ఆ గళం..కొండంత బలం..

ఆ గళం..కొండంత బలం.. - Sakshi

‘అగ్రిగోల్డ్‌’పై సర్కారు వైఫల్యాన్ని ఎండగట్టిన జగన్‌

ప్రతిపక్ష నేత ‘సభాసమరం’తో బాధితులకు భరోసా

న్యాయం జరుగుతుందన్న ఆశాభావం

సాక్షి ప్రతినిధి, కాకినాడ : అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరిగేందుకు అసెంబ్లీ వేదికగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కొనసాగించిన పోరాటం వారికి ఎంతో ఊరటనిచ్చింది. బాధితుల తరఫున మేమున్నామంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రెండున్నరేళ్లుగా పోరాటం చేస్తూనే ఉంది. అగ్రిగోల్డ్‌ బాధిత కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై తాజాగా గురువారం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చంద్రబాబు సర్కార్‌ వైఫల్యాన్ని నిగ్గదీశారు. సర్కార్‌ వైఖరిని జగన్‌మోహన్‌రెడ్డి ఎండగట్టిన తీరును టీవీలలో చూస్తూ త్వరలో కొంతైనా న్యాయం జరుగుతుందని జిల్లాలో అగ్రిగోల్డ్‌ బాధితులు విశ్వసిస్తున్నారు. 

 రాష్ట్రవ్యాప్తంగా అగ్రిగోల్డ్‌ బాధితులు 20 లక్షల మంది ఉంటే జిల్లాలో లక్ష మంది వరకు ఉన్నారని అంచనా. అగ్రిగోల్డ్‌లో లక్షలు పెట్టుబడులు పెట్టి రోడ్డు పాలైన బాధితులు అగ్రిగోల్డ్‌లో ఏజెంట్లుగా పనిచేసిన వారిపై విరుచుకుపడుతున్నారు. జిల్లాలో ఈ రకంగా ఏజెంట్లుగా పని చేస్తున్న వారి సంఖ్య 10 వేలకు పైనే ఉంది. అధిక లాభాలు వస్తాయనే గంపెడాశతో అప్పట్లో జిల్లాలో దాదాపు ప్రతి ప్రాంతంలో అనేకులు అగ్రిగోల్డ్‌లో జాయినయ్యారు. వారిలో చిన్న, మధ్యతగరగతి కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి. అగ్రిగోల్డ్‌ నిర్వాకంతో బాధిత కుటుంబాలు చిన్నాభిన్నమైపోయి రోడ్డున పడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఖాతాదారులకు జమ చేయాల్సిన సొమ్ములు విడుదల కాకపోవడంతో బాధితులు ఏజెంట్లపై విరుచుకుపడుతున్నారు. రాజమహేంద్రవరంలో కంచర్ల వీరవెంకటదుర్గాప్రసాద్‌ అనే అగ్రిగోల్డ్‌ ఏజెంట్‌ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజమహేంద్రవరానికి చెందిన దుర్గాప్రసాద్‌  తనకు పరిచయస్తులు, బంధువులను అగ్రిగోల్డ్‌లో చేర్పించి కోట్లు సేకరించి సంస్థకు అప్పగించారు. ఆ సొమ్ము చెల్లించాలంటూ బాధితుల నుంచి వచ్చిన వేధింపులను భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వం మృతుడి కుటుంబానికి మూడు లక్షలు ఇస్తామంటోందని, రూ.10 లక్షలు ఇవ్వాలంటున్నారు. బాధితుల నుంచి ఎదురవుతున్న అవమానాలు భరించలేక ఏజెంట్లు బయటకు వెళ్లలేక నరకయాతన పడుతున్నారు. చివరకు బంధువన్నిళ్లలో శుభకార్యాలకు కూడా వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారు.

ఎక్కడ నిరసన జరిగిన తరలుతున్న జిల్లా బాధితులు

పిల్లల ఉన్నత చదువుల కోసం, వివాహాల కోసం అగ్రిగోల్డ్‌లో  పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని ఆశపడిన కుటుంబాలు ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో ఏ మూల ఆందోళన జరిగినప్పటికీ జిల్లాలో అగ్రిగోల్డ్‌ బాధితులు ఎంతో ఆశతో అక్కడికి తరలి వెళుతున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్రవ్యాప్త ఆందోళనకు కూడా జిల్లా నుంచి బాధితులు పెద్ద ఎత్తున తరలివెళ్లి తమ నిరసనను తెలియచేశారు. 

అగ్రిగోల్డ్‌ ఆస్తులపై సర్కారు పెద్దల కన్ను

చంద్రబాబు సర్కార్‌ అధికారంలోకి వచ్చాక స్వాధీనం చేసుకున్న అగ్రిగోల్డ్‌ ఆస్తులకు బహిరంగ వేలం వేయకపోగా, ఆ ఆస్తులను దొడ్డిదారిన కొట్టేసే ఎత్తుగడలు వేస్తున్నారు తప్ప తమకు న్యాయంచేయడానికి ఆయనకు చేతులు రావడం లేదని బా«ధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచీ వెన్నుదన్నుగా నిలవడమే కాక అసెంబ్లీలో బాధితులకు న్యాయం చేయాలని నిర్దిష్టంగా డిమాండ్‌ చేసిన జగన్‌మోహన్‌రెడ్డి తమకు ఎంతో కొంత మేలుచేసినట్టేనని బాధిత కుటుంబాలు పేర్కొంటున్నాయి. కోట్ల విలువైన ఆస్తులు అగ్రిగోల్డ్‌కు ఉండగాకి చిత్తశుద్ధి ఉంటే గనక వెయ్యి కోట్లు అడ్వాన్సుగా ఇచ్చి  లక్షలాది మంది బాధితులకు న్యాయం చేసేదేనంటున్నారు. అలా కాక అగ్రిగోల్డ్‌లో ప్రధానంగా మంగళగిరిలో హాయ్‌లాండ్‌ను చంద్రబాబు అండ్‌ కో స్వాధీనం చేసుకునే ఎత్తుగడలు వేస్తోందని ఆరోపిస్తున్నారు. రెండున్నరేళ్లుగా అగ్రిగోల్డ్‌ బాధితులను గాలికొదిలేసిన చంద్రబాబుపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి నిలదీసిన తీరుతో తమకు కొండంత ధైర్యం వచ్చిందని అగ్రిగోల్డ్‌ బాధితులు పేర్కొంటున్నారు.

