అబొబ్బా!

అబొబ్బా! - Sakshi


ఏసీబీ అధికారులకు పట్టుబడిన విదేశీ, స్వదేశీ నగదు, బంగారు, వెండి ఆభరణాలు



తిరుపతి క్రైం : దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకున్నారో.. ఏమో మరి..! మరో నెలలో ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా జెడ్పీ సీఈవో బొబ్బారామిరెడ్డి భారీ అవినీతి, అక్రమాలకు తెరలేపారు. అడ్డదిడ్డంగా ఆస్తులు కూడబెట్టే పనిలో తలమునకలయ్యారు. పక్కా సమాచారంతో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులకు తెగబడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 14 చోట్ల సోదాలు నిర్వహించారు. తిరుపతిలో ఆయన సన్నిహితుడు, టీటీడీ డెప్యూటీ తహశీల్దార్‌ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. పలు కీలక దస్తావేజులు, భారీగా నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. మరో మూడు ఇళ్లలో సోదాలు నిర్వహించాల్సి ఉందని, తర్వాతే ఆస్తుల విలువ వెలగడతామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.



మరో నెలలో ఉద్యోగ విరమణ..

బొబ్బారామిరెడ్డి నెల్లూరులోని చిల్డ్రన్స్‌పార్క్‌ సమీపంలో నివాసముంటున్నారు. ఆయన గతంలో తిరుపతిలో ఆర్‌డీవోగా, టీటీడీ ఎస్టేట్‌ ఆఫీసర్‌గా, టీటీడీ డిప్యూటీ ఈవోగా, శ్రీకాళహస్తి ఈవోగా  పనిచేశారు. ప్రస్తుతం నెల్లూరులో జెడ్పీ సీఈవోగా, పంచాయతీ రాజ్‌శాఖ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన మార్చిలో ఉద్యోగ విరమణ చేయనున్నట్టు సమాచారం. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఏసీబీ అధికారులు ఆయన నివాసంలో సోదా లు నిర్వహించారు. మొత్తం రూ.2 కోట్ల విలువైన ఆస్తులు దొరికినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

భారీగా ఆస్తులు..

జెడ్పీ సీఈవోకు గుంటూరుతో పాటు తిరుపతిలోనూ 10కి పైగా ప్లాట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో రూ.50 లక్షల వరకు పలువురికి అప్పుగా ఇచ్చినట్లు తేల్చారు. పలుబ్యాంక్‌ లాకర్లు తనిఖీ చేయాల్సి ఉంది.



టీటీడీ డెప్యూటీ తహసీల్దార్‌ ఇంట్లో సోదాలు

తిరుపతి ఏసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి, సీఐలు సుధాకర్‌రెడ్డి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అధికారులతో కలసి నగరంలోని నాలుగు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. జెడ్పీ సీఈవో బొబ్బారామిరెడ్డి స్నేహితుడైన టీటీడీ డెప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న పెద్దయ్యనాయుడు ఇంట్లోనూ సోదాలు జరిగాయి. ఈయన పెద్ద కాపులేఔట్‌లోని అశోక అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. స్వదేశీ, విదేశీ నగదుతో పాటు దస్తావేజులు, వెండి, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నగరంలోని మరో మూడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నామని, పూర్తి స్థాయిలో ఆస్తులు గుర్తించే వరకు వెలకట్టలేమని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top