పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక

పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక


గొర్రెల యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కలెక్టర్‌ జ్యోతి బుద్ధ ప్రకాష్‌

మహారాష్ట్ర గొర్రెలు ఇక్కడి వాతావరణాన్ని తట్టుకోవడం కష్టమే : లబ్ధిదారులు


ఆదిలాబాద్‌రూరల్‌:
గొర్రెల యూనిట్ల కోసం లబ్ధి దారుల ఎంపిక లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా కొనసాగుతోందని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ జ్యోతిబుద్ధప్రకాష్‌ అన్నారు. లాటరీ పద్ధతిలో ఎంపిక ఆధారంగా ఏ, బీ గ్రూపులు ఏర్పాటు చేసి అందులో 50 శాతం ఈ ఏడాది, వచ్చే ఏడాది మరో 50 శాతం మంది గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్లు మంజూరు చేస్తామని చెప్పారు.



శనివారం మావల మండలంలోని దస్నాపూర్, సరస్వతీనగర్‌ కాలనీలో నిర్వహించిన గొర్రెల యూనిట్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గొర్రెల పెంపకందారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు గొర్రెల పెంపకందారులు మాట్లాడుతూ మహారాష్ట్రలోని గొర్రెలు ఆదిలాబాద్‌ ప్రాంత వాతావరణం తట్టుకోవడం కష్టమేనని, స్థానికంగా గొర్రెలు కొనుగోలు చేసి ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ జ్యోతి బుద్ధ ప్రకాష్‌ మాట్లాడుతూ ఆదిలాబాద్‌ జిల్లాకు సంబంధించిన గొర్రెల యూనిట్ల కొనుగోళ్లకు మహారాష్ట్రలోని ఎనిమిది జిల్లాలను ప్రభుత్వం ఎంపిక చేసిందని అన్నారు. ఆయా జిల్లాల్లోనే కొనుగోలు చేస్తామని, సొసైటీ సభ్యులను ఆయా జిల్లాలకు అధికారులు తీసుకెళ్తారని, సొసైటీ సభ్యులు, లబ్ధిదారులు నచ్చితేనే గొర్రెలు కొనుగోలు చేస్తారని వివరించారు.



గొర్రెల యూనిట్లను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. అంతకుముందు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రామారావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 133 సొసైటీల్లో 6,703 మంది సభ్యత్వం తీసుకున్నారని, వీటిలో 95 సొసైటీలకు చెందిన 5,950 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. వీటిని ఏ, బీ గ్రూపులుగా ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఆయన వివ రించారు.



ఎంపికైన వారిలో ఏ గ్రూపులోని 50 శాతం మంది లబ్ధిదారులకు ఈ ఏడాది గొర్రెలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మావల గ్రామ సర్పంచ్‌ ఉష్కం రఘుపతి, ఆదిలాబాద్‌ ఏఎంసీ చైర్మన్‌ ఆరె రాజన్న, జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగిరి అశోక్, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు గంగారెడ్డి, ఉప సర్పంచ్‌ అక్కమ్మ, వార్డు సభ్యుడు వై.రాంకుమార్, తహసీల్దార్‌ భోజన్న, ఎంపీడీవో రవీందర్, మండల పశువైద్యాధికారి రమేష్, యాదవ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రఘువీర్‌ యాదవ్, అసుర హన్మాండ్లు యాదవ్, మావల ఈవో ఆనంద్, తదితరులు పాల్గొన్నారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top