అవినీతి బాట.. అక్షర సత్యం

అవినీతి బాట.. అక్షర సత్యం - Sakshi

తేల్చిచెప్పిన విజిలెన్స్‌, క్వాలిటీ కంట్రోల్‌ బృందం

రోడ్ల పనుల తీరుపై జేఈపై ఆగ్రహం 

 

పేరవరం, తాడిపూడి గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలు.. అవినీతి బాటలుగా ఉన్నాయంటూ ‘సాక్షి’తో ప్రచురితమైన కథనం అక్షర సత్యమని విజిలెన్స్‌, క్వాలిటీ కంట్రోల్‌ బృందం బుధవారం నిర్ధారించింది. పనులు చేసే తీరు ఇదేనాంటూ జెడ్పీ జేఈ ప్రసాద్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తంచేసింది. ఈ పనులకు సంబంధించి బిల్లులు కూడా చేస్తున్నట్టు వారు గుర్తించారు. ఈ పనుల రికార్డులతో తమ కార్యాలయానికి రావాలని ఏఈ...ని ఆదేశించారు. మండలంలో చేపట్టిన పనుల పర్యవేక్షణ నుంచి జేఈ ప్రసాద్‌ తప్పించినట్టు ఈ బృందంలోని జెడ్పీ ఈఈ ఎస్‌వీ రాఘవరెడ్డి ప్రకటించారు.

 

ఆత్రేయపురం (కొత్తపేట) : మండలంలోని పేరవరం, తాడిపూడి గ్రామాల్లో జెడ్పీ జేఈ ప్రసాద్‌ పర్యవేక్షణలో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను బుధవారం విజిలెన్స్‌, క్వాలిటీ కంట్రోల్‌ బృందం పరిశీలించింది. ఈ రోడ్ల నిర్మాణ తీరు, ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తున్న వైనంపై ‘అవినీతి బాటలు... రూ.3 కోట్ల విలువైన రోడ్లు పనుల్లో నాణ్యతకు తిలోదకాలు’శీర్షికతో ఈ నెల 20వ తేదీ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం.. విజిలెన్స్‌ అధికారులను పరుగులు పెట్టించింది. రోడ్ల నిర్మాణ పనుల తీరుపై విజిలెన్స్‌, క్వాలిటీ బృందంలోని కాకినాడ డీఈ ప్రసాద్‌బాబు, రాజమండ్రి డీఈ సురేష్‌కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. పేరవరం కాలువ గట్టు వద్ద సిమెంట్‌ రోడ్డు బీటలు పడడంపై జేఈపై మండిపడ్డారు. మార్కెట్‌ కమిటీ నిధులతో నిర్మిస్తున్న గ్రావెల్‌ రోడ్డుకు ఉపయోగిస్తున్న మెటీరియల్‌ను పరిశీలించిన వారు.. నాణ్యత ప్రమాణాలు ఎక్కడ పాటిస్తున్నారంటూ నిలదీశారు. తాడిపూడిలో నిర్మిస్తున్న రహదారి పనులను చూసి..ఇలాగేనా రహదారులు నిర్మించేదని జేఈని ప్రశ్నించారు. పనులు పర్యవేక్షకుండానే రోడ్డు బిల్లులు చేస్తున్నట్టు వారి విచారణలో తేలింది. ఈ పనులకు సంబంధించిన ఎంబుక్‌లు, అంచనా వివరాలతోపాటు మొత్తం సమాచారంతో కార్యాలయానికి హజరు కావాలని జేఈ ప్రసాద్‌ను విజిలెన్స్‌ బృందం ఆదేశించింది.

జేఈని పనులకు దూరంగా ఉంచుతాం..

మండలంలో జెడ్పీ పర్యవేక్షణలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనుల్లో జేఈ ప్రసాద్‌ను దూరంగా ఉంచుతున్నట్టు ఈ బృందంలో ఉన్న జెడ్పీ ఈఈ ఎస్‌వీ రాఘవరెడ్డి తెలిపారు. ఈయన పర్యవేక్షణలో పనులు చేపట్టకుండా నిలుపుదల చేస్తున్నట్టు వివరించారు. ప్రస్తుత పనులపై విచారణ చేయనున్నట్టు ఆయన తెలిపారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top