'స్వార్థ రాజకీయాల కోసం పార్టీని అమ్ముకున్నాడు'

'స్వార్థ రాజకీయాల కోసం పార్టీని అమ్ముకున్నాడు' - Sakshi


గుంటూరు: ఇసుక మాఫియా, పట్టిసీమ అంశాల్లో జరిగిన అవినీతి బట్టబయలు చేస్తున్నారు కాబట్టే, సాక్షి దినపత్రికపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విరుచుకుపడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇసుక పాలసీకి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేసిన క్రమంలో చంద్రబాబు సాక్షిపై చేసిన వ్యాఖ్యలపై అంబటి తీవ్రంగా స్పందించారు. గుంటూరులో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లే పత్రికలపై చంద్రబాబు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు.


చంద్రబాబు పత్రికలపై అసహనం ప్రదర్శిస్తున్నారని అంబటి విమర్శించారు. అనేక అవినీతి కార్యక్రమాలకు నాంది పలికిన చంద్రబాబు.. వాటిని ఎండగడుతున్నందునే పత్రికలపై మండిపడుతున్నారన్నారు. కేవలం తమకు వ్యతిరేకంగా వ్యవహరించారనే చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు ఒక చానల్‌ను సంవత్సరంపాటు నిలిపివేసిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ఒక పత్రిక చదవండి, మరో పత్రికను చదవొద్దని చెప్పడం బాధాకరమని, ఏ పత్రిక చదవాలో, ఏదీ చదవకూడదోనన్న పరిజ్ఞానం ప్రజలకు ఉందన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి, అక్రమాలు బట్టబయలు చేస్తుంటే ఓర్వలేక, తన బండారం బయట పడుతుందనే ఉద్దేశంతో సాక్షిపై చంద్రబాబు వ్యాఖ్యలు చేశారనే విషయం ప్రజలకు తెలుసన్నారు. పత్రికల్లో వచ్చిన విషయాలు వాస్తవాలో కాదో చెప్పాల్పిందిపోయి పత్రికలు చదవొద్దని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.


ఓటుకు నోటు వ్యవహారంలో టీవీ చానళ్లలో సుస్పష్టంగా విన్పించిన కంఠం మీదా కాదా చంద్రబాబూ.. అని అంబటి సూటిగా ప్రశ్నించారు. కేవలం స్వార్ధ రాజకీయాల కోసం తెలంగాణలో సొంత తెలుగుదేశం పార్టీనే అమ్ముకున్నారని, బీజేపీ కాళ్ల వద్ద పార్టీని తాకట్టు పెట్టారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అవాకులు చివాకులు పేలితే సహించబోమని ఆయన హెచ్చరించారు. చంద్రబాబులా పార్టీని అమ్ముకుని, తాకట్టుపెట్టే నైజం తమ పార్టీది కాదన్న అంబటి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజాసమస్యల పరిష్కారానికే పాటుపడతామని స్పష్టం చేశారు. చంద్రబాబు నీతి వ్యాఖ్యలు చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అంబటి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పత్రికలే కాకుండా.. రాజకీయ పార్టీలు సహించబోవన్నారు.













 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top