అన్ని స్థానాల్లో పోటీ చేద్దాం!

అన్ని స్థానాల్లో పోటీ చేద్దాం! - Sakshi


సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో జరుగనున్న శాసన మండలి ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. తొమ్మిది జిల్లాల పరిధిలో 12 ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. కొద్దినెలలుగా ఈ పదవుల కోసం పడిగాపులుగాస్తున్న టీఆర్‌ఎస్ నేతలంతా అవకాశం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఆయా పార్టీల చేతిలో ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సంఖ్యను బట్టే ఈ ఎన్నికల్లో గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. దీంతో ఆయా జిల్లాల్లో విజయానికి కావాల్సిన ఓట్ల సంఖ్య, తమ పార్టీ చేతిలో ఉన్న ఓట్ల సంఖ్యపై అవగాహన ఉన్న గులాబీ నేతలు పోటీకి సిద్ధమవుతున్నారు. వరంగల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానాలకు మాత్రమే అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉందంటున్నారు. టీఆర్‌ఎస్‌కు ఓట్ల సంఖ్య తక్కువగా ఉన్న చోట ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో అవగాహన కుదుర్చుకుని ముందుకు వెళ్లే దిశగా ఆ పార్టీల నేతల మధ్య మంతనాలు నడిచాయన్న ప్రచారం జరిగింది. కానీ అధికార పార్టీగా ఉన్న తమకు ఏ పార్టీతోనూ అవగాహన పెట్టుకోవాల్సిన అవసరం లేదని, ఒంటరిగానే అన్ని స్థానాల్లో పోటీ చేద్దామనే అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.



 ‘అవగాహన’పై అయోమయం

 రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మూడు స్థానాలు కోరారని.. రెండు స్థానాలు ఇవ్వడానికి టీఆర్‌ఎస్ నేతలు సూత్రప్రాయంగా అంగీకరించారని అంటున్నారు. కానీ టీఆర్‌ఎస్ నాయకులు పలువురు ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. అసలు అధినేత మదిలో ఏముందో తెలియని ఈ నేతలు కాంగ్రెస్‌తో అవగాహన కుదుర్చుకుంటారా అని పేర్కొంటున్నారు. అయితే ఇప్పటికే జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు తమ చేతిలో ఉన్నాయో పరిశీలన జరిపిన టీఆర్‌ఎస్ అధినాయకత్వం... అన్ని చోట్లా పోటీ చేద్దామన్న సంకేతాన్ని ఇచ్చిందని చెబుతున్నారు. ఈ కారణంగానే ఆయా జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ముందస్తు కసరత్తులో భాగంగా సన్నాహక సమావేశాలు కూడా మొదలయ్యాయి. డిసెంబర్ 9వ తేదీ దాకా నామినేషన్ల దాఖలుకు గడువు ఉండడంతో... ఆలోగా రాజకీయ సమీకరణాలు మారి రెండు మూడు స్థానాల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వస్తే పరిస్థితి ఏమిటన్న చర్చ కూడా జరుగుతోంది.



 ‘వలస’దారుల ఆగ్రహం..

 స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన పార్టీని వదిలి టీఆర్‌ఎస్‌కు వలస వచ్చిన ప్రజాప్రతినిధులు మాత్రం ‘అవగాహన’ ప్రచారంపై మండిపడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఉన్న రెండు స్థానాల్లో ఒకటి, మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు స్థానాల్లో ఒకటి కాంగ్రెస్‌కు ఇస్తారన్న ప్రచారం జరుగుతుండ డంతో వారిలో ఆందోళన మొదలైంది. నల్లగొండ స్థానాన్ని కూడా కాంగ్రెస్ గట్టిగా కోరుతుందని అంటున్నారు. ‘కాంగ్రెస్‌ను కాదనుకునే టీఆర్‌ఎస్‌లోకి వచ్చాం. ఇప్పుడు తిరిగి అదే పార్టీతో అవగాహనకు పోతే మా పరిస్థితి ఏం కావాలి, ఇక మేం పార్టీ మారి ఏం లాభం? సీట్ల పంపకం జోలికే వెళ్లొద్దని జిల్లా నాయకత్వాలకు చెబుతున్నాం..’ అని కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్ గూటికి చేరిన ఒక ప్రజాప్రతినిధి పేర్కొన్నారు. ఇక ఎలాంటి అవగాహన ఉండదని కాంగ్రెస్ నేతలు ప్రకటన చేసినా... టీఆర్‌ఎస్ నాయకత్వం నుంచి మాత్రం అటువంటి ప్రకటనేదీ వెలువడలేదు. దీంతో కొంత అయోమయం నెలకొంది. విశ్వసనీయ వర్గాలు మాత్రం అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ పోటీ చేస్తుందనే చెబుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top