భక్తులకు బస ఎక్కడ?

భక్తులకు బస ఎక్కడ?

అంత్య పుష్కరాలకు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి రానున్న యాత్రికులు 

వర్షాకాలంలో కావడంతో తలదాచుకునే తావు లేక ఇబ్బందులు పడే పరిస్థితి

ఆది పుష్కరాలకు నగరంలో పలుచోట్ల మౌలిక సదుపాయాలతో పుష్కరనగర్‌లు

ప్రస్తుతం కూడా అలాంటి ఏర్పాట్లు అవసరం

సాక్షి, రాజమహేంద్రవరం :

గోదావరి అంత్య పుష్కరాల్లో నదీస్నానానికి రోజుకు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాలు, వాటి  ఇరుగుపొరుగు జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు రానున్నారు. గతేడాది పుష్కరాలకు ఉభయగోదావరి జిల్లాల్లో ఉన్న అన్ని ఘాట్లకూ భక్తులు వెళ్లినా అంత్య పుష్కరాలకు మాత్రం రాజమహేంద్రవరం నగరంలోని ఘాట్లకే యాత్రికుల తాకిడి అధికంగా ఉండనుంది. అంతేకాక అంత్య పుష్కరాలకు ఏ1 ఘాట్లనే అధికారులు ఎంపిక చేశారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది, రాజమహేంద్రవరం నగరంలో మరో ఎనిమిది ఘాట్లు ఉన్నాయి. అధికారులు భక్తులను ఈ ఘాట్లలోకే అనుమతించనున్నారు. రాజమహేంద్రవరం నగరంలోని గౌతమ ఘాట్, సరస్వతీ(వీఐపీ)ఘాట్, పద్మావతి ఘాట్, సదానందఘాట్, మార్కండేయ స్వామి దేవాలయం ఘాట్, పుష్కర ఘాట్, టీటీడీ ఘాట్, కోటిలింగాల ఘాట్‌లలో భక్తులు స్నానమాచరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. ముఖ్యంగా పుష్కరఘాట్, కోటిలింగాల ఘాట్‌లకు భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. పుష్కరుడు కొలువుదీరిన పుష్కరఘాట్‌లోనే స్నానమాచరిస్తే అధిక పుణ్యదాయకమని భక్తుల నమ్మకం. అంతేగాక గోదావరి రైల్వే స్టేషన్‌ను అతి సమీపంగా ఉండడం, రవాణా, ఇతర సదుపాయాలకు అందుబాటులో ఉండడం వల్ల కూడా భక్తులు పుష్కరఘాట్‌కు తరలిరానున్నారు. అలాగే పితృదేవతలకు పిండప్రదానాలు చేసేందుకు అనువైన కోటిలింగాల ఘాట్‌కు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. 

సామాన్యులకు అందుబాటులో లేని హోటళ్లు

రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు నగరంలో బస చేయడానికి తగిన సౌకర్యాలు లేవు. నగరంలో ఉన్న అధిక శాతం హోటళ్లలో ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి. కోటిలింగాల ఘాట్‌ వద్ద పందిరి మహదేవుడు సత్రం, పుష్కరఘాట్‌ సమీపంలోని చందా సత్రం భక్తుల బసకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ రెండు సత్రాలలో కేవలం 1,000 మంది మాత్రమే బస చేసేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు బస చేసేందుకు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. గతేడాది పుష్కరాలకు నగరంలోని ఖాళీ ప్రదేశాలల్లో తాత్కాలికంగా టెంట్లు వేసి వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు. మార్గాని ఎస్టేట్స్, హౌసింగ్‌ బోర్డు కాలనీ, ఆర్ట్స్‌ కాలేజీ మైదానం, లూథర్‌ గిరి, ప్రధాన రైల్వే స్టేషన్‌ గూడ్స్‌ గేటు ప్రాంతాల్లో పుష్కరనగర్‌ల పేరుతో టెంట్లు వేసి మంచినీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలతో భక్తులకు ఉచిత వసతి కల్పించారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కనీసం తలదాచుకునే తావు లేక అవస్థలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆది పుష్కరాల స్థాయిలో కాకపోయినా ఇప్పుడు కూడా కనీస సదుపాయాలతో కొన్ని చోట్లయినా పుష్కరనగర్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.  

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top