అమరావతికి వరల్డ్ బ్యాంకు అప్పు


హైదరాబాద్: ఏపీ నూతన రాజధాని అమరావతికి ప్రపంచబ్యాంకు రూ.3,324 కోట్ల రుణం మంజూరు చేయనుంది. అమరావతిలో రహదారులు, వరద నియంత్రణ, నేలపాడు గ్రామంలో వసతుల కోసం ప్రపంచబ్యాంకు రూ.3,324 కోట్ల రుణం ఇవ్వనుంది. ప్రాజెక్టు లక్ష్యాలకు ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది. 65 కిలోమీటర్ల మేర సబ్-ఆర్టీరియల్ రోడ్ల నిర్మాణం, వరద నియంత్రణ పనులు, నేలపాడు గ్రామంలో మౌలిక వసతుల స్థాయి పెంపునకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో కలిపి మొత్తం రూ.4,749 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. ఇందులో ప్రపంచ బ్యాంకు రూ.3,324 కోట్లను రుణంగా సమకూర్చుతుంది. మిగతా 1,425 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది.



వచ్చే ఏడాది మార్చి నుంచి నిధులను ప్రపంచ బ్యాంకు మంజూరు చేయనుంది. ప్రాజెక్టును 2019 కల్లా పూర్తిచేయాలని నిర్ధారించారు. ప్రపంచ బ్యాంకు రుణానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం ఆమోదం కూడా తెలిపింది. ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు కేంద్రానికి, అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను బడ్జెట్‌లో కేటాయించనున్నారు. అక్కడి నుంచి సీఆర్‌డీఏకు విడుదల చేస్తారు. సీఆర్‌డీఏ ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా వ్యక్తిగత ఖాతాలో ఆ నిధులను ఉంచుతుంది. ఆ ఖాతా నుంచి కన్సల్టెంట్లు, సిబ్బంది జీత భత్యాలకు అవసరమైన నిధులను విడుదల చేయనున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top