ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా - Sakshi


హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.  సోమవారం ఆరంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు పలుమార్లు వాయిదా పడ్డాయి.  తొలిరోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశంపై తీర్మానం చేయాలని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ పట్టుబట్టింది. దీనిపై శాసనసభలో వైఎస్సార్ సీపీ వాయిదా తీర్మానాన్ని ఇవ్వగా.. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆ తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో ప్రత్యేక హోదాపై తీర్మానం చేయాల్సిందేనంటూ సభ్యులు స్పీకర్ పోడియ చుట్టిముట్టి ఆందోళనకు దిగారు.  ఈ సందర్భంగా స్పీకర్ కోడెల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వమే...ప్రత్యేక హోదాపై ప్రకటన చేయబోతుందని, దీనిపై చర్చ, తీర్మానం ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత చర్చ ఉంటుందన్నారు. అయితే వెంటనే తీర్మానం పెట్టాలని వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.  ఈ  నేపథ్యంలో  సభలో గందరగోళం నెలకొంది.





అసెంబ్లీ సాక్షిగా అధికార పక్షం మరోసారి  ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేసింది .  సంతాప తీర్మానాల విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది. ఉదయం  తొమ్మిదిన్నరకు సభ ప్రారంభమైన వెంటనే  మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.  దీనిపై ప్రతిపక్ష నేత  వైఎస్‌ జగన్‌ కూడా మాట్లాడారు. ఆ తర్వాత  గోదావరి పుష్కర మృతులపై అసెంబ్లీ తీర్మానం చేసింది.  





ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో ప్రకటన చేసిన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన ఆరోపణలపై వివరణకు ఇచ్చేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. స్పీకర్ తిరస్కరించడంతో ఆందోళన చేపట్టారు. విభజన సమయంలో లోక్ సభలో కాంగ్రెస్ పై అవిశ్వాసం పెట్టి ఎందుకు ఉపసంహరించుకున్నారో వైఎస్సార్ సీపీ నేతలు చెప్పాలని చంద్రబాబు అనడంతో సభలో గందరగోళం నెలకొంది.



చంద్రబాబు వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ సభ్యులు అభ్యంతరం చెప్పారు. సభా నేత ప్రకటన చేస్తున్నప్పుడు ప్రశ్నలకు అవకాశం లేదని యనమల రామకృష్ణుడు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సభా సమయం పూర్తయ్యాక అభ్యంతరాలు చెప్పవచ్చని అన్నారు. ప్రత్యేక హోదాపై ప్రభుత్వం చేసిన ప్రకటన కాపీలు కూడా తమకు ఇవ్వలేదని వైఎస్సార్ సీపీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా పలుమార్లు వాయిదా పడిన నేటి అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top