మరో సేల్

మరో సేల్ - Sakshi


♦ తాజాగా మరో విపక్ష ఎమ్మెల్యేకి టీడీపీ ఎర

♦ చెల్లింపులు రూ. 30 కోట్లకు పైమాటే!

♦ మొత్తం కొనుగోళ్లకు రూ.500 కోట్లకు పైనే..

♦ అవినీతి సొమ్ము వెదజల్లుతున్న చంద్రబాబు

♦ ఎక్కడ చూసినా బ్లాక్‌మనీ ప్రవాహం

♦ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఆగని ప్రలోభాలు

♦ విలువలు, విశ్వసనీయతలకు పాతర

♦ ప్రజాతీర్పు కోరే ధైర్యం లేదు.. అనర్హత వేటు వేయరు

♦ రాజీనామా చేసే దమ్ముందా?... వైఎస్సార్సీపీ ప్రశ్న

 

 

 సాక్షి ప్రత్యేక ప్రతినిధి:
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ‘ఆకర్ష్ రాజకీయం’ అంతూ దరి లేకుండా కొనసాగుతోంది. వేరే పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొనుగోలు చేసినట్లు కొనుగోలు చేయడం ఇంకా ఆగలేదు. తాజాగా కర్నూలు ఎమ్మెల్యే ఎస్‌వి మోహనరెడ్డికి తెలుగుదేశం కండువా కప్పబోతున్నారు. రూ. 30 కోట్ల నగదు, కాంట్రాక్టులతో పాటు రాజధానిలో విలువైన భూమి.. ఇలా ఎన్నో ఎరవేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న సంగతి తెల్సిందే. 17 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం కోసం చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు రూ. 500 కోట్లకు పైగానే నల్లధనాన్ని ఖర్చు చేసినట్లు తెలుగుదేశం వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.



తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే ఓటుకు రూ. 5 కోట్లు నుంచి రూ. 20 కోట్లు వెదజల్లిన చంద్రబాబు నాయుడు ఆడియో వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయారు. నామినేటెడ్ ఎమ్మెల్యేకి రూ. 50 లక్షల అడ్వాన్సు ఇస్తూ ఆ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ససాక్ష్యంగా పట్టుబడ్డారు. అయినా చంద్రబాబు మీదగానీ, ఆ పార్టీ నాయకుల మీద గానీ ఎలాంటి చర్యలూ లేవు. రెండేళ్లలో విచ్చలవిడి అవినీతితో ఆర్జించిన లక్షన్నరకోట్ల డబ్బును ఇలా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వెచ్చిస్తున్నారు. కోట్లాది రూపాయల బ్లాక్‌మనీ ప్రవహిస్తున్నా రాష్ర్టంలో ఎలాంటి అడ్డూ అదుపూ లేకపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది.



 విలువలకు పాతర

 ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీలోకి మారాలనుకుంటే రాజీనామా చేయడం సంప్రదాయం. తిరిగి ఆ పార్టీ గుర్తుపై పోటీ చేయడం పద్ధతి. కానీ అలాంటి సాంప్రదాయాలకు, పద్ధతులకు తెలుగుదేశం పార్టీ అధినేత తిలోదకాలిచ్చారు. విలువలకు పాతరేశారు. అనేక ప్రలోభాలతో పార్టీలోకి తీసుకొస్తున్న ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించే సాహసం చేయడం లేదు. వారిపై అనర్హత వేటు వేసి ఎన్నికలకు వెళ్లే ధైర్యం చేయడం లేదు. దమ్ముంటే ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని, తిరిగి ప్రజాతీర్పు కోరాలని వైఎస్సార్సీపీ నాయకులు సవాల్ చేస్తున్నా చంద్రబాబు కిమ్మనడం లేదు. ప్రజాస్వామ్యాన్ని నట్టనడి బజారులో ఖూనీ చేస్తూ విచ్చలవిడిగా డబ్బు వెదజల్లుతూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. బరితెగించినట్లుగా ఫిరాయింపుల పర్వానికి స్వయంగా ముఖ్యమంత్రే నాయకత్వం వహించడం, దగ్గరుండి పర్యవేక్షించడం గతంలో ఎన్నడూ ఎరగమని రాజకీయ విశ్లేషకులంటున్నారు. అంతేకాక ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎలాంటి అనర్హత వేటు పడకుండా రాజ్యాంగ వ్యవస్థలను కూడా మేనేజ్ చేస్తుండడం గమనార్హం.

 

 అభివృద్ధిపై నమ్మకముందా...?

 ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అభివృద్ధి చూసి వస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చెబుతున్నారు. తాము చేసిన అభివృద్ధిపై అంత నమ్మకం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించవచ్చు కదా అని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ పేరు చెప్పి మోసం చేయడంతో రైతులు, డ్వాక్రా మహిళలు రగిలిపోతున్నారు. ఇంటికో ఉద్యోగమిస్తామని, లేదంటే నెలకు రూ. 2,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసగించడంతో నిరుద్యోగులు ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు అన్నివిధాలుగా అప్రతిష్ట మూటకట్టుకున్నారు. అంతులేని అవినీతితో అన్ని రంగాలనూ భ్రష్టు పట్టించారు. రాజధాని అమరావతిని కూడా అవినీతికి ప్రతిరూపంగా మార్చేశారు. అందుకే ఆయన ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించే సాహసం చేయలేకపోతున్నారని వైఎస్సార్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top