కర్బూజాలో తెగుళ్లు

కర్బూజాలో తెగుళ్లు - Sakshi


అనంతపురం అగ్రికల్చర్‌ : కర్బూజా, కళింగర, దోస పంటలకు ఆశించిన చీడపీడలు, తెగుళ్ల నివారణకు రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.జాన్‌సుధీర్, ఉద్యాన శాస్త్రవేత్త ఆదినారాయణ తెలిపారు. కర్బూజాకు తెగుళ్లు’ పేరుతో ఇటీవల ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందిస్తూ సస్యరక్షణ సిఫారసులు చేశారు.



యాజమాన్య చర్యలిలా..

+ అంత్రాక్నోస్‌ తెగులునే పక్షికన్ను తెగులు అంటారు. గాలిలో తేమశాతం పెరిగి, తేమతో కూడిన వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ఆకులు, కాయలపై నిర్ధిక్ష ఆకారం లేని చిన్న మచ్చలు పసుపురంగులో ఏర్పడిన తర్వాత గోధుమ రంగుకు, తర్వాత నలుపు రంగుకు మారి ఎండి రాలిపోతాయి. ఈ తెగులు, పిందె, కాయలపై కూడా వ్యాపించి వల్ల అభివృద్ధి చెందవు, దీని వల్ల పంట దిగుబడులు తగ్గిపోయి ఆర్థికంగా నష్టం జరిగే అవకాశం ఉంది. నివారణకు 1 గ్రాము కార్బండిజమ్‌ లేదా 3 గ్రాములు కాపర్‌ఆక్సీక్లోరైడ్‌ లేదా 0.5 మి.లీ ప్రొపికొనజోల్‌ ఒక లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.



+ ఫ్యుజేరియం ఎండుతెగులు భూమి నుంచి గాని పనిముట్లపై ఉండే మట్టి, మొక్కలు చిన్నవిగా ఉన్నపుడు తెగులు ఆశిస్తే బీజదళాలు వేలాడుతూ పసుపు రంగులో కనిపిస్తాయి. తెగులు సోకిన తీగలు వడలిపోయి అకస్మాత్తుగా ఎండిపోతాయి. ఆకులు వాడిపోయి ముదురు రంగుకు మారి మొక్కంతా ఎండిపోయి చనిపోతుంది. మొక్కల మొదళ్లను కోసి చూసినపుడు కణజాలం పసుపు నారింజ లేదా గోధుమ రంగులో కనిపిస్తుంది. నివారణకు 1 గ్రాము కార్బండిజమ్‌ లేదా ట్రైకోడెర్మావిరిడీ లేదా 4 గ్రాములు ఫార్ములా–4 కిలో విత్తనానికి పట్టించి విత్తనశుద్ధి చేస్తే విత్తనం ద్వారా వ్యాప్తి చెందే శిలీంధ్రాన్ని నివారించుకోవచ్చు. 3 గ్రాములు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ లీటర్‌ నీటికి కలిపి మొక్కల మొదలు చుట్టూ నేల బాగా తడిచేలా పది రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పోయాలి. అలాగే 2 కిలోల ట్రైకోడెర్మావిరిడీ 50 కిలోల సేంద్రియ ఎరువును ఎకరాకు వేసుకోవాలి.



+ కర్బూజా, కళింగర పంటలకు బూడిద తెగులు సోకింది. నివారణకు 2 మి.లీ హెక్సాకొనజోల్‌ లేదా 2 గ్రాములు రిడోమిల్‌ లీటర్‌ నీటికి కలిపిన తర్వాత 1 గ్రాము డైనోకాప్‌ కలిపి పిచికారి చేసుకోవాలి. అలాగే ప్రస్తుతం అక్కడక్కడ మజ్జిగ తెగులు కనిపిస్తోంది. నివారణకు 0.5 గ్రాములు మైక్రోబుటానిల్‌ లేదా 2 మి.లీ హెక్సాకొనజోల్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top