'సింగపూర్ నుంచి ఏపీ పాలన'


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన అంతా కూడా సింగపూర్ నుంచే నడుస్తోందని పశ్చిమగోదావరి జిల్లా నిరుద్యోగుల సంఘం ఆరోపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సామాన్య ప్రజానీకంలోకి రావడం లేదని, ప్రజల్లోకి అడుగు పెట్టకుండానే సింగపూర్ వెళుతున్నారని, అక్కడే ఉంటున్నారని ఆరోపించారు.  ప్రత్యేక హోదా కోసం గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు పశ్చిమ గోదావరి జిల్లా నిరుద్యోగ సంఘం బయలు దేరింది.



ఈ నేపథ్యంలో వారు మీడియాతో మాట్లాడారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి నేడు ఉపాధి కల్పించాలని కోరుతుంటే డబ్బులు లేవని అంటున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిస్తున్నట్లుగా అమరావతి నగరాన్ని నిర్మించలేరని అవన్నీ గ్రాఫిక్స్లోనే సాధ్యమని చెప్పారు. మరోపక్క, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థులు కూడా దీక్షకు బయలు దేరిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై సాధ్యం కాకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తప్పుకోవాలని, వైఎస్ జగన్ సాధిస్తారని అన్నారు.



ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్ విద్యార్థులు బెంగళూరులో దయనీయ స్థితిలో ఉన్నారని, కేవలం ఆరువేల రూపాయలకు అవమానకర పరిస్థితుల మధ్య పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ పోవాలంటే కేవలం ప్రత్యేక హోదానే పరిష్కార మార్గం అని చెప్పారు. ప్రత్యేక హోదాపై పోరాడుతున్న వైఎస్ జగన్ ను అడ్డుకోవడం అంటే మొత్తం రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని అడ్డుకున్నట్లేనని అన్నారు. ప్రత్యేక హోదాతో తమకు కనీసం ప్రైవేటు ఉద్యోగాలయినా వస్తాయని చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top