'ప్రత్యేక ప్యాకేజీ పచ్చి మోసం'

'ప్రత్యేక ప్యాకేజీ పచ్చి మోసం' - Sakshi


-ఓటమి భయంతోనే కార్పొరేషన్ ఎన్నికలకు ప్రభుత్వం వెనుకంజ

-విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఇవ్వాల్సిందే

- వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి




అనకాపల్లి: ప్రత్యేక హోదాను పక్కన పెట్టిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీ విషయంలోనూ మసిబూసి మారేడుకాయ చేసే చందంగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన ఇష్టాగోష్టిలో స్థానిక విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ ఐదేళ్లు రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులనే ప్యాకేజీగా చిత్రీకరించి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు గొప్పలు చెప్పుకుంటున్నారని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీపై నిజంగా కేంద్ర ఆర్థిక మంత్రి ఉత్తర్వులు జారీ చేశారా అని ప్రశ్నించారు. సొంత ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రానికి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి బహిరంగ చర్చకు వస్తారా అని సవాల్ విసిరారు.



ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ రెండేళ్లుగా దీక్షలు, ధర్నాలు, యువభేరి వంటి కార్యక్రమాలు నిర్వహించిందని, ఈ క్రమంలోనే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు విశాఖపట్నంలో పార్టీ అధినేత జగన్‌మోహనరెడ్డి నవంబర్ 6న బహిరంగ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. హోదా వచ్చేవరకు తమ పార్టీ ఉద్యమాలు ఆపదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. గడప గడపకు వెస్సార్‌సీపీ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభిస్తోందన్నారు. విశాఖకు రైల్వేజోన్ ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఉద్యమాలు చేశారని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇచ్చేందుకు ఆసక్తి చూపడంలేదన్నారు.



ఎట్టిపరిస్థితిలోనూ విశాఖకు రైల్వే జోన్ ఇచ్చితీరాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ బిల్లును సమర్థిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఆరు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, ఇందులో విశాఖ నగర పాలకసంస్థకు కూడా ఉందని, అయితే టీడీపీకి విజయావకాశాలు లేకపోవడంతో కాలయాపన చేస్తోందని పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగు నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top