ఆరు నెలల్లో అన్ని బస్సులకు జీపీఎస్


విజయవాడ : ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన అన్ని బస్సులకు జీపీఎస్‌ను అమర్చుతామని రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల కోసం కేటాయించిన ప్రత్యేక కంపార్ట్‌మెంట్‌లను విజయవాడ సిటీ టెర్మినల్‌లో శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 13 వేల ఆర్టీసీ బస్సుల్లోను ఆరు నెలల్లో జీపీఎస్ సిస్టమ్ అమలులోకి తెస్తామన్నారు. పాత బస్సులను సరుకు (గూడ్స్) రవాణాకు ఉపయోగించి ఆర్టీసీకి కమర్షియల్ ఆదాయాన్ని పెంచుతామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని సిటీ పరిధిలో తిరిగే ప్రతీ బస్సులోను ప్రత్యేక కంపార్టుమెంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. విజయవాడ నగరంలో 350, విశాఖలో 350 సిటీ బస్సులు తిరుగుతున్నాయని, ఆ బస్సుల్లోను వారం రోజుల్లో మహిళలకు ప్రత్యేక కంపార్టుమెంట్‌లను ఏర్పాటు చేస్తామన్నారు.



ప్రైవేటు బస్సుల కంటే ఆర్టీసీ బస్సులను మరింత సౌకర్యవంతంగాను, సురక్షితంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. ప్రతీ బస్సు స్టేషన్‌ను ఎయిర్‌పోర్టు తరహాలో తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో అన్ని బస్‌స్టేషన్‌లను తీర్చిదిద్దుతున్నామని, రెండవ దశలో 1200 మండల కేంద్రాల్లో బస్‌స్టాండ్‌లను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతీ బస్‌ డిపో, ఆర్టీసీ గ్యారేజీల్లో ఇంకుడు గుంతలు తవ్వాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. విలేకరుల సమావేశంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) జి.జయరావు, విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎన్.వెంకటేశ్వరరావు, కృష్ణా రీజినల్ మేనేజర్ పీవీ రామారావు, అధికారులు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top