సత్తెన్నకూ తప్పని ‘దేశం’ సతాయింపు


  • కొండెక్కి కలబడుతున్న తమ్ముళ్లు

  • అన్నవరం ట్రస్టు బోర్డుకు బ్రేకులు

  • జీవోను నిలుపుదల చేసిన దేవాదాయ శాఖ

  • సత్యదేవుని సన్నిధిలోనే నలుగు నేతల రాజకీయ పేచీలు... ట్రస్ట్‌ బోర్డు నియామకం జరిగి ఆమోద ముద్రపడినా జీఓ విడుదల కాని వైనం. తాము  ప్రతిపాదించినవారి పేర్లు కాకుండా పెత్తనం చెలాయించే పెద్దల సిఫార్సులకు పెద్దపీట వేస్తారా అని మిగిలిన వర్గాలు మండిపడడంతో దేవాదాయ శాఖా మంత్రి మాణిక్యాల రావు ఏకంగా జీఓను అడ్డుకోవడంతో విభేదాలు రసకందాయంలో పడ్డాయి. దీంతో నేతల మధ్యనే కాదు బోర్డు సభ్యుల మధ్య కూడా అభిప్రాయభేదాలు తలెత్తుతున్నాయి. 

     

    సాక్షి ప్రతినిధి, కాకినాడ :

    తెలుగు దేశం పార్టీ విబేధాలు అన్నవరం సత్తెన్నను కూడా సతాయిస్తున్నాయి. ఆ‡ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సత్యదేవుని సాక్షిగా కొండెక్కి మరీ కలబడుతున్నారు. నేతల కొట్లాటల పుణ్యాన ట్రస్టుబోర్డు నియామకానికి బ్రేక్‌ పడింది. బోర్డుకు సీఎం చంద్రబాబు గ్రీ¯ŒSసిగ్నల్‌ ఇచ్చినా దేవాదాయశాఖ నుంచి జీఓ విడుదల నిలిచిపోయింది. మంత్రి మాణిక్యాలరావు ప్రమేయం లేకుండా టీడీపీ నేతలు ట్రస్టుబోర్డు ప్రతిపాదనలు పంపడంపై మొదలైన వివాదం కాకినాడ ఎంపీ తోట నరసింహం, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మధ్య చిచ్చురేపింది. మధ్యలో ఆర్థికమంత్రి యనమల సొంత నియోజకవర్గం తునిలో ఇద్దరికి అవకాశం ఇవ్వడం కూడా తోడవ్డంతో ట్రస్టుబోర్డు వివాదం ముదిరి పాకాన పడింది.

     

    ముద్రపడినా పితలాటకాలే..

