రెండు గనులకు ఒక్కరే..!

రెండు గనులకు ఒక్కరే..! - Sakshi


► జీడీకే–2, 2ఏ గనులపై పర్యవేక్షణ కరువు

► ప్రమాదాలకు దారితీస్తున్న యాజమాన్య వైఖరి


గోదావరిఖని : సింగరేణి రామగుండం రీజియన్  ఆర్జీ–1 డివిజన్ లోని జీడీకే–2, 2ఏ గనులు వేర్వేరుగా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నా...వాటిని ఒకే గ్రూపు కిందకు తీసుకువచ్చి ఒక్కరే అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. దీంతో అధికారులపై ఒత్తిడి పెరిగి ఈ గనులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించే పరిస్థితి లేకుండా పోతున్నది. తదనుగుణంగా కార్మికులు అభ్రతతకు లోనవుతుండగా...రక్షణ చర్యలు లేక ప్రమాదాలకు గురవుతున్నారు. ఆర్జీ–1 డివిజన్ లో జీడీకే–2వ గనిలో వెయ్యికిపైగా, జీడీకే–2ఏ గనిలో 700 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. గతంలో ఈ రెండు గనులు వేర్వేరుగా పనిచేసేవి. ప్రతీ గనికి మేనేజర్, వెల్ఫేర్‌ ఆఫీసర్, వెంటిలేషన్ ఆఫీసర్, సేఫ్టీ ఆఫీసర్‌ తదితర విభాగాలకు అధికారులు వేర్వేరుగా ఉండేవారు.


2009లో ఈ రెండు గనులను ఒక్కటిగా చేసి ఒకే గ్రూపు మైన్ గా మార్పు చేశారు. అయితే జీడీకే–2వ గనికి, జీడీకే–2ఏ గనికి భూగర్భంలో టన్నెల్‌ ఏర్పాటు చేయకపోవడంతో ఈ గనుల్లోకి కార్మికులు వేర్వేరుగా వెళ్లి పనిచేస్తున్నారు. జీడీకే–2వ గనిలో 9 ఎస్‌డీఎల్‌ యంత్రాల ద్వారా రోజుకు 1200 టన్నుల బొగ్గు ఉత్పత్తి, జీడీకే–2ఏ గనిలో ఆరు ఎస్‌డీఎల్‌ యంత్రాల ద్వారా 800 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. రెండు గనుల్లో కార్మికులు పనిచేస్తున్నా అధికారులు ఒక్కరే కావడంతో గనుల్లో ఏర్పడే సమస్యలను పరిశీలించేందుకు వారికి అనుకూల సమయం లభించడం లేదు.  2013లో రెండు గనులకు సంబంధించి గని మేనేజర్లను, వెల్ఫేర్‌ ఆఫీసర్లను, వెంటిలేషన్ ఆఫీసర్లను నియమించాలని కార్మిక సంఘాలు పలు కమిటీల సమావేశాలలో యాజమాన్యాన్ని కోరినా పట్టించుకున్న పాపానపోలేదు.


ఈ క్రమంలో అధికారుల పర్యవేక్షణ లోపం, పని ఒత్తిడి కారణంగా పనిస్థలాలపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతోనే శుక్రవారం తెల్లవారుజామున జీడీకే–2ఏ గనిలో సైడ్‌ బొగ్గు కూలిన ప్రమాదంలో సపోర్ట్‌మెన్లు ముస్కె ఓదెలు, పైడిపల్లి రాజయ్య తీవ్రంగా గాయపడ్డారు. ఇదే ఘటనలో వై.వెంకటస్వామి, తిప్పర్తి స్వామి, డి.శంకరయ్యకు స్వల్పగాయాలయ్యాయని కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.



ఇసుక నింపకపోవడంతోనే.. –  హెచ్‌ఎంఎస్‌

జీడీకే–2ఏ గనిలోని ఒకటో సీమ్‌ ఇరవైమూడున్నర లెవల్, 40 డిప్‌ ప్రాంతంలో జరుగుతున్న పనులపై అండర్‌ మేనేజర్‌ పర్యవేక్షణ లేదని, గతంలో వెలికితీసిన బొగ్గు ప్రాంతంలో సరిగ్గా ఇసుక నింపకపోవడం మూలంగానే బొగ్గు వదులుగా మారి పనిచేస్తున్న సపోర్ట్‌మెన్  కార్మికులపై సైడ్‌ బొగ్గు పడిందని హెచ్‌ఎంఎస్‌ నాయకులు ఆరోపించారు. ప్రమాదం జరిగిన తర్వాత యూనియన్  ఉపాధ్యక్షులు యాదగిరి సత్తయ్య, షబ్బీర్‌ అహ్మద్, జూపాక రాజయ్య, కాటిక శ్రీనివాస్‌ తదితరులు పనిప్రదేశం వద్దకు వెళ్లి పరిశీలించారు.


పనిస్థలంలో పక్కనున్న బొగ్గు కూలకుండా రక్షణ చర్యలు చేపడుతున్నప్పటికీ సరిగ్గా ఇసుక నింపకపోవడం వల్లనే కదలికలు ఎక్కువగా ఏర్పడి బొగ్గు కూలిందని వారు పేర్కొన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top