నేల పాలు

నేల పాలు - Sakshi


అంగన్‌వాడీ కేంద్రాల్లో పారబోస్తున్న వైనం

సరైన పద్ధతులలో నిల్వ చేయకపోవడమే కారణం

త్వరలో అవగాహన కల్పిస్తామని చెబుతున్న అధికారులు




పులివెందుల రూరల్‌ : జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న విజయ వజ్ర ప్లస్‌ పాలలో నాణ్యత, అధిక పోషకాలు ఉండటంతో పాటు పిల్లలకు, గర్భిణీలు, బాలింతలకు ఏపీ డైయిరీ ఆధ్వర్యంలో అందిస్తున్నారు. అయితే పాలను సక్రమంగా నిల్వ చేయకపోవడంతో ప్యాకెట్లు ఉబ్బిపోవడం, దుర్వాసన రావడంతో కొన్ని కేంద్రాల్లో రోడ్లపై పారబోస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఐసీడీఎస్‌ పరిధిలో 15 ప్రాజెక్టుల పరిధిలో 3,621 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటికి ప్రతినెల 2.10లక్షల లీటర్లను ఏపీ డైయిరీ ఆధ్వర్యంలో సరఫరా చేస్తున్నారు.



అయితే ఇటీవల కాలంలో పులివెందుల ఐసీడీఎస్‌ పరిధిలోని పలు కేంద్రాల్లో పాల ప్యాకేట్లు ఉబ్బిపోవడం, దుర్వాసన రావడంతో వాటిని లబ్ధిదారులకు అందించలేదు. పాలు 90రోజులపాటు నిల్వ ఉండే అవకాశం ఉన్నప్పటికీ ప్యాకింగ్‌ సక్రమంగా జరగపోవడంతో పాలు లీకయ్యి బ్యాక్టీరియా ప్యాప్తి చెంది దుర్వాసన వస్తున్నాయని అంగన్‌వాడీ కార్యకర్తలు చెబుతున్నారు. ఈ పాలలో అధిక పోషకాలు ఉన్నప్పటికీ దుర్వాసనతో లబ్ధిదారులకు ఇవ్వలేకపోతున్నామని సిబ్బంది చెబుతున్నారు. అయితే కొంతమంది కార్యకర్తలు పాల ప్యాకెట్లపై బరువుపెట్టడం, బియ్యం, పప్పు, ఇతర వంటసామగ్రి వద్ద పెట్టడంతో చెడిపోతున్నాయని ఏపీ డైయిరీ అధికారులు చెబుతున్నారు.



ప్రాజెక్టు పరిధిలో 515 లీటర్లు వెనక్కు పంపాం

పులివెందుల ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో 515 లీటర్లు చెడిపోయినట్లు గుర్తించడంతో వెనక్కు పంపాం. గతంలో ఎన్నడూ ఇన్ని లీటర్లు చెడిపోలేదు. ప్యాకింగ్‌ సరిగ్గా లేని కారణంగా చెడిపోయినట్లు తెలిసింది. ఏపీ డైయిరీ అధికారులకు తెలియజేయగా తిరిగి సరఫరా చేస్తామన్నారు. –రమాదేవి, సీడీపీఓ–పులివెందుల



త్వరలో కార్యకర్తలకు అవగాహన సదస్సులు

విజయ వజ్ర ఫ్లస్‌ పాలు నిల్వ చేయడంపై జిల్లావ్యాప్తంగా అవగహన సదస్సులు పెట్టనున్నాం. పాలు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చినప్పుడు కార్యకర్తలు పరిశీలించి మంచివి మాత్రమే తీసుకోవాలి. పాల ప్యాకెట్లను గాలి, వెలుతురు ఉండే ప్రదేశంలో నిల్వచేయాలి. పాల ప్యాకెట్లు నుంచి పాలు కారుతున్నా, ఉబ్బినట్లు అయితే 48 గంటలలో డెయిరీ అధికారులకు గానీ, కాంట్రాక్టర్‌కుగాని సమాచారం ఇవ్వాలి. వారు స్పందించని పక్షంలో అధికారి సమక్షంలో పాలను పారబోసి రికార్డు చేయాలి. చెడిపోయిన పాలకు బదులు తిరిగి కాంట్రాక్టర్‌ వద్ద నుంచి పొందాలి.

–శ్రీనివాసులు, ఏపీ డైయిరీ డెవలప్‌మెంటు కార్పొరేషన్‌ ఆఫ్‌ ఫెడరేషన్‌(ఏపీడీడీసీఎఫ్‌) జిల్లా డిప్యూటీ డైరెక్టర్, కడప.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top