తిరుమలలో మరో వంతెన

తిరుమలలో మరో వంతెన


తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయానికి అనుసంధానంగా ఉన్న కదిలే æవంతెన స్థానంలో మరో కొత్త వంతెన నిర్మించాలని టీటీడీ భావిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ నుంచి ఆలయంలోకి భక్తులు వేగంగా, సులువుగా వెళ్లేందుకు వీలుగా కొత్త వంతెన నిర్మించాలని నిర్ణయించింది.



భక్తుల క్యూ వేగానికి కదిలేవంతెన చాలడం లేదు

1985లో మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్, 2003లో రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ నిర్మించారు. వీటికి అనుసంధానంగా దక్షిణమాడ వీధిలోని తిరుమల నంబి సన్నిధి వద్ద కదిలే వంతెన నిర్మించారు. ఐదేళ్లకు ముందు పూర్తిస్థాయి హైడ్రాలిక్‌ యంత్రాలతో నిర్మించారు. ఈ వంతెనపై కేవలం రెండు లైన్లే వెళ్లే అవకాశం ఉంది. దీనివల్ల క్యూలు ఆలస్యమవుతున్నాయి. రద్దీ రోజుల్లో మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ కింద భాగంలోని అత్యవసర ద్వారం నుంచి తిరుమల నంబి ఆలయం మీదుగా ఆలయ క్యూలకు భక్తులను అనుమతించాల్సి వస్తోంది.



శ్రీవారి వాహనసేవలకూ ఇబ్బందే

బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పర్వదినాల్లో వాహన సేవల ఊరేగింపు సమయాల్లో కదిలేవంతెనతో ఇబ్బందులున్నాయి. వాహనసేవకు ముందు తీయడం, తిరిగి అమర్చేందుకు కనీసం 20 నిమిషాల సమయం పడుతోంది. దీనివల్ల క్యూలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కదిలేవంతెన సమస్యల్ని టీటీడీ ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు గుర్తించారు. ఆమేరకు నిపుణుల సూచనలు కోరారు. ఇందులో భాగంగానే గురువారం టీటీడీ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, ఐఐటీ నిపుణుల బృందం కూడా కదిలే వంతెనను పరిశీలించింది.



కొత్త వంతెన అమర్చాలని నిర్ణయం

ప్రస్తుతం ఉన్న కదిలే వంతెనకు ఆనుకునే పడమర దిశలో కొత్త వంతెన నిర్మించనున్నారు. భక్తులు నాలుగు లేన్లుగా వెళ్లడం, వాహన సేవల ఊరేగింపు సమయాల్లో తొలగించడం, తిరిగి అమర్చే విషయంలో కేవలం 5 నిమిషాల సమయం ఉండేలా కొత్త వంతెన అమర్చాలని భావిస్తున్నారు. రానున్న బ్రహ్మోత్సవాల్లోపు ఈ వంతెన నిర్మించాలని ఇంజినీర్లు యోచి స్తున్నారు. ప్రస్తుతమున్న వంతెన అత్యవసర పరిస్థితుల్లో వినియోగించనున్నారు.



శ్రీవారి దర్శనానికి పెరుగుతున్న భక్తులు

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2016లో మొత్తం 2.66 కోట్ల మంది వచ్చారు. అంటే రోజూ 72 వేల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. దీనికి తగ్గట్టుగా క్యూలు లేవు. అందుకనుగుణంగా క్యూల్లో మార్పులుచేర్పులు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top