బాబు హయాంలో ఉత్తరాంధ్రకు అన్యాయం

బాబు హయాంలో ఉత్తరాంధ్రకు అన్యాయం - Sakshi


వైఎస్‌ పాలనలో అభివృద్ధి

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు




విశాఖపట్నం : ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం జరుగుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. గడచిన మూడేళ్లలో విశాఖతో పాటు ఈ ప్రాంత అభివృద్ధిపై ఆయన దృష్టి సారించడం లేదన్నారు. సోమవారం వీజేఎఫ్‌ నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మునుపటి మాదిరిగానే చంద్రబాబు అభివృద్ధినంతటినీ రాజధాని ప్రాంతంలోనే కేంద్రీకరిస్తున్నారన్నారు.



దీనివల్ల భవిష్యత్‌లో ప్రమాద ఘంటికలు మోగుతాయన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అయినా ముఖ్యమంత్రి వైఖరిలో మార్పు రాకపోవడం శోచనీయమని చెప్పారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనతో విశాఖతో పాటు ఉత్తరాంధ్ర ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్‌కు ధీటైన నగరంగా విశాఖకు పునాది వేశారన్నారు. విశాఖలో సత్యం, విప్రో వంటి సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ కంపెనీలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రాజధానికి అవసరమైన అన్ని హంగులూ, వనరులూ విశాఖకు ఉన్నాయని, ఇక్కడ ప్రజలు శాంతి కాముకులని కొనియాడారు.



ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌ ఇవ్వాల్సిందే..

రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విశాఖకు రైల్వే జోన్‌ ఇచ్చి తీరాలన్నారు. ఇప్పటికే తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేశారని, రైల్వే జోన్‌ కోసం పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ గత ఏడాది అమరణ నిరాహారదీక్ష, ఇటీవల ఆత్మగౌరవయాత్ర పేరిట పాదయాత్రతో పాటు పార్టీ నాయకులు ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నారని గుర్తు చేశారు. రైల్వే జోన్‌ ఏర్పాటుపై రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందో అర్థం కావడం లేదన్నారు. జోన్‌పై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. విశాఖకు రైల్వే జోన్‌ వచ్చే వరకూ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈవీఎంలపై తమ పార్టీకి నమ్మకం ఉందని అంబటి చెప్పారు.



ఓడిపోయిన వారు ఓటమిని అంగీకరించకుండా నెపాన్ని ఈవీఎంలపైకి నెట్టేయడం రివాజుగా మారిందన్నారు. ఈవీఎంల నుంచి స్లిప్‌లు తీసుకునే విధానం మంచిదేనని అభిప్రాయపడ్డారు. మీట్‌ ది ప్రెస్‌లో మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. కార్యక్రమంలో వీజేఎఫ్‌ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి సోడిశెట్టి దుర్గారావు, సంయుక్త కార్యదర్శి దాడి రవి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, నాయకులు తుళ్లి చంద్రశేఖర్‌ యాదవ్, మూర్తి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top