స్త్రీలను అసభ్యకరంగా చిత్రీకరిస్తే..

స్త్రీలను అసభ్యకరంగా చిత్రీకరిస్తే.. - Sakshi


జగిత్యాల:

స్త్రీలను కించపర్చేలా.. అసభ్యకరంగా చిత్రీకరిస్తూ.. పలు పోస్టర్లు వెలుస్తున్నాయి. సినిమాల్లోనూ ఇలాగే కొనసాగుతోంది. ఇలాంటివాటితో స్త్రీలపై చెడుఆలోచన కలిగే అవకాశం ఉండటంతోపాటు నైతిక విలువలు దిగజారే అవకాశం ఉంటుందని, స్త్రీల ఆత్మగౌరవానికి భంగం కలుగుతున్నందున ప్రభుత్వం 1986లో స్త్రీల అసభ్య చిత్రీకరణ నిషేధ చట్టాన్ని తీసుకొచ్చిందంటున్నారు జగిత్యాల బార్‌ అసొసియేషన్‌ న్యాయవాది గుంటి గోపాల్‌. మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే..



అసభ్యకరంగా చిత్రీకరించడం అంటే

ఒక స్త్రీ ఆకృతినిగానీ.. ఆమె శరీరంలోని అవయవాలనుగానీ.. ఆమె శరీరాన్ని అవమానపర్చేలా చిత్రీకరించడం. చట్టంలోని సెక్షన్‌–3 ప్రకారం స్త్రీలను అసభ్యంగా చిత్రీకరిస్తూ ప్రకటనలను ప్రచురించడం.. ఎగ్జిబిట్‌ చేయడం శిక్షార్హం. ఈ చట్ట పరిధిలో నేరానికి పాల్పడిన వ్యక్తికి రేండేళ్లజైలు, రూ.రెండువేల వరకు జరిమానా విధించబడుతుంది. అయినప్పటికీ సదరు వ్యక్తిలో మార్పు రాకుంటే ఆర్నెల్లకు తగ్గకుండా ఐదేళ్లవరకు జైలు శిక్ష విధించబడుతుంది. రూ.పదివేలకు తగ్గకుండా.. రూ.లక్షవరకు జరిమానా ఉంటుంది.



అసభ్యకరమైన పుస్తకాలను చిత్రీకరించినా..

అలాగే సెక్షన్‌–4 ప్రకారం స్త్రీని అసభ్యకరంగా చిత్రీకరించిన పుస్తకాలను, కరపత్రాలను, కళాఖండాలను, ఫొటోగ్రఫీలను, సినిమాలను, రచనలను, చిత్రలేఖనాలను, పెయింటింగ్‌లను విక్రయించడం కాని లేదా అద్దెకు ఇవ్వడం కాని లేదా పబ్లిక్‌గా పంచడం కాని లేదా పోస్టు ద్వారా ఇతరులకు పంపడం కాని చేస్తే.. అది శిక్షార్హమైన నేరంగానే పరిగణించబడుతుంది. ఈలాంటి నేరానికి పాల్పడిన వ్యక్తికి రెండేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.రెండువేల వరకు జరిమానా విధించబడుతుంది. అయినా అతడిలో మార్పురాకుండా అదే నేరానికి పాల్పడితే.. ఆర్నెల్లకుతగ్గకుండా జైలుశిక్ష, రూ.పదివేలకు తగ్గకుండా జరిమానా విధిస్తారు.



చట్టం మినహాయింపులు

ఏదైన పుస్తకం లేదా కరపత్రం, పత్రిక, స్లైడ్, ఫిలిం, రచన, చిత్రలేఖనం, పెయింటింగ్, ఫొటోగ్రఫి మొదలైన వాటిలో స్త్రీని అసభ్యకరంగా చిత్రకరిస్తే.. సదరు పుస్తకం శాస్త్రీయ అవసరాలకు లేదా సాహిత్య లేదా కళారంగాలకు లేదా ప్రజలను చైతన్యవంతులను చేయడానికి లేదా ప్రజా సంక్షేమానికి ఉపయోగపడేదిగా ఉండాలి. అయితేనే నేరంగా పరిగణించబడదు. అలాగే సదరు పుస్తకం మతవిశ్వాసాలకు సంబంధించి ఉండటంతోపాటు అందుకోసం ఉపయోగించినట్లేయితే శిక్షార్హమైన నేరంగా పరిగణించరు. ఏదైనా పురాతన కట్టడం లేదా దేవాలయం లేక మత సంబంధ ఊరేగింపుల్లో ఉపయోగించు రథం మొదలైన వాటిపై స్త్రీని అసభ్యకరంగా చిత్రీకరింపబడినప్పటికీ.. ఈ చట్టం కింద నేరం కాదు. ఈ నేరాలన్ని కూడా బెయిల్‌ ఇవ్వదగిన నేరాలు.



ఫిర్యాదులు వచ్చినప్పుడు

స్త్రీని అసభ్యకరంగా చిత్రీకరిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన గెజిట్‌డ్‌ అధికారిగానీ, లేదా చట్టం పరిధిలో నేరాన్ని పరిశీలిస్తున్న పోలీసు అధికారులుగానీ ఏ ప్రదేశంలోనైనా ప్రవేశించి, అవసరమైన వస్తువులను సోదా చేయవచ్చు. ఈ దశలో చట్టానికి విరుద్ధంగా ఉన్న దేనినైనా స్వాధీనం చేసుకోవచ్చు. సోదాలకు సంబంధించి క్రిమినల్‌ ప్రోసిజర్‌ కోడ్‌లోని నిబంధనలే ఈ చట్టానికి వర్తిస్తాయి.



మహిళలకు అండగా న్యాయ సేవా అధికార సంస్థ

ఇటీవల మహిళలపై అఘాయిత్యాలతోపాటు అనేక రకమైన వేధింపులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పోలీసుశాఖ ఆధ్వర్యంలో షీటీంలను ఏర్పాటు చేసింది. ఏదైనా విషయాన్ని కింది స్థాయి పోలీసులకు చెప్పితే పబ్లిక్‌ అవుతుందనే ఉద్దేశం ఉంటే, నేరుగా జిల్లాల పోలీసు బాస్‌లకు తమ సమస్యను చెప్పుకోవచ్చు. పోలీసులకు చెప్పుకుంటే న్యాయం జరుగుతుందో..? లేదోనన్న సంశయం ఉంటే నేరుగా ఆయా కోర్టుల పరిధిలో ఉండే న్యాయ సేవా అధికార సంస్థలను ఆశ్రయించవచ్చు.



ఈ సేవా అధికార సంస్థల్లో ఆ కోర్టు పరిధిలోని జడ్జిలు చైర్మన్‌లుగా ఉంటారు. రాణి రుద్రమదేవి నుంచి మధర్‌ థెరిస్సా వరకు మహిళలు కేవలం వంటింటికి మాత్రమే పరిమితం కాదని నిరూపించారు. నేటి మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తూ.. ఆర్థిక, సామాజిక, సంస్కృతి పరంగా అగ్రభాగాన జయకేతనం ఎగురవేస్తున్నారు. గ్రామీణ స్త్రీలు ఆత్మనూన్యత భావానికి లోనుకాకుండా సమస్య ఎదురైనప్పుడు, విశాల దృక్పథంతో పరిష్కరించుకునేందుకు ముందుకు కదలాలి. అప్పుడే స్త్రీకి విజయం. నేటి సమాజానికి ఆదర్శం.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top