేర నిలిచిపోయిన లావాదేవీలు

ఒంగోలు :  కార్పొరేట్‌ శక్తులను బలపరిచి, ప్రయివేటు శక్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేయాలనే కుట్రను కేంద్రప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని బ్యాంకర్లు, కార్మిక సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. లేకుం టే దేశవ్యాప్తంగా ప్రజ మద్దతుతో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం ఒంగోలు నగరంలోని కోర్టు స్ట్రీట్‌లోని ఆంధ్రాబ్యాంకు నుంచి నెల్లూరు బస్టాండు వద్దగల మెయి న్‌ బ్రాంచి వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు ఎంప్లాÄæూస్‌ యూనియన్‌ జిల్లా కన్వీనర్‌ వి.పార్థసారథి మాట్లాడుతూ జాతీయ బ్యాంకర్ల కమిటీ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా బ్యాంకులు మూతపడడంతో రూ.400 కోట్ల లావాదేవీలు నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వ చర్యలే కారణమని ధ్వజమెత్తారు.

బ్యాంకర్ల సమ్మెకు సీఐటీయూ మద్దతు..

ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి ఆర్‌.రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ ఒకప్పుడు ప్రయివేటు శక్తుల చేతుల్లో ఉన్న బ్యాంకులను ప్రభుత్వ రంగంలోకి తీసుకురావడానికి పోరాడాల్సి వచ్చిందని, కానీ నేడు వాటిని ప్రయివేటు పరం చేసేందుకు యత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను సీఐటీయూ ఖండిస్తోందన్నారు. బ్యాంకర్లు చేపట్టిన సమ్మెకు తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఏబీఏఈ నాయకులు వెలిది రామచంద్రరావు మాట్లాడుతూ రైతాంగానికి, వ్యవసాయానికి, గ్రామీణాభివృద్ధికి రుణాలు అందిస్తున్నది ప్రభుత్వ రంగ బ్యాంకులే అని, ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవన్నారు. ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం నాయకుడు పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ జనరల్‌ ఇన్సూ్యరెన్స్‌ కంపెనీలు నాలుగు ఉన్నాయని, వాటిని విలీనం చేయడం ద్వారా మాత్రమే ప్రైవేటు పోటీని తట్టుకోగలమని ఏళ్ల తరబడి కోరుకుంటున్నా పట్టించుకోని ప్రభుత్వాలు.. నేడు బాగున్న వాణిజ్య బ్యాంకులను విలీనం చేయాలనే నిర్ణయాన్ని తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశరావు, ఐఎన్‌టీయూసీ నాయకులు వీరాస్వామి, సీపీఎం నాయకులు దామా శ్రీనివాసరావు, ఆంధ్రాబ్యాంకు ఉద్యోగుల సంఘ  నాయకుడు రాజేశ్వరరావు, ఎన్‌సీబీఈ నాయకులు విజయ్‌మోహన్, వి.శ్రీనివాసరావు, ఎస్‌బీహెచ్‌ నాయకులు జానకిరాం, బెఫీ జిల్లా కార్యదర్శి కె.నాగరాజు తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే విలీన నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.  

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top