మద్యేమార్గంగా మంతనాలు

మద్యేమార్గంగా మంతనాలు - Sakshi

నూతన నిబంధనలతో మద్యం వ్యాపారులు సతమతం

హైవేలకు దూరంగా దుకాణాల ఏర్పాటుకు యత్నాలు

ప్రజల నిరసనలతో ఉక్కిరిబిక్కిరి

అమలాపురం టౌన్‌ : మద్యం కొత్త పాలసీలో భాగంగా నేషనల్, స్టేట్‌ హైవేలకు నిర్దేశిత దూరాల్లో కొత్త మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలన్న నిబంధనలు లైసెన్సులు పొందిన వ్యాపారులకు, సిండికేట్లకు ఇబ్బందిగా మారింది. ఇన్నాళ్లు ప్రధాన రహదారుల చెంత దుకాణాల్లో దర్జాగా వ్యాపారం చేసిన వారికి కొత్త నిబంధనలు రుచిండం లేదు. నగరం, పట్టణం లేదా గ్రామంలో హైవేలకు కాస్త దగ్గరగా ఉండే అంతర్గత రోడ్లు, బైపాస్‌ రోడ్లను ఎంచుకుంటున్నారు. ఆ రోడ్లలో నివాస గృహాలు, పాఠశాలలు, ఆలయాలు, అంబేద్కర్‌ తదితర జాతీయ నేతల విగ్రహాలు ఉంటున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగుతూ అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నారు. ఇప్పటికే అమలాపురం, అంబాజీపేట, రావులపాలెం తదితర ప్రాంతాల్లో ఈ తరహా నిరసనలు మొదలయ్యాయి. నెల రోజుల కిందట సామర్లకోట, పిఠాపురం తదితర పట్టణాల్లో కూడా కొత్తగా మద్యం దుకాణాలు ఏర్పాటు సన్నాహాలకు అక్కడి ప్రజలు అడ్డంపడిన విషయం తెలిసిందే. ఈ నిరసనలు చేపట్టేందుకు ఎక్కువగా మహిళలే ముందుకు వస్తున్నారు. దీంతో మిగిలిన మద్యం లైసెన్సుదారులు తమ దుకాణాల ఏర్పాట్లను రహస్యంగా చేసుకుంటున్నారు. దుకాణం అద్దెకు ఇచ్చే భవన యాజమానిని లేదా స్థానికులను బతిమాలుకుంటున్నారు. కొంత మంది ఇక చేసేది లేక పట్టణ లేదా గ్రామ శివార్లకు వెళ్లి ఇళ్లు లేని ప్రాంతంలో తాత్కాలిక షెడ్లు నిర్మించుకుని ఏర్పాటుచేసుకుంటుంటుగా, మరి కొందరు శ్మశానాలు, లే అవుట్లు చేసి ఇళ్లు నిర్మించకుండా ఖాళీగా ఉన్న స్థలాల్లో మద్యం దుకాణాలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ తరహాలో అమలాపురం పట్టణం, రూరల్‌ మండలంలో ఇద్దరు మద్యం లెసెన్సుదారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జూలై ఒకటో తేదీ నుంచి అమలు కానున్న కొత్త నిబంధన ప్రకారం హైవేలకు దూరంగా మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. రానున్న పది రోజుల్లో లెసెన్సుదారుల దుకాణ ఏర్పాట్లు ఎంత గుట్టుగా చేసినా ఆయా ప్రాంతాల ప్రజలకు తెలియగానే నిరసనలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. 

నిబంధనలు ఇలా..

కొత్త మద్యం పాలసీ ప్రకారం 20 వేల జనాభా లోపు ఉన్న ప్రాంతంలో మద్యం దుకాణాన్ని నేషనల్, స్టేట్‌ హైవేలకు 220 మీటర్ల దూరంలో ఏర్పాటుచేసుకోవాలి. అంటే ఈ నిబంధన దాదాపు గ్రామాలకు వర్తిస్తుంది. అదే 20 వేల జనాభా ఉన్న ప్రాంతమైతే 500 మీటర్ల దూరంలో ఏర్పాటుచేయాలి. అంటే ఈ నిబంధన మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లకు వర్తిస్తుంది. జిల్లాలో 555 మద్యం దుకాణాలకు ఇటీవల ఎక్సైజ్‌ శాఖ లైసెన్సులు జారీ చేసింది. నేడు వారంతా హైవేలకు దూరంగా దుకాణాలు ఏర్పాటుచేసుకునే పనిలో పడ్డారు. అమలాపురం, రావులపాలెం, పిఠాపురం, సామర్లకోట తదితర చోట్ల ప్రజల అభ్యంతరాలతో ప్రత్యామ్నాయ ప్రదేశాలపై దృష్టి సారిస్తున్నారు. కాగా ప్రభుత్వం ఈ నిబంధనలు కొంచెం సడలించే అవకాశాలు ఉండడంతో జిల్లాలోని మద్యం లైసెన్సుదారులు ఆ కొత్త నిబంధనల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top