పండుగకు పైసలెట్లా..!


బ్యాంకుల వద్ద అవే బారులు

రెండు నెలలు గడిచినా తీరని వ్యథ

వేతన జీవులకు తప్పని కష్టాలు

విత్‌డ్రా పెంచినా.. పనిచేయని ఏటీఎంలు




మంచిర్యాల అగ్రికల్చర్‌ :గంటలు, రోజులు, నెలలు గడుస్తున్నాయి.. నగదు కొరత మాత్రం తీరడం లేదు. కేంద్ర ప్రభుత్వం నోట్లు రద్దు చేసి నేటితో రెండు నెలలు గడిచినా బ్యాంకుల ఎదుట అవే బారులు కనిపిస్తున్నాయి. శనివారం జిల్లాలో పలు బ్యాంకులు, ఏటీఎంల ఎదుట పెద్ద ఎత్తున ప్రజలు క్యూలైన్లు కట్టారు. సంక్రాంతి   – మిగతా 2లోu పండుగకు పైసలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. పండుగ వారం, పది రోజుల ముందు నుంచే పలు పట్టణాలు, గ్రామాల్లో గృహిణులు పిండి తినుబండరాలు తయారు చేస్తుంటారు. ముఖ్యంగా సంక్రాతి పండుగకు పెట్టింది పేరైన సకినాలు ఇప్పటికే తయారు చేస్తుండేవారు. కానీ.. ఈ ఏడాది పెద్ద నోట్ల రద్దు, నగదు కొరతతో ఆ సందడే కనిపించడం లేదు. సామాన్య జనాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు, సింగరేణి కార్మికుల వేతనాలు పడి వారం గడుస్తోంది. ఇటు పింఛన్‌దారులు ఈ నెల 1వ తేదీ నుంచి బ్యాంకుల వద్ద బారులు తీరుతూనే ఉన్నారు. ఏటీఎంలో నగదు విత్‌డ్రా రూ.4500లకు పెంచినా నగదు పెట్టడమే లేదు. గతంలో రూ.2 వేలు వచ్చిన ఏటీఎంలు ఇప్పుడు మొత్తానికే పనిచేయడం లేదంటున్నారు.



కేంద్ర ప్రభుత్వం నగదు కొరత ఇబ్బంది 50 రోజుల్లో తొలగిపోతాయని ప్రకటించినా.. 60 రోజులు గడుస్తున్నా ఆ ఇబ్బందులు మాత్రం అదే విధంగా కొనసాగుతున్నాయి. ‘సంకురాత్రి పండుగ వచ్చిందంటే పదిరోజుల ముందు నుంచే బియ్యం పిండి పట్టించి సకినాలు, గారెలు చేసుకునేటోళ్లం. ఈ ఏడాది నోట్లు రద్దుతో వడ్లు అమ్మినా పైసలు ఇత్తలేరు. వాయిదా పెడతండ్రు. అటు బ్యాంకుల పైసలు అత్తలెవ్వు. పండుగ చేసుకునేటట్లు లేదు. రోజంతా బ్యాంకు ముందు లైను కడితే రెండు వేలు ఇత్తండ్రు.’ అని హాజీపూర్‌కు చెందిన నాత మల్లమ్మ వాపోయింది.



సొంత ఖాతాదారులకే.. : బ్యాంకులు సొంత ఖాతాదారులకు మాత్రమే నగదు అందిస్తున్నాయి. దీంతో ఇటీవల జిల్లాల ఆవిర్భావంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులకు ఖాతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో బదిలీలపై వచ్చిన పలువురు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు స్థానికంగా బ్యాంకు ఖాతాలు లేవు. బ్యాంకులో ఉన్న జీతం డబ్బు ఏ ఏటీఎంలోనైనా తీసుకునే అవకాశం ఉండటంతో చాలా మంది బ్యాంకు ఖాతాలు మార్చుకోలేదు. ప్రస్తుతం అలాంటి వారు బ్యాంకు శాఖల వద్దకు వెళ్తే తమ బ్రాంచిలో ఉండే ఖతాదారులకు మాత్రమే డబ్బులు ఇస్తామని స్పష్టంగా చెబుతుండటంతో పలువురు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top