పరిశోధన రంగంలో మరో మైలురాయి


వైవీయూ: వైఎస్సార్‌ జిల్లాలోని యోగివేమన విశ్వవిద్యాలయం పరిశోధన రంగంలో మరో మైలురాయిని అధిగమించనుంది. ఇప్పటికే పలు సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకుని కోట్లాది రూపాయల విలువైన ప్రాజెక్టులు సొంతం చేసుకున్న విశ్వవిద్యాలయం సిగలో మరో కలికితురాయి వచ్చి చేరనుంది. బుధవారం ప్రఖ్యాత పరిశోధన సంస్థ విక్రమ్‌సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్, తిరువనంతపురం ఆధ్వర్యంలో స్పేస్‌ ఫిజిక్స్‌ లేబొరేటరీ (ఎస్‌పీఎల్‌) వారితో యోగివేమన విశ్వవిద్యాలయం భౌతికశాస్త్ర విభాగం ఎంఓయూ (మెమొరాండం ఆఫ్‌ అండర్‌ స్టాండింగ్‌) చేసుకోనుంది. ఈ ఎంఓయూ చేసుకోవడం ద్వారా విశ్వవిద్యాలయానికి రూ.లక్షల విలువచేసే పరిశోధన పరికరాలు అందుతాయి. దీంతో పాటు విద్యార్థులకు ఫెలోషిప్‌లు లభించడంతో పాటు దేశ, విదేశాల్లో పరిశోధనలు చేసేందుకు ఈ ఒప్పందం ఉపకరించనుంది. తద్వారా ఉద్యోగ అవకాశాలు సైతం ఇక్కడ విద్యనభ్యసించే, పరిశోధనలు చేసే విద్యార్థులకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఒప్పందం ద్వారా అంతరిక్ష పరిశోధనల్లో విశ్వవిద్యాలయ విద్యార్థులు సైతం భాగస్వాములయ్యే అవకాశం లభించనుంది. భారతదేశ అనుసంధాన అంతరిక్ష పరిశోధన ప్రభావం పరిశీలన కోసం పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. దీని వలన విశ్వవిద్యాలయానికి డ్యూయల్‌ ఫ్రీక్వెన్సీ, గ్లోబల్‌ పొజిషన్‌ సిస్టిం రిసీవర్లు, యాంటెనాలు, పరికరాలు లభిస్తాయి. వీటి ద్వారా ట్రోపో, ఐనో, స్ట్రాటో ఆవరణాలలోని వాతావరణ పరిస్థితులపై కూలంకషంగా పరిశోధనలు చేసే అవకాశం విశ్వవిద్యాలయానికి లభించనుంది.

ఎంఓయూ కోసం రానున్న సీనియర్‌ శాస్త్రవేత్త..

విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎస్‌ఎస్‌సీ) వైవీయూల మధ్య జరిగే ఒప్పందానికి వీఎస్‌ఎస్‌సీ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ రాజ్‌కుమార్‌చౌదరి, సాంకేతిక అధికారి మహమ్మద్‌ నజీర్‌లు విచ్చేసి విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లర్‌ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి సమక్షంలో భౌతికశాస్త్ర విభాగం ప్రతినిధులతో ఒప్పందం చేసుకోనున్నారు. ఈ పరిశోధన సంస్థ ద్వారా వైవీయూకు లభించే పరికరాలను ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలం కోసం గతేడాది ఆగస్టు నెలలో స్థల పరిశీలన సైతం పూర్తయింది. విశ్వవిద్యాలయంలోని వాతావరణ పరిశోధన కేంద్రం సమీపంలో పరికరాలను ఏర్పాటు చేయనున్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top