ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి


కడప ఎడ్యుకేషన్‌:  రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంవత్సరం ముగింపును మార్చికే కుదించడం వలన విద్యార్థుల్లో, ఉపాధ్యాయులలో గందరగోళ పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు వేంపల్లి నరసింహారెడ్డి డిమాండ్‌ చేశారు. కడప నగరం ఎస్టీయూ భవన్‌లో ఆదివారం ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో ఉపాధ్యాయ ఎన్నికలు, పదో తరగతి కార్యచరణ ప్రణాళిక అమలు, ఫ్రీపైనల్‌ పరీక్షలు , ఈ మధ్యనే పూర్తయిన సంగ్రాహణాత్మక-2 పరీక్షలు, వాటి బాహ్య మూల్యాంకనం నిర్వహించాల్సి ఉందన్నారు. వీటితోపాటు త్వరలో ఎఫ్‌ఏ -4 పరీక్షల నిర్వహణ ఉండగా సిలబస్‌ పూర్తికాలేదని ఇంతలో అన్ని పరీక్షలను మార్చి 20 నాటికి పూర్తి చేయాలంటే కష్టమన్నారు. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మేధావులు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్‌బాబు, జిల్లా అధ్యక్షుడు రఘునాథరెడ్డిలు మాట్లాడుతూ కత్తి నరసింహారెడ్డిని గెలిపించి ఉపాధ్యాయ ఉద్యమాన్ని నిలబెట్టాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయరామయ్య, రాష్ట్ర నాయకులు రవీంద్రనాథరెడ్డి, వెంకటరమణ, ఆదిశేషారెడ్డి, జిల్లా నాయకులు సాంబశివారెడ్డి, పాలకొండయ్య, శ్రీనివాసులు, శంకరయ్య, శివారెడ్డి, గౌరీశంకర్, హైదర్‌వలి, దాదాపీర్, బద్వేల్‌ సునిత్‌ తదితరులు పాల్గొన్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top