మజ్జిగకు రూ.3 కోట్లు విడుదల


ఒంగోలు : ఎండ తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో చలివేంద్రాల ఏర్పాటుకు జిల్లాకు రూ. 3 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వీటి ద్వారా మజ్జిగ, మంచినీళ్లతోపాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచనుంది. ఈ నిధులతో మండలాలవారీగా ప్రజల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి చలివేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటింగ్ అధికారులకు ఏర్పాటు బాధ్యతలను అప్పగించారు.

 

 అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటింగ్ అధికారులు తమ నియోజకవర్గ పరిధిలోని మండల అధికారుల ద్వారా గ్రామాల వారీగా సమాచారాన్ని సేకరించాలని ఆదేశాలు వచ్చాయి. జిల్లాలో ప్రస్తుతం ప్రభుత్వపరంగా, పంచాయతీల పరంగా, స్వచ్ఛంద సంస్థల పరంగా 1063 చలివేంద్రాలు నడుస్తున్నాయి, తొలి విడతగా ముఖ్యమైన ప్రాంతాల్లో 156 తాటాకు పందిళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, అంగన్‌వాడీ కేంద్రాలతోపాటు ప్రజలు ఎక్కువగా ఏ ప్రాంతాల్లో గుమికూడి ఉంటారో గుర్తించి అక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. చలివేంద్రాల వద్ద మజ్జిగ ప్యాకెట్లతోపాటు మంచినీళ్లు ఇవ్వనున్నారు. లక్షా 13 వేల 700 ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను కూడా చలివేంద్రాల వద్ద అందుబాటులో ఉంచనున్నారు. ఎండ తీవ్రతకు గురైనవారికి వెంటనే ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు కలిపిన నీటిని తాగించడం ద్వారా కొంతమేర ఉపశమనం పొందుతారని ప్రభుత్వం భావిస్తోంది.

 

 ప్రచారానికే ప్రాధాన్యం

 ఈ చలివేంద్రాలను ప్రచారాస్త్రాలుగా మార్చుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చలివేంద్రాల వద్ద పెద్దఎత్తున హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని జిల్లా కేంద్రానికి ఆదేశాలు అందాయి.

 జిల్లాలో 2400 హోర్డింగ్‌లు ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. వాటితోపాటు 3 లక్షల 24 వేల 740 కరపత్రాలను ముద్రించి పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top