వేరుశనగ విత్తడానికి ‘అనంత’ గొర్రు

వేరుశనగ విత్తడానికి ‘అనంత’ గొర్రు - Sakshi


- విత్తనం ఆదా, తగ్గనున్న కూలీల ఖర్చు

- ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్‌ సంపత్‌కుమార్‌




అనంతపురం అగ్రికల్చర్‌ : వేరుశనగ పంట వేయడానికి ‘అనంత’ విత్తనగొర్రు వాడాలని ఏరువాక కేంద్రం (డాట్‌ సెంటర్‌) కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ డి.సంపత్‌కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు. వర్షాలు కురుస్తున్నందున ఆముదం, కంది, కొర్ర, పెసర, జొన్నతో పాటు వేరుశనగ పంట కూడా వేసుకునేందుకు అనుకూలమన్నారు. అరకొర తేమలో పంటలు వేసుకోకూడదన్నారు. మంచి పదును వర్షం పడిన ప్రాంతాల్లో పంటల సాగు చేసుకోవచ్చని వారు తెలిపారు.



‘అనంత’ గొర్రుతో లాభాలు..

వేరుశనగ పంట విత్తుకునేందుకు రైతులు సాధారణ గొర్రు వాడుతున్నారు. దీని వల్ల విత్తనం ఎక్కువ అవసరం అవుతుంది. సాళ్లు, మొక్కల మధ్య సరైన విత్తన సాంద్రత ఉండదు. ఒత్తుగానూ లేదంటే పలుచగా ఉండటం వల్ల కలుపు సమస్య, దిగుబడులు తగ్గడం జరుగుతుంది. అదే అనంత విత్తన గొర్రును వాడితే సాళ్ల మధ్య 30 సెంటీమీటర్లు (సెం.మీ), మొక్కల మధ్య 10 సెం.మీ దూరం ఉంటుంది. దీని వల్ల నిర్ధేశించిన మొక్కల సంఖ్య అంటే చదరపు మీటరుకు 33 మొక్కలు ఉంటాయి. మొక్కలు ఆరోగ్యంగా ఎదిగి పంట దిగుబడులు పెరుగుతాయి.



అనంత విత్తన గొర్రు ద్వారా ఎకరాకు 10 నుంచి 15 కిలోల విత్తనం ఆదా అవుతుంది. కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. ట్రాక్టర్‌తో పాటు ఎద్దులతో నడిచే గొర్రు వాడుకోవాలి. కలుపు తీయడానికి, అంతరకృషికి కూడా అనువుగా ఉంటుంది. ట్రాక్టర్‌ ద్వారా రోజుకు 25 ఎకరాలు, ఎద్దుల ద్వారా రోజుకు 5 నుంచి 8 ఎకరాలు విత్తుకోవచ్చు. ‘అనంత’ గొర్రులు రేకులకుంటలో ఉన్న వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 08554–277963 నెంబర్‌లో సంప్రదించాలి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top