ఆయనొచ్చారు... రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు

ఆయనొచ్చారు... రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు


ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి ధ్వజం

సాక్షి, చిత్తూరు: ‘‘రైతు రుణాలు బేషరతుగా మాఫీ చేస్తాం.. డ్వాక్రా రుణం పూర్తిగా మాఫీ చేస్తాం.. ఇంటికో ఉద్యోగం.. లేకపోతే నిరుద్యోగ భృతి చెల్లిస్తాం.. లాంటి మాయమాటలు చెప్పి ప్రజల దగ్గర ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన చంద్రబాబు కోట్లు కొల్లగొడుతున్నారు’’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆయనొచ్చి.. రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. చిత్తూరు రూరల్‌ మండలం బీఎన్‌ఆర్‌పేటలో ఆదివారం నిర్వహించిన గడపగడపకూ వైఎస్సార్‌సీపీ కార్యక్రమంలో పెద్దిరెడ్డి పాల్గొన్నారు. 



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయలేని కుంభకోణాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్పడుతున్నాడని ఆరోపించారు. లోటు బడ్జెట్‌ అని బీద అరుపులు అరుస్తున్న ముఖ్యమంత్రి... దేశాలు తిరుగుతూ డబ్బులు వృథా చేస్తున్నారని ధ్వజమెత్తారు.



ప్రజల బాధ వినడానికే గడపగడపకూ...

దగా కోరు రాజకీయాలకు బలవుతున్న ప్రజల గోడు వినడానికే గడపగడపకూ వెళుతున్నామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, చేసిన మోసాన్ని క్షుణ్ణంగా ప్రజలకు వివరిస్తున్నామని పేర్కొన్నారు. పచ్చని పొలాల మధ్యలో రాజధాని నిర్మిస్తానంటూ రూ.లక్ష కోట్లు లూటీ చేశారని ఆరోపించారు. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ను హరితాంధ్రగా మారిస్తే.. చంద్రబాబు నాయుడు కన్నీళ్లాంధ్రగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులు, వికలాంగులు పింఛన్ల కోసం సంవత్సరాల తరబడి వేచి చూస్తున్నారన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.



వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షం

రాజన్న కలలుగన్న రాజ్యం కోసం వైఎస్సార్‌సీపీ పోరాడుతోందని పెద్దిరెడ్డి చెప్పారు. గడపగడపకూ వెళుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులతో ప్రజలు మాట్లాడకుండా టీడీపీ శ్రేణులు భయపెడుతున్నాయని.. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. రాక్షస పాలన నుంచి త్వరలో మనకు విముక్తి లభిస్తుందన్నారు. రాక్షస రాజ్యానికి నూకలు చెల్లాయని.. రాబోయేది రాజన్న రాజ్యమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నారాయణ  స్వామి, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త జంగాలపల్లి శ్రీనివాసులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top