తమ్ముళ్లు సృష్టించిన..‘చినబాబు కాలనీ’

తమ్ముళ్లు సృష్టించిన..‘చినబాబు కాలనీ’ - Sakshi


టీడీపీ నేతల భూదందా

పేదల పేరుతో 3.80 ఎకరాల పాలిటెక్నిక్ స్థలం ఆక్రమణ

మొదట్లో గుడిసెలు వేసేలా పేదలకు దన్ను

రెండేళ్ల అనంతరం సగం మంది ఖాళీ

స్థలం పరిరక్షణలో అధికారులు విఫలం


 

అధికారముంది. ఏమి చేసినా అడిగేవారు లేరు. అధికారులు కూడా జీహుజూర్ అంటున్నారు. ఇక వారికి అడ్డూఅదుపు ఏముంటుంది. అందుకే రెచ్చిపోతున్నారు. దందాలు, దౌర్జన్యాలే కాదు.. ఖాళీ స్థలం కన్పిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. అది ప్రభుత్వ స్థలమైనా, ప్రైవేటుదైనా వారికి పనిలేదు. పాగా వేయడం, అందినకాడికి దండుకోవడమే ముఖ్యం. ఈ క్రమంలోనే  3.80 ఎకరాల  ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (అనంతపురం) స్థలాన్ని కైంకర్యం చేసుకున్నారు. ఇళ్లు కూడా కట్టించేశారు. దానికి ముద్దుగా నారా లోకేష్‌బాబు కాలనీగా నామకరణం చేశారు. అంతటితో ఆగలేదు. టీడీపీ కార్యాలయాన్నీ ఏర్పాటు చేసి..ఇది తమ అడ్డా అని చెప్పకనే చెబుతున్నారు.

 

అనంతపురం: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన  3.80 ఎకరాల్లో యథేచ్ఛగా ఆక్రమణలు వెలిశాయి. ఇందులో గృహాలు నిర్మించుకున్నది నిరుపేదలు కాదు. ఇద్దరు టీడీపీ నాయకులు వ్యూహాత్మకంగా ప్రభుత్వ స్థలాన్ని కొట్టేశారు. మొదట పేదలతో గుడిసెలు వేయించారు. వారితో నెలనెలా మామూళ్లు కూడా వసూలు చేశారు. ఆనక వారిలో సగం మందిని దౌర్జన్యంగా ఖాళీ చేయించారు. ఇప్పుడు తక్కిన వారిని ఖాళీ చేయించే పనిలో ముమ్మరంగా నిమగ్నమయ్యారు. ఇక్కడ ఎకరా కనీసం రూ.6 కోట్లు విలువ చేస్తుంది. ఈ లెక్కన  3.80 ఎకరాల విలువ రూ.22.80 కోట్లు. చంద్రబాబుకు వీర విధేయులమని చెప్పుకుంటూ ఆక్రమణకు గురైన కాలనీకి నారాలోకేష్‌బాబు పేరు పెట్టారు.

 ఊసరవెళ్లిలా మార్చేస్తున్నారు..



 2014లో గుడిసెలు వేసినప్పటి నుంచి ఈ కాలనీకి పెడుతున్న పేర్లు ఆశ్చర్యాన్ని కల్గిస్తున్నాయి. మొదట్లో ప్రజాపార్టీ కాలనీ , తరువాత రఘవీరా రెడ్డి కాలనీ, శైలూ కాలనీ, తాజాగా నారా లోకేష్‌బాబు కాలనీగా నామకరణం చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన అగ్రనాయకుడి  పేరు పెట్టుకొంటూ పబ్బం గడుపుతున్నట్లు రూఢీ అవుతోంది. ఇదో దందాఇద్దరు టీడీపీ నాయకులు పట్టాలిప్పిస్తామని అమాయక ప్రజల్ని నమ్మించారు. వారి నుంచి ప్రతి నెలా కోర్టు ఖర్చుల పేరుతో డబ్బు వసూలు చేశారు. ఇలా రెండేళ్ల పాటు లక్షలాది రూపాయలు దండుకున్నారు.  ఇళ్లపట్టాలు అదిగో ఇదిగో అంటూ ఊరించారు. చివరకు మొండిచేయి చూపారు. ప్రస్తుతం కాలనీలో 128 ఇళ్లు వెలిశాయి. టీడీపీ  కార్యాలయాన్ని కూడా పేదల చందాలతో నిర్మించినట్లు తెలుస్తోంది. దౌర్జన్యంగా కొంత మందిని అక్కడి నుంచి ఖాళీ చేయించి తమ వారికి కట్టబెట్టారు. వారి వ్యవహారంపై జనవరి 7, 2014లో అనంతపురం ఆర్డీఓకు బాధితులు ఫిర్యాదు చేశారు.

 

లేఖలతోనే సరి


 ప్రభుత్వ పాలిటెక్నిక్ స్థలంలో ఆక్రమణలను తక్షణమే తొలగించాలని హైకోర్టు గతేడాది తీర్పునిచ్చింది. అప్పటి నుంచి జిల్లా ఉన్నతాధికారులు మొదలు పంచాయతీ కార్యదర్శి వరకు  పరస్పరం లేఖలు రాసుకోవడం తప్ప చేసిందేమీ లేదు. అనంతపురం రూరల్ సర్పంచ్, పంచాయతీ సభ్యులు గ్రీవెన్స్‌లో నేరుగా జిల్లా ఉన్నతాధికారులకు అనేకసార్లు వినతులు అందజేశారు.  అయినా ఫలితం లేదు.  క్షేత్రస్థాయి అధికారులు భూ ఆక్రమణ గురించి ఉన్నతాధికారులకు సమాచారం మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు.  ఆక్రమణకు గురైన కాలనీకి  కరెంట్, నీరు సరఫరా చేయరాదని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ విస్మరించడం కొసమెరుపు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top