నిబద్ధతతో బాధితుల వాణి వినిపించిన జగన్‌

చంద్రబాబు సర్కార్‌ అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయడంలో బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోంది. అగ్రిగోల్డ్‌ యాజమాన్య ఆస్తులు కొట్టేసేందుకు చూపుతున్న శ్రద్ధ బాధితులకు న్యాయం చేయడంలో చూపడం లేదు. అసెంబ్లీలో చాలా నిబద్ధతతో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధితుల తరఫున తన వాణిని వినిపించారు. సీఎం చంద్రబాబు మంత్రి పుల్లారావు అంశాన్ని ఆసరాగా చేసుకుని అగ్రిగోల్డ్‌ విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. వెయ్యి కోట్లు అడ్వాన్సుగా ఇచ్చి బాధితులకు న్యాయం చేయడం చంద్రబాబు సర్కార్‌కు పెద్ద విషయం కాదు. కానీ ఆ మేరకు చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదు.

-మీసాల సత్యనారాయణ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు, రాజమహేంద్రవరం 

రూ.1,100 కోట్లు ఇచ్చి ఆదుకోవాలి..

అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రభుత్వం రూ.1100 కోట్లు విడుదల చేసి ఆదుకోవాలి. రాష్ట్రంలో పెళ్ళిళ్ళు, తదితర అవసరాల నిమిత్తం సుమారు 19 లక్షల మంది అగ్రిగోల్డ్‌లో డబ్బులు దాచుకున్నారు. అయితే ఆ సంస్థ ఆ డబ్బును రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి మళ్ళించడంతో నేడు డబ్బు దాచుకున్న వారంతా బాధితులుగా మిగిలారు. ఆర్థిక ఒత్తిడులతో ఇంత వరకూ 105 మంది చనిపోయారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణం. హాయ్‌ల్యాండ్‌ యథావిధిగా నడుస్తున్న ప్రభుత్వం దానిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయకపోవడం అనుమానాలు రేకెత్తిస్తుంది. అగ్రిగోల్డ్‌ వ్యవహారాల్లో మంత్రి పత్తిపాటి పుల్లారావు తదితర  టీడీపీ నేతల ప్రమేయం ఉండటం వల్లనే అగ్రిగోల్డ్‌ బాధితుల విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. రూ.1.50 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో బాధితులకు రూ.1,100 కోట్లు విడుదల చేస్తే బాధితులు సమస్యలు తీరతాయి. అగ్రిగోల్డ్‌ ఆస్తులు వేలం వేసి ఆ సొమ్ము మినహాయించుకోవచ్చు. దీనిపై అసెంబ్లీలో వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహనరెడ్డి నిలదీస్తే వేరే అంశాలను లేవనెత్తి చర్చను పక్కదోవ పట్టించారు. అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై జ్యుడిషియల్‌ విచారణ జరిపించి బాధితులకు ఆదుకోవాలని వైఎస్సార్‌ సీపీ డిమాండ్‌ చేస్తోంది.

-చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట

 ఏజెంట్ల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలి

అగ్రిగోల్డ్‌ సంస్థలో పని చేసి ఖాతాదారుల ఒత్తిళ్ళకు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన ఏజెంట్ల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలి. ఖాతాదారుల ఒత్తిళ్ళకు మరి కొందరు ఏజెంట్లు ఆత్మహత్యలకు పాల్పడకుండా ప్రభుత్వం వెంటనే బాధితులకు నష్టపరిహారం అందించాలి. 

–పురెడ్ల శేషు కుమార్, అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు 

వెంటనే ఖాతాదారులకు నష్టపరిహారం చెల్లించాలి..

అప్పులు చేసి అగ్రిగోల్డ్‌ సంస్థలో ఇన్వెస్ట్‌ చేసిన అగ్రిగోల్డ్‌ ఖాతాదారులకు వెంటనే ప్రభుత్వం నగదు చెల్లించాలి. ఎన్నో అశలతో తమ కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం ఖాతాదారులు అగ్రిగోల్డ్‌ సంస్థలో చేరారు. అయితే ప్రభుత్వం సంస్థకు చెందిన ఆస్తులు స్వాధీనం చేసుకున్నప్పటికీ నష్టపరిహారం అందించడంలో జాప్యం చేస్తోంది. దీని వలన ఖాతాదారులు నిరాశకు గురవుతున్నారు. వెంటనే ప్రభుత్వం ఖాతాదారులకు నష్టపరిహారం అందించాలి. 

–ఎం.వి.వి.సత్యనారాయణ, అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రచార కార్యదర్శి 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top