ఈ ఏడాది అక్షర దీవెన లేదా..?


కడప కల్చరల్ : పేద, బడుగు వర్గాల పిల్లలకు విద్య పట్ల ఆసక్తి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా అక్షర దీవెన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రతి జూన్ మాసంలో పాఠశాలలు ప్రారంభించిన సందర్భంగా వారం నుంచి పదిహేను రోజులలోపుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేది. ఇందులో భాగంగా స్థానిక దేవాదాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో జిల్లా అంతటా ఎంపిక చేసిన దేవాలయాలలో అనుకున్న ముహూర్తానికి ఒకే సమయంలో ఆ చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం చేయించేవారు.  



దీనికి ప్రభుత్వం పెద్దగా నిధులు ఇచ్చేది కూడా లేదు. దేవాదాయశాఖ ఈఓలు తమతమ ఆలయాల పరిధిలో దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్విహ స్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన దేవాలయాల చుట్టుపక్కల మూడు నుంచి ఐదు సంవత్సరాలలోపు చిన్నారులను సమీకరించి ఆరోజున ఆలయంలో సరస్వతిమాత పూజ నిర్వహించి అర్చకులతో శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం చేయించేవారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు, చిన్నారులకు విద్య పట్ల ఆసక్తి కలుగుతుంది. ఈ కార్యక్రమం విజయవంతం అవుతుండడంతో నాలుగేళ్లుగా ఉత్సాహ భరితంగా నిర్వహిస్తున్నారు.

 

ఈ కార్యక్రమానికి అవసరమైన పలకలు, బలపాలు, పుస్తకాలు, పెన్సిళ్లను స్థానిక దాత లు ఉచితంగా అందజేసేవారు. మరికొందరు దాతలు తీర్థ ప్రసాదాలను అందజే సేవారు. మొత్తంపై ప్రభుత్వానికి ప్రత్యేకించి ఖర్చంటూ ఏమీ లేకపోయినా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం నిర్వహించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది.

 

జిల్లా అంతటా ఈ కార్యక్రమం కోసం పేద, బడుగు వర్గాల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకించి పెద్దగానిధులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు గనుక దాతల సహకారం తప్పక ఉంటుంది గనుక ఇకనైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.

 

ఆదేశాలు లేవు..

అక్షర దీవెన నిర్వహిస్తున్న మాట నిజమే. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన కూడా ఉంది. ఈ సంవత్సరం పలు కార్యక్రమాల ఒత్తిడితో ప్రభుత్వం ఇంకా ఆదేశాలు జారీ చేయలేదు. వీలైనంత త్వరలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కృషి చేస్తాం. - శంకర్‌బాలాజీ, అసిస్టెంట్ కమిషనర్, జిల్లా దేవాదాయశాఖ కడప

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top