ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా - Sakshi


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా రాష్ట్రంలోని కరువుపై చర్చ జరిగింది.  తీవ్ర గందరగోళం నడుమ సాగిన సభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరువు అంశంపై మాట్లాడుతుండగా అధికార పార్టీ పదే పదే అడ్డుతగిలింది.  వైఎస్ జగన్ ప్రసంగంపై ఎదురుదాడికి దిగిన ప్రభుత్వ ఎమ్మెల్యేలు..  తీవ్ర గందరగోళానికి తెరలేపారు.

 


ప్రాజెక్టులు, నదీజలాలు, కరువు అంశాలపై వైఎస్ జగన్ మాట్లాడతుండగా.. స్పీకర్ కోడెల శివప్రసాదరావు పలుమార్లు మైక్ కట్ చేశారు.  ఈరోజు కరువుపైనే చర్చ జరగాలని.. పోలవరం, పట్టిసీమ, గోదావరిలపై చర్చ ఇప్పటికే ముగిసిందంటూ వైఎస్ జగన్ ప్రసంగాన్నిస్పీకర్  అడ్డుకున్నారు.  కరువుపై చర్చ జరగాలంటే ప్రాజెక్టులు, నదీజలాలు గురించి కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉందని జగన్ సూచించారు. అయినప్పటికీ కరువుపై మాత్రమే జరగాలని స్పీకర్ స్పష్టం చేయడంతో.. వైఎస్సార్ సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్  పోడియాన్ని చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు.


 


అనంతరం వైఎస్ జగన్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. రాయలసీమ జిల్లాలు నీళ్లు- నీళ్లు అని అలమటిస్తున్నాయన్న సంగతిని ప్రభుత్వం గుర్తించాలని సూచించారు. ఆ జిల్లాల్లో రైతులు సాధారణ బోర్లు సరిపోక.. 1500 అడుగులు మేర కంప్యూటర్ బోర్లు వేయించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ కష్టాలు తీరాలంటే పోలవరం ప్రాజెక్టు ఒక్కటే పరిష్కార మార్గమని తెలపగా.. అధికార పక్షం మరోమారు అడ్డుపడింది. చివరగా రావెల కిషోర్ బాబు, అచ్చెన్నాయుడులు, చినరాజప్పలు ప్రసంగిస్తుండగా గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి.  దాంతో స్పీకర్ సభను రేపటి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top