    రాష్ట్రంలో నామినేటెడ్‌ పోస్టుల నియామకానికి గత నెల 29న సీఎం ఆమోద ముద్రవేశారు.అందులో అన్నవరం సత్యదేవుని పాలకవర్గాన్ని 13 మంది సభ్యులతో గ్రీ¯ŒS సిగ్నల్‌ ఇచ్చారు.ట్రస్టుబోర్డు జాబితా కాకినాడ ఎంపీ తోట నరసింహం, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మధ్య వివాదం భగ్గుమనేలా చేసింది. జగ్గంపేట నియోజకవర్గానికే చెందిన వీరిద్దరి మధ్య రాజకీయంగా పచ్చగడ్డి వేయకుండా భగ్గుమనే పరిస్థితి. వీరిద్దరూ వేర్వేరు పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించే వారు. ఇటీవల నెహ్రూ టీడీపీకి తిరిగి రావడంతో సహజంగానే జగ్గంపేటలో ఎప్పటి నుంచో వీరి మధ్య ఉన్న వైరం కాస్తా ఆధిపత్య పోరుగా మారింది. ట్రస్టు బోర్డు సభ్యుడిగా ఎంపీ తన అనుచరుడైన కిర్లంపూడి మండలం తామరాడకు చెందిన తోట అయ్యన్న, ఎమ్మెల్యే నెహ్రూ తన అనుచరుడైన కొత్త వెంకటేశ్వరరావును  ప్రతిపాదించారు. వీరిద్దరిలో తోట ప్రతిపాదించిన అయ్యన్న పేరు సీఎంకు వెళ్లిన జాబితాలో గల్లంతై నెహ్రూ ప్రతిపాదించిన వెంకటేశ్వరరావు పేరు జాబితాలో ఉంది. పార్టీలోకి వచ్చీరాగానే నెహ్రూ ప్రతిపాదించిన పేరును ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ఎంపీ తోట నరసింహావతారమెత్తి కత్తులు నూరుతున్నారు. కనీసం ట్రస్టుబోర్డు సభ్యుడిని కూడా నియమించుకోలేని తోటకు పార్టీలో పరపతి ఎక్కడుందని అతని వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరిద్ధరి ఆధిపత్య పోరుకు తాజాగా అన్నవరం ట్రస్టు బోర్డు మరింత అగ్గిని రాజేసింది. ఈ విషయంలో రాజీ పడిపోతే మరో రెండేళ్లు∙ ప్రతి దానికి వెనకడుగు వేయాల్సి వస్తోందని అనుచరుల సూచనలతో ఎంపీ తోట తాడోపేడో తేల్చుకుంటామంటున్నారు. తోట ఈ విషయంపై దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు దృష్టికి తీసుకువెళ్లారని అనుచరులు చెబుతున్నారు. 

    తోట వెర్సెస్‌ నెహ్రూ వ్యవహారం ఇలా కొనసాగుతుండగా మధ్యలో ఆర్థిక మంత్రి యనమల, ఈయన సోదరుడు కృష్ణుడు ప్రతిపాదించిన ఇద్దరిననీ నియమించడం టీడీపీలో చిచ్చు రేపింది. తుని నియోజకవర్గం నుంచి ఎడ్ల బేతాళుడు, యనమల రాజేష్‌కు అవకాశమిచ్చారు. గతంలో ఎప్పుడూ లేనిది ఇద్దరికి అవకాశం ఇవ్వడంలో ఆంతర్యమేమిటని పార్టీ సీనియర్లు తీవ్ర అసహనంతో ఉన్నారు. స్వయానా ఆర్థిక మంత్రి సిఫార్సుతో సోదరుడి కుమారుడు రాజేష్‌కు, కృష్ణుడు సిఫార్సుతో బేతాళుడుని ట్రస్టు బోర్డులోకి తీసుకున్నారు. తుని నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వడంపై పార్టీలో రసవత్తరమైన చర్చ సాగుతోంది. తునిలో అన్నదమ్ములిద్దరు రెండు పదవులు పంచేసుకుంటారా అని నేతలు ప్రశ్నిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినందుకు రెండు పోస్టులు ఇచ్చారా అని తమ్ముళ్లు మధ్య ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇచ్చిన ఒక పేరు చెత్తబుట్టలో పడేసి ఎందుకు ప్రాధాన్యతనిచ్చారని ఎంపీ తోట వర్గీయులు ఆగ్రహంతో మంత్రి మాణిక్యాలరావు దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. తనకు తెలియకుండా జాబితా తయారుచేశారని టీడీపీ నేతలపై అసహనంతో ఉన్న మంత్రి మాణిక్యాలరావు జీఓ  విడుదలకు సానుకూలంగా లేరని కమలనాధులు చెబుతున్నారు. అన్నవరం కొండపై గత పెళ్లిళ్ల సీజ¯ŒSలో అశ్లీల నృత్యాలు, మందు బాటిళ్లతో క్యాబరేను తలపించిన రీతిలో అసాంఘిక కార్యకలాపాలకు తెరవెనుక సహాయ సహాకారాలు అందించిన ఒక నేతను ట్రస్టుబోర్డులోకి తీసుకోవడం కూడా మంత్రి దృష్టికి వెళ్లినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top