అన్నవరం దేవునికీ ‘పన్ను’పోటు

అన్నవరం దేవునికీ ‘పన్ను’పోటు

రూ.20 లక్షలు చెల్లించాలని పంచాయతీల నోటీసులు

చట్టం ప్రకారం మినహాయింపు కోరగా తిరస్కరించిన డీపీఓ

కోర్టును ఆశ్రయిస్తామంటున్న దేవస్థానం ఈఓ 

అన్నవరం : 

ఆపన్నులకు రక్షగా నిలిచే రత్నగిరీశునికీ పన్నుపోటు తప్పలేదు. అన్నవరం దేవస్థానంలోని రత్నగిరి, సత్యగిరిపై గల వివిద భవనాలకు సంబంధించి  2015–16 సంవత్సరానికి రూ.20 లక్షల పన్ను చెల్లించాలని అన్నవరం, బెండపూడి పంచాయితీలు దేవస్థానానికి నోటీసులు పంపించాయి. శంఖవరంలోని కల్యాణ మండపానికి రూ.36 వేల ఆస్తిపన్ను  చెల్లించాలని ఆ పంచాయితీ కూడా నోటీస్‌ ఇచ్చింది. దేవస్థానానికి ఏపీజీపీ 1964 చట్టం ప్రకారం పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారికి దేవస్థానం లేఖ రాసినా సాధ్యం కాదని సమాధానం ఇచ్చారు. దీనిపై కోర్టులో కేసు వేసి మినహాయింపు పొందాలని దేవస్థానం నిర్ణయించింది. సుమారు ఏడాదిగా దేవస్థానం, పంచాయితీల మధ్య పన్నుల వివాదం నడుస్తోంది.

 పదిరెట్లు పెరిగిన పన్ను

 రత్నగిరిపై  వివిద భవనాలు, సత్రాలకు సవరించిన పన్నుల ప్రకారం గత ఆర్థిక సంవత్సరానికి రూ.14.28 లక్షల ఇంటిపన్ను చెల్లించాలని అన్నవరం  పంచాయితీ దేవస్థానానికి గత ఏడాది ఆగస్టులో నోటీస్‌ పంపింది. అప్పటివరకూ కేవలం రూ.1.40 లక్షలు మాత్రమే ఉన్న పన్ను  ఒక్కసారిగా పదిరెట్లు పెరగడంతో  దేవస్థానం అధికారులు ఉలిక్కిపడ్డారు.  బెండపూడి పరిధిలోకి వచ్చే సత్యగిరిపై నిర్మించిన హరిహరసదన్‌ సత్రానికి రూ.3.04 లక్షలు, విష్ణుసదన్‌ సత్రానికి రూ.1.55 లక్షలు పన్ను చెల్లించాలని ఆ పంచాయతీ, శంఖవరంలోని కల్యాణమండపానికి రూ.36,634 పన్ను చెల్లించాలని ఆ పంచాయతీ కూడా నోటీసులు పంపాయి. దేవస్థానం సత్రాలు, అతిథిగృహాలు అద్దెకిస్తూ ఆదాయం పొందుతున్నందున నిబంధనల ప్రకారం  ఇంటిపన్ను చెల్లించాల్సిందేనని పంచాయతీ అధికారులు అంటున్నారు.  పాత భవనాలకు పన్ను సవరించడంతో బాటు కొత్త వాటికి పన్ను వేశామని చెపుతున్నారు. కొండదిగువన లాడ్జిలలో గదులను అద్దెకిస్తున్నట్టే దేవస్థానం సత్రాలను కూడా అద్దెకిస్తున్నారంటున్నారు. ఏపీజీపీ1964 చట్టం ప్రావిజన్‌ రూల్‌–5ఈ ప్రకారం  పన్ను మినహాయింపు ఇవ్వాలని దేవస్థానం ఈఓ నాగేశ్వరరావు జిల్లా పంచాయతీ అధికారి జేఎస్‌ఎస్‌ శర్మకి గత డిసెంబర్‌లో లేఖ రాశారు. అన్నవరం పంచాయతీకి ఏటా గ్రాంట్స్‌ రూపంలో, గ్రామంలో పారిశుధ్య పనుల కోసం రూ.ఏడు లక్షలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. 

పన్నులు కట్టి తీరాల్సిందే..

     పంచాయతీ చట్టం ప్రకారం పౌల్ట్రీషెడ్లు, ఎన్‌జీఓ హోమ్‌లు, మాజీ సైనికోద్యోగులకు మాత్రమే ఇంటిపన్ను మినహాయింపు ఉంది తప్ప దేవస్థానాలకు లేదని డీపీఓ గత ఫిబ్రవరిలో పంపిన లేఖలో  పేర్కొన్నారు. అందువలన పన్నులు  కట్టాల్సిందేనన్నారు. దేవస్థానంలో భవనాలకు విధించిన పన్నులను చెల్లించాల్సిందేనని అన్నవరం గ్రామపంచాయతీ కార్యదర్శి బి.రామశ్రీనివాస్‌ అన్నారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ దేవస్థానం చెల్లించే పన్నులను తిరిగి గ్రామాభివృద్ధికే ఉపయోగిస్తామని చెప్పారు. కాగా దేవస్థానాలకు ఇంటి, ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇస్తూ గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీఓను అనుసరించి కోర్టుకు వెళతామని ఈఓ నాగేశ్వరరావు ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. సింహాచలం దేవస్థానానికి విశాఖ కార్పొరేషన్, ద్వారకా తిరుమల దేవస్థానానికి అక్కడి పంచాయతీ ఇలాగే పన్ను కట్టమని నోటీస్‌ ఇస్తే ఆ దేవస్థానాలు కూడా కోర్టును ఆశ్రయించాయన్నారు. 

 

 రత్నగిరి, సత్యగిరిలపైనున్న దేవస్థానం భవనాలు, సత్రాలు, ఇతర నిర్మాణాలు

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top