పదేళ్లలో అమరావతిలో అద్భుత కట్టడాల నిర్మాణం

పదేళ్లలో అమరావతిలో అద్భుత కట్టడాల నిర్మాణం - Sakshi


యాక్సిస్ రోడ్డు శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు

 

తుళ్లూరు రూరల్: యాక్సిస్ రోడ్డు నిర్మాణాన్ని నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. శనివారం మండలంలోని వెంకటపాలెం నుంచి బోరుపాలెం వరకు 18కి.మీ మేర ఆరు లైన్ల యా క్సిస్ రోడ్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న పదేళ్లలో అమరావతిలో అద్భుతమైన కట్టడాలు నిర్మితమవుతాయని, ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయని తెలిపారు. రోడ్ల నిర్మాణాలను స్థానిక ప్రజా ప్రతినిధులు పర్యవేక్షించాలన్నారు. అనంతరం రాజధానిలో రోడ్ల నిర్మాణ చిత్రపటాల నమూనాలను పరిశీలించారు. ఆయన వెంట మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పార్టీ చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి ఇతర మంత్రులు ఉన్నారు.





అన్న క్యాంటీన్‌లతో పేదలకు ప్రయోజనం

తుళ్లూరు: తాత్కాలిక సచివాలయ సమీపంలో శనివారం సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ అన్న క్యాం టీన్‌ను ప్రారంభించారు. ఈ క్యాంటీన్లతో పేదలకు ప్రయోజనమన్నారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, పరిటాల సునీత, ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్, కలెక్టర్ కాంతిలాల్ దండే, జేసీ శ్రీధర్ అన్న క్యాంటీన్లో అల్పాహారం తీసుకున్నారు. అనంతరం తాత్కాలిక సచివాలయంలో ఐదో బ్లాకు నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల జాప్యానికి గల కారణాలను ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ నరేంద్రబాబు, మందడం సర్పంచ్ ముప్పవరపు పద్మావతి తదితరులు ఉన్నారు.

 

ప్రాంతాలవారీగా అన్నా క్యాంటీన్‌లు : మంత్రి సునీత

రాష్ట్రంలో ప్రాంతాలవారీగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి సునీత తెలిపారు. అన్న క్యాంటీన్ ప్రారంభం తర్వాత ఆమె విలేకర్లతో మాట్లాడారు. నెలాఖరుకు తుళ్లూరు, యర్రబాలెంలోనూ అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు. తమిళనాడులో క్యాంటీన్ల నిర్వహణను పరిశీలించి ఇక్కడా మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు టిఫిన్, మధ్యాహ్నం 11.30 నుంచి 2గంటల వరకు భోజనం ఉంటుందని మంత్రి వెల్లడించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ సేవలు బాగున్నాయని కితాబిచ్చారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top