సత్యగిరిపై సత్రానికి మూడో ‘సారీ’

సత్యగిరిపై సత్రానికి మూడో ‘సారీ’

సత్రం నిర్మాణానికి మూడో సారి తీర్మానం

తిరస్కరించిన ఉన్నతాధికారులు

కొండ దిగువున సత్రం నిర్మాణానికి అంగీకారం

అన్నవరం (ప్రత్తిపాడు):  ప్రతి చిన్న విషయానికి పొదుపు, విరాళాలు అంటూ కాలయాపన చేసే దేవస్థానం అధికారులు ఒకవైపు... అవసరమని తెలిసి కూడా సత్రాల నిర్మాణానికి అనుమతి ఇవ్వని దేవాదాయశాఖ ఉన్నతాధికారులు మరోవైపు... దీంతో అంగుళం ముందుకు కదలని దేవస్థానం నిర్మాణాలు... వసతి గదులు దొరక్క భక్తుల ఇబ్బందులు...ఇదీ ప్రస్తుతం అన్నవరం దేవస్థానం పరిస్థితి. అన్నవరం సత్యగిరిపై 1.5 ఎకరాల స్థలంలో రూ.16 కోట్లతో ఐదంతస్తుల్లో 138 గదులతో తలపెట్టిన సత్రం నిర్మాణానికి ముచ్చటగా మూడో సారీ దేవాదాయశాఖ ఉన్నతాధికారుల నుంచి చుక్కెదురైంది. ఈ నిర్మాణం ఇప్పుడే వద్దని, ముందు కొండదిగువున ఈరంకి వారి సత్రంలో వంద గదులు నిర్మించుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్‌ వై.వి.అనూరాధ దేవస్థానం అధికారులకు సూచించారు. దీంతో ఈ సత్రం నిర్మాణానికి ఏడేళ్లలో మూడో సారి అధికారులు చేసిన ప్రయత్నం వృ«థా అయింది. 

దేవస్థానం మాస్టర్‌ప్లాన్‌ ఇంకా సిద్ధం కాకపోవడాన్ని సాకుగా చూపి అనుమతి ఇవ్వలేదని అధికారులు తెలిపారు. ప్రిన్సిపల్‌ సెక్రటరీ జె.ఎస్‌.వి.ప్రసాద్‌ దేవస్థానానికి వచ్చి ఈ సత్రం నిర్మాణం అవసరం ఉందో లేదో పరిశీలించిన తరువాత అనుమతి ఇచ్చే విషయం పరిశీలిస్తామని చెప్పినట్టు సమాచారం. దీంతో ఈ సత్రం అనుమతి కోసం విజయవాడ వెళ్లిన ఇంజినీరింగ్‌ శాఖ అధికారులు డీలా పడ్డారు.

2011లోనే పాలక మండలి తీర్మానం 

భక్తుల వసతి కోసం సత్యగిరిపై 138 గదులతో సత్రం నిర్మించాలని 2011లో చైర్మన్‌ ఐ.వి.రామ్‌కుమార్‌ అధ్యక్షతన గల పాలకమండలి తీర్మానించింది. ఈ సత్రం నిర్మాణానికి రూ.11 కోట్లు వ్యయమవుతుందని ఇంజినీరింగ్‌ అధికారులు అంచనా వేశారు. దీన్ని 2012లో అప్పటి కమిషనర్‌ ఆమోదించగా, అప్పటి ఈఓ, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ ప్రసాదం వేంకటేశ్వర్లు సత్రం నిర్మాణానికి టెండర్లు పిలవకుండా తాత్సారం చేయడంతో నిర్మాణం జరగలేదు. ఆయన బదిలీ అనంతరం మరలా 138 గదుల సత్రం నిర్మాణానికి 2014లో పాలకమండలి రెండో సారి తీర్మానం చేసింది. అప్పుడు దీని అంచనా వ్యయం రూ.11 కోట్ల నుంచి రూ.14.5 కోట్లకు పెరిగింది. 2014లో దేవస్థానానికి వచ్చిన శృంగేరీ పీఠాధిపతి జగద్గురు శ్రీభారతీ తీర్థస్వామి ఈ సత్రం నిర్మాణానికి లాంఛనంగా కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.

గత నెలలో మళ్లీ తీర్మానం

భక్తుల వసతికి ఇబ్బందిగా ఉన్నందున 138 గదుల సత్రం నిర్మాణం అవసరమని భావించి మరలా గత నెలలో పాలక మండలిలో తీర్మానించారు. దీని నిర్మాణానికి ప్రస్తుత ధరల ప్రకారం రూ.16 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు.

వాస్తవంగా చూస్తే 2011లోనే దీని నిర్మాణం ప్రారంభిస్తే అప్పటి అంచనా వ్యయం ప్రకారం రూ.11 కోట్లకే పూర్తయి ఉండేది. మూడేళ్ల క్రితమే భక్తులకు అందుబాటులోకి వచ్చేది. దేవస్థానం అధికారుల అశ్రద్ధ, ఉన్నతాధికారుల అభ్యంతరాల కారణంగా దీని నిర్మాణ వ్యయం రూ.ఐదు కోట్లు పెరిగింది. అయినప్పటికీ ఉన్నతాధికారులు అనుమతించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

కొండ దిగువున సత్రం నిర్మాణానికి అనుమతి 

కొండ దిగువున జూనియర్‌ కళాశాల వెనుక గల 2.34 ఎకరాల ఈరంకి వారి స్థలంలో 110 గదులతో సత్రం నిర్మాణానికి కొన్ని మార్పులతో కమిషనర్‌ అనుమతి ఇచ్చారు. దీని నిర్మాణానికి రూ.13.25 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ఈ స్థలంలో ప్రస్తుతం నర్సరీ గార్డెన్‌ నిర్వహిస్తున్నారు. ఈ గార్డెన్‌ను తయారు చేయడానికి సుమారు రూ.20 లక్షలు ఖర్చుపెట్టి పంపా నుంచి మట్టి తెచ్చి ఎత్తు చేశారు. కొండ కింద సత్రాలకు భక్తుల ఆధరణ ఉండటం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కొండమీద బస చేయాలనుకునే భక్తులే ఎక్కువ. ఇప్పటికే కొండ దిగువున బస చేసేవారు లేక పంపా సత్రాన్ని ప్రైవేట్‌ వ్యక్తుల నిర్వహణకు ఇచ్చేశారు. సత్యగిరి సత్రంలో గదులు రద్దీ సమయంలో తప్ప పూర్తిగా నిండే పరిస్థితి లేదు. దీంతో కొండ దిగువున సత్రం కట్టడం పెద్దగా లాభదాయకం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పరిశీలించాకా అనుమతి ఇస్తామన్నారు 

సత్యగిరిపై నిర్మించే సత్రానికి కమిషనర్‌ ఇంకా అనుమతి ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాత అనుమతి ఇస్తామన్నారు. ముందు కొండ దిగువున ఈరంకి వారి స్థలంలో సత్రం కట్టేందుకు అనుమతి ఇచ్చారు. అది కూడా పాత ప్లాన్‌ మార్చమని చెప్పారు. ఆ ప్లాన్‌ మార్చేందుకు దేవస్థానం ఈఈని విజయవాడలోని దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయానికి పంపాం. - కె.నాగేశ్వరరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top