ఏపీలో మూడు స్మార్ట్ నగరాలు ఇవే..!

ఏపీలో మూడు స్మార్ట్ నగరాలు ఇవే..!

  • కేంద్రానికి అందిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు

  • గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, కరీంనగర్‌లను ప్రతిపాదించిన తెలంగాణ ప్రభుత్వం

  • సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి నగరాలను స్మార్ట్ నగరాలుగా అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర పట్టణాభివృద్ధిశాఖకి ప్రతిపాదనలు పంపింది. స్మార్ట్ సిటీస్ మిషన్‌లో భాగంగా 100 నగరాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం తొలివిడతలో 20 నగరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు కోరింది. ఇందుకు జూలై 31ని గడువుగా నిర్ధారించింది. మూడు అంచెల్లో ఈ స్మార్ట్ సిటీలను ఎంపిక చేయనున్నారు. తొలివిడతలో తమకు కేటాయించిన స్మార్ట్ నగరాల సంఖ్యకు అనుగుణంగా రాష్ట్రాలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తాయి.

     

    రెండో అంచెలో కేంద్రం రాష్ట్రాల నుంచి వచ్చిన స్మార్ట్ నగరాల ప్రతిపాదనలను పరిశీలించి మిగిలిన నగరాలతో పోల్చి చూస్తాయి. మూడో అంచెలో తుది జాబితాను ప్రకటించి నిధులు సమకూరుస్తాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు కేటాయించిన నగరాల సంఖ్య(3)కు అనుగుణంగా వైజాగ్, కాకినాడ, తిరుపతి నగరాలను స్మార్ట్ సిటీ  మిషన్‌కు ప్రతిపాదించింది. తెలంగాణకు కేటాయించిన నగరాల సంఖ్య 2. కాగా స్మార్ట్ సిటీ మిషన్ కింద గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, కరీంనగర్  మున్సిపల్ కార్పొరేషన్లను ఎంపిక చేయాలని కేంద్రానికి శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top