‘బకెట్‌’ భయం

వెంకటాపురం మండలం రామచంద్రాపురం సమీపంలో మొర్రువానిగూడెం ర్యాంప్‌ వద్ద ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన బకెట్‌ బాంబులు - Sakshi


వారోత్సవాల వేళ సరిహద్దుల్లో మావోల అలజడి


  •  అడవి దారుల్లో పేలుతున్న బాంబులు

  •  పోలీసులే లక్ష్యంగా మందుపాతర్లు

  •  తొలిసారిగా బకెట్‌ బాంబుల వినియోగం

  •  ప్రతిదాడులకు సిద్ధమవుతున్న ఇరువర్గాలు




భద్రాచలం :

అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో అలజడి సృష్టించేందుకు మావోయిస్టులు పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. వెంకటాపురం మండలంలోని ఆలుబాక సమీపంలో ప్రధాన రహదారిపై శనివారం రాత్రి అమర్చిన రెండు బకెట్‌ బాంబులను పోలీసులు ఆదివారం గుర్తించి నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సుమారు 30 మందికి పైగా సాయుధ మావోయిస్టులు, 60 మందికి పైగా సానుభూతి పరులైన గొత్తికోయలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. రాత్రి 10 గంటల ప్రాంతంలో ప్రధాన రహదారిపైకి వచ్చిన మావోయిస్టులు బకెట్‌ బాంబులను అమర్చి, వాటిని పేల్చేందుకు సమీప పొలాల్లో వైర్లను ఏర్పాటు చేశారు. అదే సమయంలో చర్ల వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సును సైతం నిలిపి..ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించి పంపారు.


  •  అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ ఘటనాస్థలిలో పోస్టర్లను విడిచి వెళ్లారు.

  •  చర్ల మండలం పెదమిడిసిలేరు దారిలో ఆంజనేయపురం గ్రామ సమీపంలోనూ ఇలాగే పోస్టర్లు వదిలివెళ్లారు. ఈ రెండు ఘటనలు ఒకే రోజు జరగటం పోలీసు వర్గాలను ఆలోచనలో పడేసింది.

     


సరిహద్దుల్లో టెన్షన్‌.. టెన్షన్‌..


  • ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు జరిగే అమర వీరుల సంస్మరణ వారోత్సవాలకు మావోయిస్టులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు నిర్వహించేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారని నిఘా వర్గాలు సైతం ఇటీవల ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవటంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌– ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దు గ్రామాల ప్రజానీకం తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వారోత్సవాల వేళ అటవీ ప్రాంతాల నుంచి మావోయిస్టులు గ్రామాలకు దూసుకొస్తుండగా..వారిని తిప్పికొట్టేందుకు పోలీసులు ప్రతి దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజానీకం ఆందోళన చెందుతోంది.


అడవిలో బాంబులు

సరిహద్దుల్లో మావోయిస్టులు పట్టు పెంచుకునేందుకు అటవీ ప్రాంతాలకు వెళ్లే రహదారుల్లో పెద్ద సంఖ్యలో బాంబులు అమర్చినట్లు ఇటీవల జరిగిన ఘటనలను బట్టి తెలుస్తోంది. తెలంగాణ– ఛత్తీస్‌గఢ్‌– ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలో నిత్యం ఏదో ఒక చోట బాంబులు బయటపడుతూనే ఉన్నాయి. ఏపీలో విలీనమైన చింతూరు మండలంలోని ఏడుగురాళ్లపల్లికి సమీపంలో ఉన్న పేగ రహదారిలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్‌ బాంబులు పేలాయి. ఇదే ప్రాంతంలో మూడు సార్లు బాంబులు పేలడం గమనార్హం. గత నెలలో చర్ల మండల కేంద్రానికి సమీపంలోని ఆనందకాలనీ వద్ద,  చర్ల– వెంకటాపురం ఆర్‌అండ్‌బీ రహదారిలోని ఎధిరకు సమీపంలో ప్రెషర్‌ బాంబులు పేలాయి. ఎధిర వద్ద జరిగిన ఘటనలో ఇద్దరు గిరిజనులకు గాయాలు కాగా ఇప్పటి వరకు బాంబులు పేలిన ఘటనలో ఎటవంటి ప్రాణ , ఆస్తి నష్టం జరగలేదు.



పంథా మార్చిన మావోలు

మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు ఇప్పటి వరకు చెట్లు నరకడం, రహదారులపై కందకాలు తవ్వడం, పోస్టర్లు, కరపత్రాలు వేయడం వంటివి చేసేవారు. కానీ ఇటీవల పంథా మార్చటం వెనుక భారీ లక్ష్యాలే ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఈ రీతిన పెద్ద ఎత్తున మందుపాతరలను అమర్చటం, అవసరమైన సమయాల్లో వాటిని పేల్చటం ద్వారా విధ్వంసాలు సృష్టిస్తుండటం పోలీసులకు సవాల్‌గా మారింది. పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు పేలి ఎందరో పోలీసులు మృతిచెందారు. ఇప్పటి వరకు ఛత్తీస్‌గఢ్‌కే పరిమితమైన ఈ తరహా పంథా తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు పాకడం ఆందోళన కలిగిస్తోంది.



భారీ విధ్వంసానికే బకెటా..!

మావోయిస్టులు బకెట్‌ బాంబులు పెట్టడం వెనుక భారీ విధ్వంసానికే వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. కూంబింగ్‌కు వచ్చే పోలీసులను టార్గెట్‌ చేసుకొని మావోయిస్టులు బకెట్‌ బాంబులు పెడుతున్నట్టు సమాచారం. వెంకటాపురం మండలం ఆలుబాక సమీపంలోని ప్రధాన రహదారిపై బకెట్‌ బాంబులు బయటపడటం ఇదే తొలిసారి. వీటిని నిర్వీర్యం చేసుందుకు పోలీసు బలగాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రాంతంలోకి ఎవరినీ రానివ్వకుండా.. చివరకు మీడియాకూ తెలియకుండా బాంబులను నిర్వీర్యం చేశారు. ఇవి శక్తివంతమైన బాంబులు కావడంతో పోలీసులు అతి జాగ్రత్త తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top