ఉత్తరాంచల్ తీసుకెళ్తామన్నారు...

ఉత్తరాంచల్ తీసుకెళ్తామన్నారు...


అమర జవాను భార్య శ్రీవాణి ఆవేదన

కూంబింగ్‌కు వెళ్లేముందు ఫోన్‌లో మాట్లాడారని వెల్లడి

మృతదేహం రావడానికి రెండు రోజులు


 

 బొబ్బిలి: ‘మొన్న పుష్కరాల సమయంలో వచ్చి నెలరోజులుండి వెళ్లారు. ఏడాదిలో జమ్మూకాశ్మీర్ నుంచి ఉత్తరాంచల్ వచ్చేస్తాను.. అక్కడికి మిమ్మల్ని తీసుకువెళతానని చెప్పారు.. మొన్న కూంబింగ్‌కు వెళ్తుండగా ఫోన్ చేసి మాట్లాడారు.. తిరిగొచ్చాక మళ్లీ మాట్లాడతానని చెప్పారు.. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది..’ అని జమ్ముకాశ్నీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన ఆర్మీ జవాను బొట్ట సత్యం భార్య శ్రీవాణి విలపించారు. బాడంగి మండలం గొల్లాది గ్రామానికి చెందిన సత్యం (36) ఆదివారం రాత్రి ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించినట్టు అతని స్నేహితుడు, బొబ్బిలికి చెందిన ఆర్మీ జవాను ఈశ్వరరావు బొబ్బిలి ఎరుకుల కాలనీలో నివాసముంటున్న మృతుని భార్య శ్రీవాణి కుటుంబానికి సోమవారం చెప్పారు. దీంతో అటు గొల్లాదిలో, ఇటు బొబ్బిలి ఎరుకులకాలనీలో విషాదం నెలకొంది. సత్యానికి 2002లో ఉద్యోగం రాగా ఆర్మీలో జేసీఓగా పనిచేస్తున్న బి.శ్రీరాములు కుమార్తె శ్రీవాణితో 2005 జూన్ 1న వివాహమైంది. సత్యం గతంలో జమ్ముకాశ్మీర్, ఉత్తరాంచల్, అస్సాం, నాసిక్‌లలో పనిచేశారు. ఏడాది కిందట మళ్లీ జమ్మూకాశ్మీర్‌కు బదిలీ అయ్యారు. మరో ఏడాది పాటు అక్కడ విధులు నిర్వహించాల్సి ఉంది.

 

 శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

 సత్యం మరణవార్త తెలియగానే కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సత్యానికి ఎనిమిదిన్నర ఏళ్ల కొడుకు వివేకానంద, ఏడాదిన్నర కుమారుడు భువన్ ఉన్నారు. భార్య శ్రీవాణి ప్రస్తుతం బొబ్బిలి రాజా కళాశాలలో ఎంఏ (ఇంగ్లిష్) రెండో సంవత్సరం చదువుతున్నారు.

 

 పుష్కరాలకు ఇంటిల్లిపాదితో వెళ్లారు..

 ఈ ఏడాది రాజమండ్రిలో నిర్వహించిన గోదావరి పుష్కరాల కోసం సత్యం స్వగ్రామానికి వచ్చాడు. దాదాపు నెల రోజుల పాటు ఇక్కడే ఉన్నారు. కుటుంబ సభ్యులందరితో కలిసి పుష్కరస్నానం చేసి వచ్చారు. జమ్మూకాశ్మీర్‌కు ఆగస్టు 18న బయలుదేరి వెళ్లారు.

 

 ఆదమరిపించి ప్రాణాలు తీశారు..

 ఆదివారం రాత్రి ఆంద్వారా ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న జవాన్లపై లష్కరేతోయిబా ఉగ్రవాదులు ఆదమరిపించి కాల్పులు జరిపారని అక్కడి వారు చెప్పారని శ్రీవాణి తండ్రి శ్రీరాములు విలేకరులకు తెలిపారు. రాత్రి ఉగ్రవాదుల జాడ కనిపించకపోవడంతో  వాగును దాటే ప్రయత్నం చేస్తుండగా వెనుక నుంచి వచ్చి తుపాకులతో కాల్చారన్నారు. సత్యం మృతదేహం నీళ్లలో కొట్టుకుపోయిందన్నారు. సోమవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించారని తెలిపారు. ప్రస్తుతం శ్రీనగర్‌లోని మార్చురీలో మృతదేహం ఉందని, బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి ఇక్కడకు పంపుతారని అక్కడి వారు చెప్పారని తెలిపారు. అయితే ఇప్పటి దాకా అధికారికంగా సమాచారం రాలేదన్నారు.

 

 కొడుకును చూడాలని ఉంది.. సత్యం తల్లిదండ్రుల రోదన

 బాడంగి: అయ్యో.. ఎంత ఘోరం జరిగిపోయింది.. బాబూ.. మా కొడుకును చూడాలని ఉందంటూ.. కాశ్మీర్ ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన ఆర్మీ జవాను సత్యం తల్లిదండ్రులు రాములు, నారాయణమ్మ రోదిస్తున్నారు. తామేమి పాపం చేసుకున్నామో.. కొడుకు ఉగ్రవాదుల కాల్పులకు బలైపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని గొల్లాది గ్రామంలో ఉంటున్న వీరికి కుమారుడి మరణవార్త సోమవారం సాయంత్రం తెలిసింది. అప్పటినుంచి కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు ముగ్గురు కుమారులు ఉండగా రెండో కుమారుడు సత్యంతోపాటు మూడో కుమారుడు వెంకట రమణ కూడా ఆర్మీలో పనిచేస్తున్నాడని వివరించారు. ఇటీవల తనకు పక్షవాతం వస్తే రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు చేసి బతికించాడని రాములు చెప్పారు. సత్యం మరణవార్తతో గ్రామంలో విషాదం అలముకుంది. మృతదేహం రాక కోసం కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top