ఆర్మీ రన్ @ 6

ఆర్మీ రన్ @ 6


♦ ఆరో రోజు ఆరు జిల్లాల వారికి ఎంపికలు

♦ దేహ దారుఢ్య పరీక్షలకు 399 మంది

♦ ఆరో రోజు.. ఆరు జిల్లాల అభ్యర్థుల హాజరు

 ♦ ‘సోల్జర్ ట్రేడ్స్‌మెన్’కు ఎంపికలు

♦ పరుగును ప్రారంభించిన సింగరేణి డెరైక్టర్(పా)


 దేశ రక్షణే తమ ముందున్న లక్ష్యం.. తరగని దీక్షతో రక్షణ విభాగంలో చేరడమే ధ్యేయం.. జిల్లాలు దాటొచ్చి పరుగుపందెంలో సత్తా చాటుతున్నారు.. భారీగా తరలివచ్చిన యువకులకు ఆర్మీ అధికారులు విడతలవారీగా పోటీలు నిర్వహిస్తున్నారు.  - కొత్తగూడెం


మొక్కవోని ఆత్మవిశ్వాసం.. ఉద్యోగం సాధించాలనే తపన.. ఎంతో శ్రమకోర్చుతేగానీ తీయలేని పరుగు.. నెలల తరబడి శిక్షణ.. ఆర్మీకి ఎంపికై దేశ సేవ.. ఉపాధి పొందవచ్చని పలువురు దౌడు తీస్తున్నారు. కొత్తగూడెంలో నిర్వహిస్తున్న ర్యాలీలో కొందరు యువకులు పులుల్లా పరుగులు పెడుతుండగా.. మరికొందరు పడుతూ.. లేస్తూ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. పుల్‌అప్స్, లాంగ్‌జంప్, బ్యాలెన్సింగ్ బీమ్‌లో ప్రతిభ చూపి ముందుకెళ్తున్నారు.


కొత్తగూడెంలో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ మంగళవారం 6వ రోజుకు చేరింది. రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు చెందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన, దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించారు. సోల్జర్ ట్రేడ్స్‌మన్ విభాగానికి 5,880 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒకరోజు ముందుగానే చేరుకున్న అభ్యర్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద వేచి ఉన్నారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంట ల కు జూనియర్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమైం ది.



తొలుత ఎత్తు కొలిచి.. సర్టిఫికె ట్ల పరిశీలన కోసం ఆర్మీ సిబ్బంది పంపించారు. రెవెన్యూ సిబ్బంది అభ్యర్థులకు సంబంధించిన అన్నిరకాల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన తర్వాత దేహదారుఢ్య పరీక్షలకు పంపించా రు. ప్రకాశం స్టేడియంలో వాటిని విడతలవారీగా నిర్వహించారు. అభ్యర్థుల చేతులపై పచ్చబొట్లు, పుట్టుమచ్చలను ఆర్మీ అధికారులు పరిశీలించి కొందరిని వెనక్కు పంపించారు. అనంతరం పుల్‌అప్స్, బ్యాలెన్సింగ్ బీమ్, లాంగ్‌జంప్‌లో ఎంపికలు కొనసాగాయి.


 అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

ఆర్మీ ర్యాలీలో భాగంగా ప్రకాశం స్టేడియంలో అభ్యర్థుల పరుగుపందెంను సింగరేణి డెరైక్టర్(పా) జె.పవిత్రన్‌కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. తొలుత ఆయన మాట్లాడుతూ ఇండియన్ ఆర్మీలో చేరేందుకు కల్పించిన ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్మీ ర్యాలీ కోసం సింగరేణి ఆధ్వర్యంలో ఎంపిక చేసిన అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. రానున్న కాలంలో శిక్షణ కొనసాగిస్తామన్నారు. అనంతరం అధికారుల ను ఆర్మీ ర్యాలీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.


 నేటితో ముగియనున్న పరీక్షలు

దేహ దారుఢ్య పరీక్షలు బుధవారంతో ముగియనున్నాయి. ఇప్పటివరకు సోల్జర్ టెక్నికల్, సోల్జర్ క్లర్క్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ జనరల్ డ్యూటీ విభాగాలతోపాటు సోల్జర్ ట్రేడ్స్‌మన్ విభాగంలో అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలు జరిగాయి. బుధవారం సోల్జర్ ట్రేడ్స్‌మన్ విభాగంలో అభ్యర్థులకు, రిలీజియన్ టీచర్ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్, డీఎస్సీ విభాగాల్లో దేహ దారుఢ్య పరీక్షలు కొనసాగనున్నాయి. ఈనెల 14 వరకు అన్ని విభాగాల్లో దేహ దారుఢ్య పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. మెడికల్‌లో ఎంపికైన అభ్యర్థులకు సికింద్రాబాద్‌లో రాత పరీక్ష నిర్వహించి.. ఆర్మీకి ఎంపిక చేయనున్నారు.


సేవలో కార్మికులు, యువత

కొత్తగూడెం అర్బన్ : ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో మున్సిపల్ కార్మికులు, యువకు లు సేవలందిస్తున్నారు. మున్సిపాలిటీలో పనిచేసే 180 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రకాశం స్టేడియం, జూనియర్ కళాశాల, భోజనశాల వద్ద ఉంటూ.. అక్కడి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. అభ్యర్థులు తాగేందుకు మినరల్ వాటర్ అందిస్తున్నారు. అలాగే పట్టణానికి చెంది న పలువురు యువకులు వంటశాల వద్ద ఉంటూ.. భోజనాలను అభ్యర్థులకు వడ్డిస్తున్నారు.


వరంగల్‌లో విజయం సాధించాలి

రుద్రంపూర్ : ఇప్పుడు పరుగెత్తలేని వారు మళ్లీ శిక్షణ పొంది.. వరంగల్‌లో ఏప్రిల్‌లో జరగనున్న ఆర్మీ ర్యాలీలో పాల్గొని విజయం సాధించాలని ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీసర్ పవన్ హిరోషి అన్నారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జరిగే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ సందర్భంగా పరుగుపందెంలో పాల్గొనే అభ్యర్థులను ఉత్సాహపరిచారు. 


 క్యాంప్‌ను పరిశీలించిన జీఎం

సింగరేణి సౌజన్యంతో ప్రకాశం స్డేడియంలో జరిగే ఆర్మీ క్యాంప్‌ను జీఎం పర్సనల్, సీఎ స్సార్ ఏ.ఆనందరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ర్యాలీ నియామక పద్ధతుల గురించి ఆర్మీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పరుగుపందెం, పుల్‌అప్, లాంగ్‌జంప్, బ్యాలెన్స్ వాకింగ్‌తోపాటు వైద్య శిబిరాలను పరిశీలించారు. వివరాలను డాక్టర్ సత్యజిత్‌ను అడిగి తెలుసుకున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top