వడ్డీ రాయితీ చంద్రశేఖరా!

వడ్డీ రాయితీ చంద్రశేఖరా!


పేరుకుపోయిన వడ్డీ రాయితీ బకాయిలు

మహిళల వద్ద వడ్డీ వసూలు చేసిన బ్యాంకర్లు

ఆర్థిక ఇబ్బందుల్లో ఎస్‌హెచ్‌జీ మహిళలు




అధికారులు మా చేతుల్లో లేదంటున్నారు.. వడ్డీ రాయితీ బకాయిలు చాలా రోజులుగా రావాల్సి ఉంది. అధికారులను  అడిగితే మా చేతుల్లో లేదంటున్నారు. వడ్డీ కట్టలేక మహిళా సంఘాల సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ రాయితీ నిధులు విడుదల చేయాలి.  ఈనెల 5న జరిగిన జిల్లా సమాఖ్య సమావేశంలో ఈ అంశాన్ని చర్చించాం. – సఫియా బేగం, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు



స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)   మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే  లక్ష్యంతో  అమలు చేస్తున్న వడ్డీలేని రుణాల పథకం   అభాసుపాలవుతోంది. వడ్డీ రాయితీ నిధుల విడుదలలో సర్కారు    నిర్లక్ష్యం కారణంగా ఈ పథకం నీరుగారుతోంది. దీంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకుని స్వయం ఉపాధి పొందాలని భావిస్తున్న  ఎస్‌హెచ్‌జీ మహిళలపై వడ్డీ భారం పడుతోంది. – సాక్షి, నిజామాబాద్‌  



నిజామాబాద్‌ : జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు బ్యాంకు లింకేజీ కింద రుణాలు మంజూరు చేస్తున్నారు. ఈ రుణాలపై సుమారు 12 నుంచి 14 శాతం వరకు బ్యాంకు వడ్డీలు వసూలు చేస్తున్నాయి. రుణాలు పొందిన మహిళలు సకాలంలో చెల్లించిన వారికి ఈ వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ముందుగా మహిళలు ఈ వడ్డీ, అసలు కలిపి చెల్లిస్తే.. ఆ వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే రెండున్నరేళ్లుగా ఈ వడ్డీ రాయితీ బకాయిలు పేరుకు పోయాయి. 2015 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలు ఇప్పటికీ మహిళల ఖాతాల్లో జమ కాలేదు. దీంతో ఈ మహిళా సంఘాల సభ్యులు ఏళ్ల తరబడి వడ్డీ భరించాల్సి వస్తోంది.



ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా..

జిల్లాలో 2016–17 ఆర్థిక సంవత్సరంలో 20,285 సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్యాంకు లింకేజీ కింద వీరికి రూ.367.68 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. డిసెంబర్‌ నెలాఖరు వరకు 10,035 సంఘాలకు రూ.199.99 కోట్లు రుణాలు ఇవ్వాల్సి ఉంది. కానీ కేవలం రూ.168.81 కోట్లు మాత్రమే రుణాలివ్వగలిగారు. నిర్దేశిత లక్ష్యంలో కేవలం 84.41 శాతం మాత్రమే రుణాలివ్వగలిగారు. ఈ రుణాలకు సంబందించి వడ్డీలేని రాయితీ రూ.24.93 కోట్లు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే మరో మూడు నెలలైతే ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నప్పటికీ.. ఈ వడ్డీ రాయితీ నిధులు జాడ లేదు. దీంతో వడ్డీతో సహా రుణాలు చెల్లించిన మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.



రెండేళ్లుగా బకాయిలు..

కేవలం ఈ ఆర్థిక సంవత్సరంలోనే కాదు రెండేళ్లుగా ఈ వడ్డీ రాయితీ బాకాయిలు జిల్లాలో పేరుకు పోయాయి. 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలు ఇప్పటికీ విడుదల కాకపోవడం గమనార్హం. 2014–15 ఆర్థిక సంవత్సరంలో 19,706 సంఘాలకు రూ.35.89 కోట్లు వడ్డీ రాయితీ రావాల్సి ఉండగా, రూ.31.28 కోట్లు మాత్రమే వచ్చాయి. మిగిలిన రూ.4.61 కోట్లు ఇప్పటికీ జాడ లేదు. అలాగే 2015–16లో 21,285 సంఘాలకు రూ.38.87 కోట్ల వడ్డీ రాయితీ రావాల్సి ఉండగా, కేవలం రూ.2.02 కోట్లు మాత్రమే వచ్చాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top