గర్భిణులకు ఆసరా.. అమ్మఒడి

గర్భిణులకు ఆసరా.. అమ్మఒడి - Sakshi


► మాతాశిశు మరణాలను తగ్గించడమే లక్ష్యం

► జూన్‌ 2 నుంచి అమలు

► గర్భిణులకు విడతల వారీగా రూ.12వేల ప్రోత్సాహకం

► ఆడపిల్ల జన్మిస్తే అదనంగా రూ.వెయ్యి

► కేసీఆర్‌ కిట్‌ పంపిణీ




ఆదిలాబాద్‌టౌన్‌/నేరడిగొండ(బోథ్‌): మాతాశిశు మరణాలను తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టింది.ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్‌ 2 నుంచి అమలు చేయనుంది. ఇందుకు సంబంధించి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గర్భిణుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసేందుకు ఏఎన్‌ఎంలకు ట్యాబ్‌లు అందజేశారు. ఈ పథకం అమలులోకి వస్తే జిల్లాలోని ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లో ఇంటి వద్ద ప్రసవాల సంఖ్య తగ్గి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సుఖ ప్రసవాలు జరగనున్నాయి. దీంతో మాతా, నవజాత శిశువుల మరణాల రేటును కూడా తగ్గించవచ్చని   ప్రభుత్వం భావిస్తోంది.



జిల్లాలో..

ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉట్నూర్, బోథ్‌ కమ్యూనిటీ ఆస్పత్రులు, 129 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 6,865 మంది గర్భిణులు ఉన్నారు. పీహెచ్‌సీ వైద్యాధికారులు ఇప్పటివరకు 4,871 మంది వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇంకా 1994 గర్భిణుల వివరాలు నమోదు చేయాల్సి ఉంది. ఈ నెల 15 వరకు వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో రిమ్స్‌ ఆస్పత్రితోపాటు బోథ్, ఉట్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరుగుతుండగా, ఆయా పీహెచ్‌సీల్లో వేళ్ల మీద లెక్క పెట్టేవిధంగా యేడాదిలో పదుల సంఖ్యలోనే ప్రసవాలు జరుగుతున్నాయి.


చాలామంది ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న కొంతమంది ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు సిజరిన్‌ చేస్తూ వేల రూపాయలు దండుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. సాధారణ కాన్పుల సంఖ్య ఒకటి రెండు అయితే మరీ ఎక్కువే. వీటిని నివారించేందుకు ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశ పెట్టింది. కాగా 2016 ఏప్రిల్‌ నుంచి 2017 మార్చి వరకు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 6652 మంది సిజరిన్, 2242 సాధారణ కాన్పులు జరిగాయి. అదే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చూస్తే దాదాపు 15 వేలకు పైగా సిజరిన్‌ కాన్పులు జరిగినట్లు తెలుస్తోంది. వందలోపు కూడా సాధారణ కాన్పులు జరగలేదు.



అర్హులు వీరే..

అమ్మ ఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే గర్భం దాల్చిన 12 వారాల్లోపు ఆరోగ్య కార్యకర్త వద్ద తప్పకుండా పేరు నమోదు చేసుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు జరగాలి. పుట్టిన బిడ్డకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇచ్చే ఇమ్యూనైజేషన్‌ టీకాలు వేయించాలి. అదేవిధంగా మొదటి, రెండు కాన్పులకు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు డబ్బులను అందజేస్తారు.



నాలుగు విడతల్లో డబ్బులు అందజేత..

గర్భిణి పేరు నమోదు, వైద్య పరీక్షలు చేయించుకుని గర్భం దాల్చిన మూడు నెలల వరకు మొదటి విడతగా రూ.4వేలు అకౌంట్‌లో జమ చేస్తారు. ఆ తర్వాత ఆరు నెలల తర్వాత రూ.4వేలు, ప్రసవం తర్వాత రూ.2వేలు, ఆడపిల్ల జన్మిస్తే అదనంగా రూ.వెయ్యి, పుట్టిన బిడ్డ ఇమ్యూనైజేషన్‌ పూర్తయిన(సంవత్సరం) తర్వాత రూ.2వేలు అకౌంట్‌లో జమ చేయనున్నారు.



బాలింత, శిశువుకు కేసీఆర్‌ కిట్‌..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవమైన బాలింత, పుట్టిన బిడ్డకు కేసీఆర్‌ కిట్‌ను అందజేస్తారు. ఇందులో 12 రకాల వస్తువులను ఇవ్వనున్నారు. ఇందులో బాలింతకు రెండు చీరలు, పుట్టిన బిడ్డకు బేబీ ఆయిల్, బేబీ పౌడర్, చేతికి, కాళ్లకు గ్లౌజులు, దోమతెర, బెడ్‌షీట్, స్నానానికి ఉపయోగించే సబ్బులు, దుస్తులు, తదితర వస్తువులు ఉంటాయి.



నమోదు ఇలా..

ఏఎన్‌ఎంలు తమ పరిధిలోని గ్రామాల్లోని గర్భిణులను మొదటి నెల నుంచే గుర్తిస్తారు. వారి వివరాలను ట్యాబ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. గర్భిణుల ఊరు, పేరు, వయస్సు, మొదటి, రెండో గర్భం వివరాలు, బ్యాంక్‌ ఖాతా, ఆధార్‌ నంబర్, అనారోగ్య సమస్యలు ఉంటే అందులో నమోదు చేస్తారు. నెలవారీ టీకాల వివరాలను పొందుపర్చుతారు. గర్భిణులు టీకాలు వేయించుకున్నారో లేదో ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు. వేయించుకోని వారిని గుర్తించి టీకాలు వేసేలా చూస్తారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top