వర్షాకాలంలో రైల్వే అలర్ట్‌!

వర్షాకాలంలో రైల్వే అలర్ట్‌! - Sakshi

సాక్షి, విశాఖపట్నం: వర్షాకాలంలో రైలు ప్రమాదాలు జరగకుండా రైల్వే శాఖ అప్రమత్తమవుతోంది. నైరుతి రుతుపవనాల సీజనులో కురిసే భారీ వర్షాల వల్ల తలెత్తబోయే పరిణామాలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. రైల్వే పట్టాలకు చేరువలో ఉన్న కాలువలు, చెరువులు, రిజర్వాయర్లపై దష్టి సారించాలని రైల్వే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర నీటిపారుదలశాఖ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని, ఎప్పటికప్పుడు వర్షాల వేళ పరిస్థితులను సమీక్షించుకోవాలని సూచించింది. గతంలో వర్షాలు, వరదలకు పట్టాలు దెబ్బతిన్న ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొంది. అలాంటి పరిస్థితులు పునరావతం కాకుండా చర్యలు చేపట్టాలని, ఆయా ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.



అసాధారణ వర్షపాతం నమోదయినప్పుడు, వరదలు సంభవించినప్పుడు రేయింబవళ్లు రైల్వే అధికారులు కూడా స్వయంగా పర్యవేక్షించాలని స్పష్టం చేసింది. అలాంటప్పుడు డ్యామ్‌లు, రిజర్వాయర్లు నుంచి వచ్చే నీటి ఉధతిని గమనిస్తూ అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అంతేగాక ఎప్పటికప్పుడు వాతావరణ నివేదికలు, సమాచారానికి అనుగుణంగా ముందుకెళ్లాలని వివరించింది. ఇందులో భాగంగా వాల్తేరు డివిజన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు.

 

కొత్తవలస–కిరండోల్‌ (కేకేలైన్‌) లైన్, కొరాపుట్‌–రాయగడ ప్రధాన లైన్లలో ఉన్న 58 సొరంగాలు (టన్నెల్స్‌), 84 భారీ వంతెనల వద్ద అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. వర్షాకాలంలో కేకేలైన్‌లో తరచూ కొండచరియలు విరిగిపడడం ఆనవాయితీగా మారింది. దీంతో రైల్వేకి కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవిస్తోంది. అలాగే కొండవాలు ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చే గెడ్డలు, వర్షపు నీటికి పలుచోట్ల పట్టాలు కొట్టుకుపోతున్నాయి. ఇప్పుడలాంటి చోట్ల రైళ్లు ప్రమాదానికి గురికాకుండా రైల్వే అధికారులు అప్రమత్తం అవుతున్నారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top