భక్తులకు‘బఫే’ కష్టాలు..


పట్టించుకోని అధికారులు

మంచినీరు కావాలన్నా తింటున్న కంచం పట్టుకు వెళ్లాల్సిందే..

మూడున్నరేళ్లయినా అందుబాటులోకి రాని రెండో అంతస్తు


 

సింహాచలం : అన్నప్రసాదం స్వీకరించడంలో అప్పన్న భక్తులకు అవస్థలు తప్పడం లేదు. కౌంటర్‌లో కూపన్లు తీసుకోవడం నుంచి అన్నదాన భవనంలోకి ప్రవేశించడం, అన్న ప్రసాదం స్వీకరించడం వరకు నిల్చొని ఉండాల్సి వస్తోంది. మంచి నీరు కోసం కూడా తింటున్న కంచం పట్టుకుని వెళ్లాల్సిందే. భక్తుల కష్టాలను గుర్తించిన దేవస్థానం రూ.4 కోట్లు వెచ్చించి సింహగిరిపై రెండో అంతస్తులో అన్నదాన భవనం నిర్మించింది.

 

ఆ భవనాన్ని మూడున్నరేళ్ల కిందట అందుబాటులోకి తెచ్చింది. ఈ భవనంలోని రెండో అంతస్తులో ఒకేసారి 600 నుంచి 700 మంది వరకు కూర్చొని అన్నప్రసాదం స్వీకరించవచ్చు. కానీ నేటీకీ ఇక్కడ బఫే పద్ధతిలోనే అన్నప్రసాద వడ్డన జరుగుతోంది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

 

దివ్యక్షేత్రం పనులు జరుగుతున్నప్పుడు తాత్కాలిక భవనాల్లో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ.. పక్కా భవనం నిర్మించాకైనా తొలగిపోతాయని ఎదురుచూసిన భక్తులకు ఇప్పటికీ నిరాశే ఎదురవుతోంది.  

 

రాష్ర్టంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి క్షేత్రం ఒకటి. అప్పన్న స్వామిని దర్శించుకునేందుకు ప్రతీ రోజూ మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. నిత్యాన్నదాన పథకంలో భాగంగా భక్తులకు దేవస్థానం అన్నప్రసాదం అందిస్తోంది. వీరి సౌకర్యార్థం భారీ అన్నదాన భవనాన్ని నిర్మించాలని 2008లో జరిగిన దివ్యక్షేత్రం పనుల్లో భాగంగా ప్రణాళికలు సిద్ధం చేశారు.

 

రూ.4 కోట్లు వెచ్చించి రెండంతస్తుల్లో భవన నిర్మాణం చేపట్టారు. మూడున్నరేళ్ల కిందటే దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ కింద అంతస్తులోనే భక్తులకు బఫే పద్ధతిలో అన్నప్రసాదం అందిస్తున్నారు. అన్నప్రసాదం కోసం రాజగోపురం వద్ద ఉన్న కౌంటర్‌లో ఇచ్చే కూపన్ల దగ్గర నుంచి అన్నదాన భవనంలోకి ప్రవేశించే వరకు భక్తులు క్యూలైన్లలోనే గంటల తరబడి నిలబడి ఉంటున్నారు. అన్నప్రసాదం అయినా కూర్చొని ఆరగించవచ్చని భవనంలోకి ప్రవేశించే భక్తులకు..అక్కడ కూడా నిరాశే ఎదురవుతోంది.

 

కూర్చోవడానికి సరిపడా టేబుల్స్ లేకపోవడం, మంచినీరు కోసం కూడా తింటున్న కంచం పట్టుకుని వెళ్లాళ్సిన పరిస్థితుల మధ్య అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు సైతం నిలబడి అన్నప్రసాదం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు తీవ్ర రద్దీ నెలకొనడంతోఒకరినొకరు తప్పించుకోలేకపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.

 

ఎప్పటికప్పుడు రెండవ అంతస్తును వినియోగంలోకి తీసుకొస్తామని, సిబ్బంది కొరత ఉందంటూ చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా తమ బాధలు అర్థం చేసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

 

మనస్ఫూర్తిగా ఉంటుంది

 అన్న ప్రసాదం కూర్చోబెట్టి వడ్డిస్తే తినే వారికి మనస్ఫూర్తిగా ఉంటుంది. అది ఎంతో తృప్తినిస్తుంది. దేవస్థానం అధికారులు స్పందించి ఆ విధంగా చర్యలు చేపట్టాలి.  

 - అప్పారావు, అనకాపల్లి



లిఫ్టు ఏర్పాటుపూర్తయితే..

 అన్నదాన భవనంలో లిప్టు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. కింది అంతస్తు నుంచి పైఅంతస్తుకు లిఫ్టులో వండిన పదార్థాలు, ఇతర వస్తువులు చేర్చడానికి వీలు ఉంటుంది. దీని పనులు తొందరగా పూర్తి చేసి, రెండో అంతస్తును వినియోగంలోకి తీసుకొస్తాం. రెండతస్తుల్లోనూ భక్తులను కూర్చోబెట్టి అన్నవడ్డన చేస్తాం.  

 - కె.రామచంద్రమోహన్, ఈవో

 

తిరుమలలో కూర్చోబెట్టే వడ్డన చేస్తారు

తిరుమలలో ఎంత మంది భక్తులు వచ్చినా..  కూర్చోబెట్టే అన్నప్రసాద వడ్డన చేస్తారు. సింహాచలంలో కూడా అలా చేయాలి. మొదట్లో ఇక్కడ కూడా అలానే ఉండేది. బఫే పద్ధతి వల్ల పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. చంటి పిల్లలను

 ఎత్తుకుని వడ్డన దగ్గరకి వెళ్లాలంటే అవస్థలు

 పడుతున్నాం.

 - వి.వీర్రాజు, తాటిచెట్లపాలెం

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top