హోదాపై కేంద్రానికి స్పష్టత లేదు

హోదాపై కేంద్రానికి స్పష్టత లేదు - Sakshi


* రాజీ పడ్డానన్న ఆరోపణలు సరికాదు

* విభజన చట్టంలో ఉన్నవి అమలుకు కేంద్రంపై ఒత్తిడి

* విజయనగరం పర్యటనలో సీఎం

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏమీ చెప్పడంలేదని, ఏం ఇస్తుందో, ఏం చేస్తుందో స్పష్టత ఇస్తే ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్లేవాళ్లమని సీఎం చంద్రబాబు అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రావల్సిన వాటిన్నింటిపైనా  కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. విజయనగరం జిల్లాలోని విజయనగరం, సింగవరంలో జరిగిన నీరుచెట్టు, నీరు ప్రగతి కార్యక్రమాల్లో గురువారం ఆయన పాల్గొన్నారు.



ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీతో రాజీపడ్డానన్న ఆరోపణలు అవాస్తవమన్నారు.  విధి లేని పరిస్థితుల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిందని, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ‘ హోదా విషయంలో కేంద్రపై ఒత్తిడి తెస్తాను. దీనిపై గురువారం ఉదయం కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడులతో మాట్లాడి కొంచెం ఆలోచించాలని కోరాను. వారితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా మాట్లాడాను. అవసరమయితే మళ్లీ మళ్లీ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుస్తాను’ అని సీఎం  పేర్కొన్నారు.



కృష్ణా నదిపై ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు  వంటి రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టడం వల్ల రావాల్సిన నీరే రావడం లేదని, ఇప్పుడు దానిపై తెలంగాణ ప్రాజెక్టులు కడితే మరింత ఇబ్బందులు వస్తాయనీ కేంద్రానికి చెప్పానన్నారు. దీనిపై కేంద్రం కమిటీ వేసిందని, ఆ కమిటీ సభ్యులు సమష్టిగా నిర్ణయం తీసుకుంటారని చెబితే తెలంగాణ సీఎంకు కోపం వస్తోందని వ్యాఖ్యానించారు.

 

సాక్షి కథనంపై ఆగ్రహం: సాక్షి పత్రికలో ప్రత్యేక హోదాపై గురువారం ప్రచురితమయిన కథనాన్ని బహిరంగ సభ సాక్షిగా ప్రస్తావించిన సీఎం చంద్రబాబు ఊగిపోయారు. ‘నేను ఆంధ్రప్రదేశ్‌కు వెన్నుపోటు పొడిచానట! ఇదేమయినా బాగుందా తమ్ముళ్లూ!’ అని కార్యకర్తలనుద్దేశించి సమర్ధించుకునేందుకు, సంజాయిషీ చెప్పుకునేందుకు యత్నించారు.

ఇరిగేషన్ అధికారులపై బాబు ఫైర్: విజయనగరం ఆనందగజపతి ఆడిటోరియంలో జరిగిన నీరు ప్రగతి వర్క్‌షాపులో ఇరిగేషన్ అధికారులపై సీఎం సీరియస్ అయ్యారు. ‘బీకేర్‌పుల్ ఆన్ దట్.



ఏం తమాషాగా ఉందా... సమావేశం నిర్వహించటంతో పాటు మూడు నెలలకొకసారి నీటి సంఘాలతో సమావేశాలు నిర్వహించాలి. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ మారాలి’ అంటూ వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు ఎస్‌ఈ ఎస్.వి.రమణపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సీఎం పర్యటనలో భాగంగా అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామిని గురువారం దర్శించుకున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top