ప్రత్యామ్నాయ ప్రణాళిక


నర్సీపట్నం, న్యూస్‌లైన్ : వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యవసాయశాఖ ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించింది. ఖరీఫ్ సాగు విస్తీర్ణం పది శాతానికి మించకపోవడంతో ప్రత్యే క ఏర్పాట్లులో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ఏడాది జిల్లాలో 2.12 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానం గా వరి 92,885 హెక్టార్లలో సాగుచేయాలని నిర్ణయించారు.



వరుణుడు కరుణించకపోవడంతో ఇంతవరకు కేవ లం 12వేల హెక్టార్లలో మాత్రమే వరి నాట్లు పడ్డాయి. అదీ ఏజెన్సీలోనే. ఇక్కడి 11 మండలాల్లో మాత్రమే వర్షాలు అనుకూలించాయి. మైదానంలో పరిస్థితి దయనీయంగా ఉంది. నారుమళ్లు ఎండిపోతున్నాయి. వాస్తవంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు జిల్లాలో 450 మిల్లీమీటర్ల వర్షపాతం పడాలి. ఇంతవరకు 225 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయింది. సాధారణ వర్షపాతంలో కేవలం సగం మాత్రమే కురిసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 80వేల హెక్టార్లలో వరినాట్లు కోసం పోసిన నారుమళ్లు ప్రస్తుతం ఎండిపోతున్నాయి. ఈ సమయానికి ఉబా పనుల్లో రైతులు బిజీగా ఉండాలి.



వరి నాట్లు వేయాలి. కానీ ప్రతికూల పరిస్థితుల కారణంగా రైతులు ముందడుగు వేయలేకపోతున్నారు. మరికొన్ని రోజులు గడిస్తే నారుమళ్లు సైతం పనికిరాకుండా పోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. రానున్న రోజుల్లో అడపా దడపా వర్షాలు కురిసినా ఎద పద్ధతిలో వరి స్వల్పకాలిక రకాల సాగుకు ప్రణాళిక రూపొందించారు.



మెట్టభూముల్లో మొక్కజొన్న, చోడి, అపరాలు, జొన్న పంటలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో వరి ఎంటీయూ-1010, 1001, పుష్కల, వసుంధర రకాలు 2,610 క్వింటాళ్లు, మొక్కజొన్న-173, చోడి -177, అపరాలు-3,600, జొన్న- 7 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేశారు. వీటిని సకాలంలో రైతులకు పంపిణీకి అనుకూలంగా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. వ్యవసాయాధికారుల ప్రత్యేక ప్రణాళిక కార్యరూపం దాల్చాలంటే ఎంతోకొంత వర్షం అనుకూలిస్తేనే సాధ్యమవుతుంది.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top