ఎంగిలిపడేదెట్టా..?

ఎంగిలిపడేదెట్టా..? - Sakshi


కాస్త దయచూపండి

నాడు గౌరవంగా బతికి నేడు ఆదరణ కరువై భిక్షాటన

రోడ్డున పడేసిన కరువు

యాచిస్తూ కడుపు నింపుకుంటున్న యక్షగానం కళాకారులు

మాచవరంలో కళాకారుల పరిస్థితి దయనీయం


 ‘ఆకలేస్తుందమ్మా... కాస్త అన్నంపెట్టండి.. చంటిపిల్లలు ఆకలికి ఆగలేక పోతున్నరు’.. అంటూ కళాకారులు భిక్షాటన చేస్తున్నారు. గత రెండేళ్లుగా కరువు పరిస్థితులు నెలకొనడంతో గ్రామాలకు గ్రామాలు వలస పోవడంతో కళాకారులకు ఆదరణ లేకుండా పోయింది. మెదక్ మండలం మాచవరానికి చెంది న యక్షగానం కళాకారుడు రామస్వామి బుధవారం మెదక్ ఏరియా ఆస్పత్రిలో పట్టెడన్నం కోసం మనవడితో కలిసి భిక్షాటన చేయడం అందరిని కలిచివేసింది. ముఖానికి రంగు వేసు కుని స్టేజీ మీద.. హరిచంద్రుడి సన్నివేశంలో ‘ఆలుపిల్లలేమైరో ఆ నాటి వైభమేమాయెనో’ అంటూ రామస్వామి పాట పాడితే అందరూ కంటతడి పెట్టేవారు. అలా కథలు చెప్పుకుంటూ గౌరవంగా బతికిన ఈయన నేడు కాలేకడుపుతో భిక్షాటన చేస్తున్నాడు. అందరి మన్ననలు పొందిన ఈయన.. ఇప్పుడు భిక్షాటన చేయడంపై పలువురు చలించిపోయారు. కొందరు ఆయన్ను ఆప్యాయంగా పిలిచి యోగక్షేమాలు తెలుసుకున్నారు. - మెదక్


 మెదక్: రంగస్థల నాటక రంగాన్ని ఓ ఊపు ఊపిన కళాకారులు నేడు వీధిన పడ్డారు. కళారంగానికి ఆదరణ కరువై రోడ్డున బిచ్చమెత్తుకుంటున్నారు. ‘ఆలుపిల్లలేమైయిరో... అంత వైభవమేమాయెనో’ అంటు ఒకనాడు రంగస్థలిపై హరిచంద్ర యక్షగానంలోని పాటలు పాడి అందర్ని మంత్రముగ్ధుల్ని చేశారు. ముఖానికి రంగులు వేసి, తమదైన హావాభావాలతో జనాన్ని మెప్పించారు. కథలు చెబుతూ నవ్వించారు.. ఏడ్పించారు. కళానైపుణ్యంతో ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించారు.


కళాప్రదర్శనతో వచ్చేడబ్బులతో గౌరవంగా బతికారు. అలాంటి గత రెండేళ్లుగా కరువు కన్నెర్ర చేయడంతో కాలేకడుపులకు ఆకలి తీర్చుకునేందుకు భిక్షాటన చేస్తున్నారు. కరువు కాటుకు పల్లెలన్నీ చిన్నబోయాయి. ఉపాధి వెతుక్కుంటూ జనమంతా ఇళ్లకు తాళాలు వేసి పట్నం బాట పట్టడంతో ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయ్యాయి. వీరి కళాప్రదర్శనలను తిలకించే దిక్కులేకుండా పోయింది. వీరిని పలుకరించే వారే లేకుండా పోయారు. ప్రదర్శనలివ్వక.. డబ్బులు లేక పస్తులుంటున్నారు. ఆకలికేకలతో అలమటిస్తున్నారు. బువ్వ దొరక్క వీరి కుటుంబాల్లోని చిన్నారుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.


 మెదక్ మండలం మాచవరం గ్రామంలో సుమారు 40కి పైగా కళాకారుల (మాష్టుల) కుటుంబాలున్నాయి. వీరు ఊరూరు తిరుగుతూ పగటివేళలో యక్షగానాలు, బాగోతాలు ఆడేవారు. ఒక్కో ఊరిలో వారం, పదిరోజులపాటు బాలనాగమ్మ, హరిచంద్ర, మాందాత, వీదినాచారి, శ్రీకృష ్ణతులాభారం, అల్లిరాణి వంటి ఎన్నో కళారూపాలను ప్రదర్శించే వారు. ముఖాలకు రంగులు వేసుకుని రంగస్థలిపై పాటలు పాడి ఎందరినో ఆకట్టుకునేవారు.


 హరిచంద్ర యక్షగానంలోని... ‘ఆలుపిల్లలేమైయిరో అంతవైభవమేమైయెనో..’ అంటూ హరిచంద్రుడి వేషధారణలో పాటలు పాడుతుంటే ప్రేక్షలంతా కంటతడిపెట్టేవారు. కానీ రెండేళ్లుగా కరువు కోరల్లో చిక్కుకుపోవడంతో జనమంతా పల్లెను వదిలి పోవడంతో వీరికి గడ్డుపరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంట్లో కిలో బియ్యం కూడా లేవని, చేతిలో చిల్లిగవ్వ లేక వంట చేసుకోలేక పస్తులుంటున్నామని చెబుతున్నారు. తామెలాగోలా జీవితాన్ని గడిపిస్తామని... చంటిపిల్లల పరిస్థితి దయనీయంగా ఉందంటూ వాపోతున్నారు కళాకారులు. రోడ్డున పడ్డ తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top