వ్రతపురోహితులకు శుభవార్త


  పారితోషికం బకాయిల చెల్లింపుకు కమిషనర్ ఓకే

 15 నెలల మొత్తం రూ.రెండు కోట్లు

 రూ. కోటి కార్పస్‌ఫండ్‌కు, రూ.కోటి పురోహితులకు

 250 మంది పురోహితులకు రూ.40 వేల చొప్పున లబ్ధి


 

అన్నవరం: తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో పని చేస్తున్న 250 మంది వ్రతపురోహితులకు పారితోషికం బకాయిలను చెల్లించేందుకు దేవస్థానం కమిషనర్ అంగీకరించారు. వారు దీనికోసం 15 నెలలుగా ఆశగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఒక్కొక్క పురోహితునికి సుమారు రూ.80 వేలు ఎరియర్స్‌గా వస్తాయి. అయితే ఇందులో పురోహిత కార్పస్ ఫండ్ కింద 50 శాతం అంటే రూ.40 వేలు జమవుతుంది. మిగిలిన రూ.40 వేలు చెల్లిస్తారు. అన్నవరం దేవస్థానంలో 2015 జనవరిలో పెంచిన వ్రతాల టికెట్లకు సంబంధించి  వ్రతపురోహితులకు  చెల్లించాల్సిన15 నెలల పారితోషకం ఎరియర్స్‌ను చెల్లించేందుకు  దేవాదాయశాఖ కమిషనర్ వైవీ ఆనూరాధ అంగీకరించినట్టు దేవస్థానం ఈఓ కే నాగేశ్వరరావు సోమవారం తెలిపారు. పారితోషికం ఎరియర్స్ చెల్లింపు  విషయమై  హైదరాబాద్‌లో రాష్ట్ర బ్రాహ్మణ  అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఐవీఆర్ కృష్ణారావు, కమిషనర్‌తో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆయన హైదరాబాద్ నుంచి ఫోన్‌లో ‘సాక్షి’ కి తెలిపారు. వారం రోజుల్లో ఈ ఎరియర్స్ చెల్లింపునకు సంబందించి ఆదేశాలు పంపుతామని చెప్పారన్నారు. ఆదేశాలు వచ్చిన వెంటనే పురోహితుల అకౌంట్స్‌లో ఎరియర్స్ బకాయిలు జమ చేస్తామని ఈఓ తెలిపారు.



ఎరియర్స్ వివాదానికి కారణమేమిటంటే..

అన్నవరం దేవస్థానంలో గల  రూ.125, రూ.200, రూ.500, రూ.1,116  వ్రతాల టిక్కెట్ రేట్లను 2015 జనవరి నెలలో  రూ.150, రూ.300, రూ.700, రూ.1,500 కు పెంచుతూ దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సమావేశంలో చైర్మన్ రాజా ఐవీ రామ్‌కుమార్, అప్పటి ఇన్‌ఛార్జి ఈఓ ఈరంకి వేంకట జగన్నాథరావు నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు  పెరిగిన వ్రతాల టిక్కెట్లను భక్తులకు విక్రయించడం ప్రారంభించి దేవాదాయశాఖ కమిషనర్‌కు తెలియచేశారు. అయితే ముందుగా తన అనుమతి తీసుకోకుండా వ్రతాల టిక్కెట్లు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్  తన నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టారు. అయితే  దేవస్థానంలో మాత్రం పెంచిన వ్రతాల టిక్కెట్లను యథాతథంగా విక్రయించారు.



వ్రతపురోహితుల పారితోషికం చెల్లింపు ఇలా...

వ్రతాల ఆదాయంలో 30 శాతం మొత్తాన్ని పారితోషికంగా 250 మంది పురోహితులకు చెల్లిస్తున్నారు. వ్రతాల టిక్కెట్లు పెంచినపుడు కూడా పెంచిన మొత్తం పై వచ్చిన ఆదాయంపై 30 శాతం కమిషన్‌గా వీరికి చెల్లించాలని దేవస్థానానికి, పురోహితులకు ఒప్పందం ఉంది. దాని ప్రకారం పెరిగిన వ్రతాల టిక్కెట్లను అనుసరించి పురోహితులకు పారితోషికం చెల్లించాలి. కానీ 2015 జనవరి నెలలో  పెంచిన వ్రతాల  టిక్కెట్లకు కమిషనర్ అనుమతి లేదు కనుక పాత టిక్కెట్ల ప్రకారం వచ్చిన ఆదాయం మీదనే లెక్కించి 30 శాతం పారితోషికం చెల్లిస్తున్నారు. అంటే 2015  జనవరి నెల నుంచి 2016 ఫిబ్రవరి వరకూ వీరికి పాత టిక్కెట్ల పైనే పారితోషికం చెల్లించారు. పెంచిన వ్రతాల రేట్ల ప్రకారం అయితే రూ.రెండు కోట్ల వరకూ వీరికి చెల్లించాల్సి ఉంది.  



వ్రతపురోహితుల కృతజ్ఞతలు

కాగా, పారితోషికం ఎరియర్స్ చెల్లించేందుకు నిర్ణయించినందుకు వ్రతపురోహితులు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవీఆర్ కృష్ణారావు,  కమిషనర్ వైవీ ఆనూరాధ,  ఈఓ కే నాగేశ్వరరావులకు కృతజ్ఞతలు తెలిపారు. వ్రతపురోహిత ప్రముఖులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ,  వ్రతపురోహిత సంఘం అధ్యక్షుడు కర్రి సూర్యనారాయణ, కార్యదర్శి నాగాభట్ల రవిశర్మ, కోశాధికారి బట్టీశ్వర చక్రవర్తి తదితరులు కృతజ్ఞతలు తెలియచేశారు.

 

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top