రాజ్యసభ తెరపైకి బాలకృష్ణ

రాజ్యసభ తెరపైకి బాలకృష్ణ - Sakshi


సుజనాను అడ్డుకునేందుకు లోకేష్ ఎత్తు

మంత్రివర్గంలోకి లోకేష్ రాకపై భిన్నాభిప్రాయాలు

శాసనసభ నుంచి ఎన్నికైతే మంచిదంటున్న సీనియర్లు, మంత్రులు

హిందూపురం లేదా పెనమలూరును ఎంచుకునే అవకాశం

దొడ్డిదారినైనా మంత్రిని చేయాలంటున్న పార్టీ నేతలు


 

సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోటరీలో కీలకంగా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రి వై.సత్యనారాయణ చౌదరి (సుజనా) ఎట్టి పరిస్థితుల్లో తిరిగి రాజ్యసభలో అడుగు పెట్టకుండా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయనకు కాకుండా వేరే ఎవరికైనా రాజ్యసభ సీటు ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. అందులో భాగంగానే తన మామ నందమూరి బాలకృష్ణను తెరపైకి తెచ్చినట్లు టీడీపీ వర్గాల సమాచారం. బాలకృష్ణకు రాజ్యసభ సీటు ఇచ్చి పెద్దల సభకు పంపాలని పార్టీ అధినేత, తండ్రి చంద్రబాబుపై లోకేష్ తీవ్ర ఒత్తిడి తెస్తున్నార ని పార్టీలో ప్రచారం జరుగుతోంది. గతంలో సుజనా చౌదరి, లోకేష్ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. చంద్రబాబును ఏ విషయంలోనైనా ఇద్దరూ ఒప్పించి, మెప్పించేవారు. అయితే పార్టీ అధికారంలోకి రావటం, కేంద్రంలో సుజనా చౌదరి మంత్రి కావటంతో ఆయన ప్రాధాన్యత యధావిధిగా కొనసాగుతోంది.

 

  కొన్ని కొన్ని విషయాల్లో చంద్రబాబు తన కుమారుడు లోకేష్ కన్నా ఆయనకే ప్రాధాన్యతనిస్తున్నారు. ఇది లోకేష్‌కు కంటగింపుగా మారింది. అదే సమయంలో సుజనాను వ్యతిరేకించే పార్టీ నేతలు ఆయనకు వ్యతిరేకంగా లోకేష్‌కు శరపరంపరగా ఫిర్యాదులు చేస్తున్నారు. సుజనా ఢిల్లీలో ఎవరినీ పట్టించుకోవటం లేదని, స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుజనాను కట్టడి చేయటం ద్వారా పార్టీలో తన మాటే వేదం అని అనిపించుకోవాలని లోకేష్ నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే తన మామ బాలకృష్ణను రాజ్యసభకు పంపాలని అధినేతను కోరినట్లు సమాచారం. పార్టీకి వచ్చే మూడు సీట్లలో ఒకటి ఎన్‌టీఆర్ కుటుంబానికి కేటాయిస్తున్నామని చెబితే ఏ నేత వ్యతిరేకించే పరిస్థితి లేదు. తనకు రాజ్యసభ సీటు కావాలని ఇప్పటికే నందమూరి హరికృష్ణ కోరారు. బాలకృష్ణను తెరపైకి తేవటం ద్వారా తమ కుటుంబంతో అంత సన్నిహిత సంబంధాలు లేని హరికృష్ణతో పాటు సుజనాకు చెక్ పెట్టాలని లోకేష్  చూస్తున్నారని సమాచారం.

 లోకేష్‌పై భిన్నాభిప్రాయాలు: లోకేష్‌ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవ టంపై పార్టీ నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

 

  ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారు ఆయన్ను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయించి ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధినేతకు సూచిస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రత్యక్ష  రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీగా శాసనసమండలికి పంపి తక్షణమే మంత్రివర్గంలోకి తీసుకోవాలని మంత్రి పదవులు ఆశిస్తున్న పలు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంటున్నారు. లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి శాసనసభకు ఎన్నిక కావాలనుకుంటే హిందూపురం లేదా పెనమలూరు నియోజకవర్గాలను ఎంచుకునే అవకాశం ఉంది. పెనమలూరు నుంచి బోడే ప్రసాద్, హిందూపురం నుంచి మామ బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

 

 బాలకృష్ణతో రాజీనామా చేయిస్తే ఆయన్ను రాజ్యసభకు పంపటం ఖాయం. ఒకవేళ బోడే ప్రసాద్‌తో రాజీనామా చేయిస్తే ఆయన్ను శాసనమండలికి పంపిస్తారు. లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తేనే మంచి ప్రభావం ఉంటుందంటున్న వారిలో ఉత్తరాంధ్ర  జిల్లాకు చెందిన ఓ మంత్రి ఉన్నారు. ఆయన ఇప్పటికే చంద్రబాబును కలిసి తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలిసింది. రాష్ట్ర మంత్రివర్గంలో నెంబర్ టూ గా అందరూ భావించే ఓ మంత్రి కూడా లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తేనే మంచిదని, ఒకవేళ శాసనమండలిలో ప్రవేశించి మంత్రివర్గంలో చేరితే దొడ్డిదారిన మంత్రి అయ్యారనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పినట్లు సమాచారం. లోకేష్‌తో పొసగని మంత్రివర్గంలోని మరో సీనియర్ మంత్రి కూడా ప్రత్యక్ష ఎన్నిక లే  ఆయనకు మంచిదని పార్టీ నేతలతో చెప్తున్నారు. ఇక మంత్రి పదవి ఆశించి అవకాశం రాని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లోకేష్‌ను మంత్రిని చేయాలని, అవసరమైతే ఎవరో ఒక ఎమ్మెల్సీతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు తక్షణమే నిర్వహించి ఆయనకు పట్టం కట్టాలని పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top