అంగన్‌వాడీలపై కత్తి!

అంగన్‌వాడీలపై కత్తి! - Sakshi


► హేతుబద్ధీకరణ ప్రక్రియ షురూ

► లబ్ధిదారులు 15 కంటే తక్కువగా ఉన్న కేంద్రాలకు ముప్పు

► సమీప కేంద్రాల్లో విలీనం దిశగా అడుగులు

► ఆ జాబితాలో 45 కేంద్రాలు




సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇప్పటివరకు ప్రభుత్వ స్కూళ్లకే హేతుబద్ధీకరణ చూశాం. ఇదే విధానాన్ని అంగన్‌వాడీ కేంద్రాలకూ వర్తింపజేస్తున్నారు. ఫలితంగా నిర్దేశిత సంఖ్యలో చిన్నారులు, బాలింతలు, గర్భిణులు నమోదుకాని అంగన్‌వాడీలను సమీపంలోని కేంద్రాల్లో విలీనం చేయనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 45 అంగన్‌వాడీ కేంద్రాలను హేతుబద్ధీకరణ గండం వెంటాడుతోంది. లబ్ధిదారులు 15మంది కంటే తక్కువగా నమోదైన కేంద్రాలను సమీపంలోని కేంద్రాలకు తరలిస్తారు. కనీసం 10మంది చిన్నారులు, మరో ఐదుగురు గర్భిణులు/బాలింతలు ఉంటే వాటిని కదిలించరు.


అయితే, ఒకే కేంద్రం ఉన్న ఊళ్లకు హేతుబద్ధీకరణ వర్తించదు. అక్కడ నిర్దేశిత సంఖ్య కన్నా లబ్ధిదారులు తక్కువగా ఉన్నా యథావిధిగా కొనసాగిస్తారు. అయితే జిల్లాలోని చాలా పల్లెల్లో ఒకటికి మించి కేంద్రాలు ఉన్నాయి. జనాభా అధికంగా ఉన్న గ్రామాల్లో నాలుగు అంగన్‌వాడీలనూ నెలకొల్పారు. ప్రస్తుతం ఇటువంటి ప్రాంతాల్లోని కేంద్రాలకే ముప్పు పొంచి ఉంది. ఏ కేంద్రమూ చిన్నారులతో కళకళలాడడం లేదు. పట్టుమని పదిమంది కూడా కేంద్రాల్లో నమోదు కావడం లేదని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ తరహా కేంద్రాలపై దృష్టి సారించి... హేతుబద్ధీకరణ అమలుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని జిల్లా సంక్షేమాధికారికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. జిల్లాలో 1,600 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి.


వీటి ద్వారా ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు అనుబంధ పోషకాహారం, వ్యాధినిరోధక టీకాలు, ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య అందుతోంది. గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద పౌష్టికాహారం అందజేస్తున్నారు. తద్వారా జిల్లాలో 1.56లక్షల మంది చిన్నారులు, 26,861 మంది గర్భిణీలు, బాలింతలు లబ్ధి పొందుతున్నారు. అయితే చాలా అంగన్‌వాడీ కేంద్రాల్లో వారి సందడి కనుమరుగైంది. రోజురోజుకీ కేంద్రాల్లో నమోదవుతున్న వారి సంఖ్య క్రమంగా పడిపోతోంది. జిల్లాలో 421 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. లబ్ధిదారులు ఈ కేంద్రాలకు వెళ్లకున్నా ప్రతినెలా ఈ కేంద్రాలకు అద్దె చెల్లించాల్సి వస్తోంది.


ఆశించిన లక్ష్యం నెరవేరకపోగా కేంద్రాల నిర్వహణ భారం తప్పడం లేదు. ఈ క్రమంలో స్పందన పెద్దగా లేని కేంద్రాల్లో కోత పెడితే .. కొంతైనా ప్రభుత్వంపై ఆర్థిక భారం తప్పుతుందని ఆలోచన చేస్తోంది. అంతేగాక జిల్లాలో ఆయా కేంద్రాలను అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల కొరత వేధిస్తోంది. ఈ జాబితాలో లబ్ధిదారుల సంఖ్య చాలా తక్కువగా ఉన్న కేంద్రాలూ ఉన్నాయి. ఇదే తరుణంలో ఖాళీ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం సంకేతాలు ఇస్తున్న విషయం తెలిసిందే.


ఇదే జరిగితే తక్కువ సంఖ్య ఉన్న కేంద్రాల్లోనూ నియామకాలు జరుగుతాయి. తద్వారా ప్రభుత్వానికి ఆర్థిక భారమే. అయితే భర్తీ ప్రక్రియ మొదలు కాకముందే లబ్ధిదారులు తక్కువగా ఉన్న అంగన్‌వాడీలను సమీపంలోని కేంద్రాల్లో విలీనం చేయాలన్న అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే ఖాళీల లెక్క తేల్చనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అవసరమైతే టీచర్ల బదిలీలు చేపట్టే అంశమూ వారి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.



మండల స్థాయి కమిటీలు..

లబ్ధిదారులు తక్కువగా ఉన్న కేంద్రాల వివరాలను న్యూట్రిషన్‌ అండ్‌ హెల్త్‌ ట్రాకింగ్‌ సిస్టం (ఎన్‌హెచ్‌టీఎస్‌) ద్వారా సేకరించారు. గతేడాది డిసెంబర్‌ నుంచి గతనెల వరకు హాజరు వివరాలను పరిగణనలోకి తీసుకుని 15 మందికి తక్కువగా నమోదవుతున్న అంగన్‌వాడీల జాబితాను సిద్ధం చేశారు.


లబ్ధిదారుల సంఖ్య తక్కువగా ఉన్న కేంద్రాలను సమీపంలోని అంగన్‌వాడీల్లో విలీనం చేసే బాధ్యతలను మండల స్థాయి అంగన్‌వాడీ కేంద్రాల పునర్‌వ్యవస్థీకరణ కమిటీకి అప్పగించారు. ఈ కమిటీకి ఎంపీడీఓ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. స్థానిక ఎంఈఓ, సీడీపీఓ, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ సభ్యులుగా ఉంటారు. ఈ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి.. హేతుబద్ధీకరణ సాధ్యాసాధ్యాలపై పరిశీలించి నివేదిక సిద్ధం చేస్తుంది. ఈ ప్రక్రియ వారం రోజుల్లోగా పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని అధికారులు నిర్దేశించుకున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top